త్వరలో అంతర్ జిల్లా బదిలీలు!

త్వరలో అంతర్ జిల్లా బదిలీలు! - Sakshi


* రాష్ట్ర ప్రభుత్వ పరిశీలనలో ప్రతిపాదనలు

* బదిలీల నుంచి ఉపాధ్యాయులకు మినహాయింపు!



సాక్షి, హైదరాబాద్: ఉద్యోగుల అంతర్ జిల్లా బదిలీలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. వేర్వేరు జిల్లాల్లో పనిచేస్తున్న భార్యాభర్తలకు ఊరట కలిగించేందుకు అంతర్ జిల్లా బదిలీల ద్వారా వారు ఒకే చోట పనిచేసే అవకాశం కల్పించాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలిసింది. ఉద్యోగుల నుంచి వచ్చిన అభ్యర్థనలమేరకు అంతర్ జిల్లా బదిలీలకు అవకాశం కల్పించే అంశంపై సాధారణ పరిపాలన శాఖ కసరత్తు పూర్తి చేసినట్లు సమాచారం.



ఇప్పటికే సీఎం కేసీఆర్  ఈ బదిలీలకు ఆమోదం తెలపడంతో ఉత్తర్వులు జారీకి అధికారులు కసరత్తు చేస్తున్నారు. దీనిపై ఫైల్ సైతం సిద్ధం కావడంతో ఒకటి రెండు రోజుల్లో బదిలీలకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుందని తెలిసింది. కాగా విద్యాశాఖ పరిధిలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల బదిలీలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావడంతో వీరి విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గినట్లు తెలిసింది.



కాగా, దీర్ఘకాలంగా బదిలీల కోసం ఎదురు చూస్తున్న ఉపాధ్యాయులకు కూడా అంతర్ జిల్లా బదిలీల్లో అవకాశం కల్పించాలని ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నాయి. ఇలా బదిలీ అయిన ఉపాధ్యాయులు విద్యా సంవత్సరం ముగిసిన తర్వాతే రిలీవ్ కావాలనే నిబంధనపై అవకాశం కల్పించాలని రాష్ర్ట ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు జి.రాజిరెడ్డి, ప్రధానకార్యదర్శి బి.భుజంగరావు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top