అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్

అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్


సత్తుపల్లి: నమ్మించి మోసగిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను సత్తుపల్లి పోలీసులు పట్టుకున్నారు. సత్తుపల్లి డీఎస్పీ బి.అశోక్‌కుమార్ బుధవారం స్థానిక పోలీస్ స్టేషన్‌లో విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. మహారాష్ట్ర నాగపూర్‌కు చెందిన కిషోర్ రాథోడ్ అలియాస్ బూరు, రాధా రాథోడ్ అలియాస్ శాంతి కలిసి సత్తుపల్లి పట్టణంలో ఇద్దరు వ్యాపారులను బంగారం పేరుతో మోసగించేందుకు ప్రయత్నించారు. వారు ఇచ్చిన సమాచారంతో ఈ ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. తెలంగాణ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ఈ ముఠా ఇలా మోసాలకు పాల్పడుతోంది.

 

ఇలా మోసగిస్తారు...

‘‘మా వద్దనున్న బంగారపు పూసల దండ ఖరీదు కనీసం 20 నుంచి 25 లక్షల రూపాయలు ఉంటుంది. కేవలం నాలుగైదు లక్షలకే ఇచ్చేస్తాం’’ అని చెప్పి పూసల దండలో నుంచి ఒక పూస తెంపినట్టుగా నటించి ‘ఒరిజినల్ బంగారపు పూస ఇచ్చి నమ్మిస్తారు. ఆ తరువాత దానిని అంటగడతారు. వాస్తవానికి ఆ పూసల దండ ఇత్తడితో చేయించినది. దానిని నాగపూర్‌లో ఐదువేల రూపాలకు కొని తెస్తారు. పట్టణంలోని ఇద్దరు వ్యాపారులను ఇలా మోసగించేందుకు ప్రయత్నించారు. వీరిని ఆ వ్యాపారులు అనుమానించి పోలీసులకు సమాచారమిచ్చారు.

 

వీరిని సత్తుపల్లి పట్టణ సీఐ యు.వెంకన్నబాబు నేతృత్వంలో ఎస్సై నాగరాజు, కానిస్టేబుళ్లు చక్రధర్‌రాజు, ప్రకాష్, ఉమర్, బి.వెంకటేశ్వరరావు బృందంగా ఏర్పడి నిఘా వేసి పట్టుకున్నారు. నిందితులు కిషోర్ రాథోడ్, రాధా రాథోడ్ మహారాష్ట్ర నాగపూర్ కేంద్రంగా పనిచేస్తున్నారు. వీరు ప్లాస్టిక్ పూల దండలు, బొకేలతో వీధివీధినా తిరుగుతుంటారని, అమాయకులను చాకచక్యంగా బురిడి కొట్టిస్తారని చెప్పారు. ఇటువంటి మోసగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. నిందితులను కోర్టుకు హాజరుపరుస్తున్నట్టు చెప్పారు. సమావేశంలో పట్టణ సీఐ యు.వెంకన్నబాబు, ఎస్సై నాగరాజు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top