ఇందిరమ్మ బకాయిలు రూ.32 కోట్లు


హుజూర్‌నగర్ : ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల బకాయిలు రూ.32కోట్లుగా తేలింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు చేపట్టి వివిధ దశల్లో నిలిచిపోయిన లబ్ధిదారులకు బిల్లులు చేతికి అందక ఇబ్బందులు పడుతున్నారు. ఇక వీరి సొంతింటి కల నెరవేరకుండా పోయింది. పేదల సొంతింటి కల నిజం చేయడమే ధ్యేయంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్‌రెడ్డి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పథకాన్ని ప్రవేశ పెట్టారు. ఆయన మరణానంతరం కాంగ్రెస్ ప్రభుత్వం అనేక ఒడిదుకుడుల మధ్య ఈ పథకాన్ని కొనసాగించింది. అయితే నాడు రాష్ట్రంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా  గవర్నర్ పాలన రావడం, సాధారణ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ కావడంతో జిల్లావ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు గత  ఏడాది మార్చి 17 నుంచి బిల్లుల చెల్లింపులు నిలిచిపోయాయి. దీంతో  జిల్లావ్యాప్తంగా లబ్ధిదారులకు చెల్లిం చాల్సిన సుమారు రూ. 32 కోట్ల బకాయిలు పేరుకు పోయాయి. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారంలోకి రాగానే రూ. 3 లక్షలతో డబుల్ బెడ్ రూం ఇంటి నిర్మా ణం చేయిస్తామని హామీ ఇచ్చారు.



అయితే ముఖ్యమంత్రి హామీ నేటి వరకు కార్యరూపం దాల్చకపోగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టిన వారికి బిల్లులు కూడా అందించలేదు. కాంగ్రెస్ ప్రభుత్వపాలనలో  ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించి వివిధ దశల్లో ఉన్న ఇళ్ల లబ్ధిదారులు విధిలేని పరిస్థితులలో కొందరు అప్పు లు చేసి నిర్మాణాలు పూర్తిచేయగా మరికొం దరు అసంపూర్తిగానే వదిలేశారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో భారీగా అవినీతి జరిగిందని సీబీసీఐడీ విచారణ చేపడతామని ప్రభుత్వం ప్రకటించి ఆ దిశగా కూడా ఎటువంటి చర్యలు చేపట్టకుండా, ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు మంజూరు చేయకుండా కాలయాపన చేస్తుండటంతో లబ్ధిదారులు మరింత ఆందోళన చెందుతున్నారు. జిల్లావ్యాప్తంగా గత కాంగ్రెస్ ప్రభుత్వ హ యాంలో 4,03,973 ఇళ్లు మంజూరు కాగా 2,22,943 ఇళ్ల నిర్మాణం పూర్తయింది. అంతేగాక 14,281 ఇళ్లు రూఫ్ లెవల్లో, 4,389 ఇళ్లు లెంటల్ లెవల్లో,  31,397 ఇళ్లు బేస్‌మెంట్ లెవల్లో, 8,089 ఇళ్లు బేస్‌మెంట్ లోపు నిర్మాణ దశలో నిలిచిపోగా 1,22,874 ఇండ్ల నిర్మాణం నేటి వరకు మొదలు పెట్టలేదు. గత ప్రభుత్వంలో ఇళ్ల నిర్మాణానికి గాను  ఎస్సీ లబ్ధిదారులకు రూ. 1,05,000, ఎస్టీ లబ్ధిదారులకు రూ. 1,00,000,  ఇతరులకు రూ. 70,000లను  వారి ఇంటి నిర్మాణ దశల  వారీగా బిల్లులను అందజేసేవారు. అయితే పెరిగిన ధరలు, ఇళ్ల నిర్మాణానికి ఇచ్చే బిల్లులు ఏ మాత్రం సరిపోకపోవడం, ఇచ్చే బిల్లులు కాస్తా సకాలంలో అందజేయకపోవడంతో నిరుపేదల సొంతింటి కల తీరని కోరికగానే మిగిలి పోయింది. అయితే వివిధ దశ  లలో ఇంటి నిర్మాణం ఆగిపోయిన సుమారు 58,156 మంది లబ్ధిదారులు బిల్లుల కోసం ఎదురుచూపులు చూస్తున్నారు.



ఇంటి నిర్మాణాలు ఎంత మంది పూర్తి చేసి బిల్లుల కోసం ఎదురు చూస్తున్నారో వారిని గుర్తించేందుకు సర్వే నిర్వహించాలని గతనెలలో ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో హౌసింగ్ మండలస్థాయి  అధికారులు ఆయా మండలాల్లో క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించి 6,038 ఇళ్ల నిర్మాణాలు పూర్తి అయినట్లు గుర్తించి నివేదికను ఉన్నతాధికారులకు అందజేశారు. దీంతో ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసుకున్న లబ్ధిదారులకు సుమారు రూ. 20 కోట్ల నుంచి రూ. 24 కోట్ల చెల్లింపులు చేయాల్సి వస్తుందని ఆ నివేదికలో పేర్కొన్నారు.  ఈ నివేదికను జిల్లాస్థాయి ఉన్నతాధికారులు ప్రభుత్వానికి పంపించాక ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇదిలా ఉండగా వివిధ దశలలో నిర్మాణాలు నిలిపివేసిన లబ్ధిదారులను ప్రభుత్వం ఏ విధంగా ఆదుకుంటుందో తెలియని పరిస్థితి నెలకొంది. అయితే నిర్మాణాలు నిలిపివేసిన తమను.. ప్రభుత్వం ప్రవేశపెడతామన్న నూతన ఇంటి నిర్మాణ పథకంలో అవకాశం కల్పించి ఆదుకోవాలని లబ్ధిదారులు కోరుతున్నారు. అంతేగాక ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి ఇందిరమ్మ ఇళ్లనిర్మాణ సమస్యలను పరిష్కరించాలని వివిధ పార్టీల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఈ పరిస్థితులలో ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకొని లబ్ధిదారులకు న్యాయం చేస్తుందో వేచిచూడాల్సిందే.

 

 లబ్ధిదారులందరికీ బిల్లులు చెల్లించాలి

 కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఇంటి నిర్మాణాలు చేపట్టిన లబ్ధిదారులందరికీ ప్రభుత్వం వెంటనే బిల్లులు చెల్లించాలి. వివిధ దశలలో నిర్మాణాలు ఆగిపోయిన లబ్ధిదారులకు కూడా బిల్లులు అందించి నాడు నిర్మాణం ప్రారంభించిన లబ్ధిదారుల ఇళ్లు పూర్తయ్యే విధంగా చర్యలు చేపట్టాలి. బిల్లులు అందక లబ్ధిదారులు తీవ్ర ఆందోళన చెందుతున్నందున ప్రభుత్వం వెంటనే స్పందించాలి.

  - ఇందిరాల వెంకట్రామ్, హుజూర్‌నగర్

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top