పకడ్బందీగా ఇంటర్‌ పరీక్షలు


రెండు జిల్లాల్లో 88 సెంటర్లు, 56,375 మంది విద్యార్థులు

ఉదయం 9 నుంచి 12 గంటల వరకు పరీక్ష

నిమిషం ఆలస్యమైనా అనుమతి లేదు

మాస్‌కాపీయింగ్‌కు పాల్పడితే డిబారే

సాక్షి ప్రత్యేక ఇంటర్య్వూలో

     ఇంటర్‌ విద్యాశాఖాధికారి ఆండ్రూస్‌




ఖమ్మం జెడ్పీసెంటర్‌: ఇంటర్‌ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశాం. మాస్‌ కాపీయింగ్‌కు అవకాశం లేకుండా సీసీ కెమెరాలు ఏర్పాటుతో పాటు జంబ్లింగ్‌ విధానం అమలు చేస్తున్నాం. ప్రణాళికాబద్ధంగా పరీక్షా కేంద్రాలను గుర్తించాం. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందస్తుగా అన్ని సదుపాయాలు కల్పిస్తున్నాం. విద్యా, వైద్య, ఆరోగ్య, పోలీస్, ఆర్టీసీ, పోస్టల్‌ డిపార్ట్‌మెంట్లను సమన్వయం చేస్తూ చర్యలు తీసుకుంటున్నామని ఆదివారం సాక్షికి ఇచ్చిన ప్రత్యేకఇంటర్య్వూలో  ఇంటర్‌ విద్యాశాఖాధికారి ఆండ్రూస్‌ తెలిపారు. పరీక్షల ఏర్పాట్లపై పలు అంశాలను వివరించారు. ఇంటర్య్వూ ఆయన మాటల్లోనే...



సాక్షి: ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఎన్ని పరీక్షా కేంద్రాలు?

డీఐఈఓ: ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో మొత్తం 88పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశాం. వాటిలో ఖమ్మంలో 55 సెంటర్లు వీటిలో 18 ప్రభుత్వ, ఒకటి ఎయిడెడ్, ఆరు సోషల్‌ వెల్ఫేర్, ఒకటి మోడల్‌ స్కూల్, ఒక హైస్కూల్, 28 ప్రైవేటు కళాశాలలున్నాయి.  భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 33 సెంటర్లు ఉన్నాయి. వీటిలో 13 ప్రభుత్వ, 3 సోషల్‌వెల్ఫేర్, 4 ట్రైబల్‌ వెల్ఫేర్, 13 ప్రైవేటు కళాశాలలున్నాయి.



సాక్షి: రెండు జిల్లాల్లో ఎంతమంది విద్యార్థులు  పరీక్షలు రాయనున్నారు?

డీఐఈఓ: రెండు జిల్లాల్లో 56,375 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. వీరిలో ఖమ్మం జిల్లాలో 35,744 మంది, ప్రథమ సంవత్సరం 18 వేలు, ద్వితీయ సంవత్సరం 17,744 మంది రాయనున్నారు. భద్రాద్రి జిల్లాలో 20,631 మంది విద్యార్థులు కాగా, వీరిలో మొదటి సంవత్సరం 8,111, ద్వితీయ సంవత్సరం 8,281 మంది విద్యార్థులున్నారు.



సాక్షి: పరీక్షలు ఎప్పుడు ప్రారంభమవుతాయి?

డీఐఈఓ: మార్చి 1 నుంచి 14 వరకు  పరీక్షలు జరగనున్నాయి. 9న జరగాల్సిన పరీక్ష 19న నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. మాస్‌కాపీయింగ్‌కుపాల్పడితే డిబార్‌చేస్తాం. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాల్సిందే.



సాక్షి: పరీక్షల నిర్వహణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?

డీఐఈఓ: జిల్లాల్లో పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు పోలీస్‌ బందోబస్తుతో పాటు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశాం. మాస్‌ కాపీయింగ్‌ జరగకుండా ఇన్విజిలేటర్లను లాటరీ పద్ధతిలో ఎంపిక చేయనున్నాం. పరీక్షలు జంబ్లింగ్‌ విధానంలో జరగనున్నాయి.



సాక్షి: సమస్యాత్మక కేంద్రాలను గుర్తించారా? జిల్లాలో ఎన్ని ఉన్నాయి?

డీఐఈఓ: గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని పటిష్ట చర్యలు తీసుకుంటున్నాం. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో ఒక సమస్యాత్మక  కేంద్రం ఉంది.



సాక్షి: విద్యార్థులకు ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు?

డీఐఈఓ: విద్యార్థులకు పరీక్షా కేంద్రాల్లో అన్ని మౌలిక సదుపాయాలు ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నాం.  కింద కూర్చొని పరీక్షలు రాయకుండా   ఏర్పాట్లు చేశాం. అన్ని కేంద్రాల్లో డెస్క్‌ బెంచీలు ఏర్పాటు చేస్తున్నాం. మంచినీరు, విద్యుత్, మెడికల్‌ క్యాంపులు ఉండేలా చూస్తున్నాం.



సాక్షి: ప్రాక్టికల్స్‌ నిర్వహణ సక్రమంగా జరగలేదన్న వాదన ఉంది కదా?

డీఐఈఓ: ప్రాక్టికల్స్‌ నిర్వహణ పక్కాగా నిర్వహించాం. ప్రతిభ ఉన్నవారికే మార్కులు వస్తాయి. దీనిపై ఎలాంటి అనుమానాలకు తావు లేదు. పనితనాన్ని బట్టే మార్కులుంటాయి.



సాక్షి: పరీక్ష కేంద్రంలోకి ఎన్ని గంటలకు అనుమతిస్తారు?

డీఐఈఓ:  8 గంటల నుంచి విద్యార్థులను అనుమతిస్తాం. 9 గంటల తర్వాత నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదు. ఇవే ఆదేశాలు అన్ని సెంటర్లకు జారీ చేశాం.



సాక్షి: పరీక్షా కేంద్రాలపై ఎలాంటి నిఘా ఉంది?

డీఐఈఓ: ప్రతికేంద్రం వద్ద పోలీస్‌బందోబస్తు ఉంటుంది. సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నాం. పరీక్షల నిర్వహణపై హైపవర్‌ కమిటీ మెంబర్లు ఉన్నారు. రెండుజిల్లాలకు ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు. ఐదు ఫ్లయింగ్‌ స్క్వాడ్, 60 మంది చీఫ్‌ సూపరింటెండెంట్లు, ఏడుగురు సిట్టింగ్‌ స్క్వాడ్, 88 మంది డిపార్ట్‌ మెంటల్‌ అధికారులు, నలుగురు డీఈసీ మెంబర్లు పరీక్షల నిర్వహణను పర్యవేక్షిస్తారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top