గుట్టు రట్టయ్యేనా..?

గుట్టు రట్టయ్యేనా..?


- గద్వాలలో ఇందిరమ్మ ఇళ్లల్లో భారీగా  అక్రమాలు

- సీఐడీ విచారణకు ఆదేశించిన ప్రభుత్వం

- మాజీ కౌన్సిలర్లే సూత్రధారులని ఆరోపణలు

- గతంలో గుర్తించిన అక్రమార్కులపై చర్యలు శూన్యం


గద్వాల: గద్వాల పట్టణంలో నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లల్లో అక్రమాలు భారీగా చోటుచేసుకున్నాయి. పేదల సొమ్మును కొందరు అక్రమార్కులు దర్జాగా మెక్కేశారు. గతంలో గుర్తించిన అక్రమార్కులపై చర్యలు తీసుకోకపోగా.. ప్రభుత్వం తాజాగా ఇందిరమ్మ గృహనిర్మాణాల్లో జరిగిన అక్రమాలపై సీఐడీ విచారణకు ఆదేశించడంతో స్థానికంగా చర్చనీయాంశమైంది. 2004 నుంచి 2014 వరకు గద్వాల పట్టణానికి సుమారు 2005 పైచిలుకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయి. వీటిలో పిల్లగుండ్ల ఇందిరమ్మ కాలనీకి 200 ఇళ్లు మంజూరయ్యాయి. అయితే పట్టణంలో 80 శాతం ఇళ్లు పూర్తయినట్లు గృహనిర్మాణశాఖ లెక్కలు చెబుతున్నాయి. కానీ అందులో 30 శాతం ఇళ్లు కూడా పూర్తికాలేదన్నది వాస్తవం.



పట్టణంలో ఒకరి పేర రెండు, మూడిళ్లు మంజూరయ్యాయి. ఒకే ఇళ్లుపై అనేకమార్లు బిల్లులు తీసుకున్నట్లు కూడా తేలింది. నిర్మాణాలు జరగకుండానే పట్టణంలోని కొందరు మాజీ కౌన్సిలర్ల చేతుల్లోకి దాదాపు రూ.2కోట్ల మేర ప్రజాధనం వెళ్లినట్లు ఆరోపణలు ఉన్నాయి. మం జూరైన ఇళ్ల నిర్మాణాల చెల్లింపులు, లబ్ధిదారుల ఎంపిక తదితర స్థాయిలో గత మూడేళ్ల క్రితం సదరు వ్యక్తులు పెద్దఎత్తున లాబీయింగ్ చేయడంతో అక్రమాలు కోట్లు దాటాయి. ఈ క్రమంలో 2008లో జరిగిన విచారణ మధ్యలోనే ఆగిపోయింది. 2009లో అప్పటి ప్రభుత్వం ఇంది రమ్మ ఇళ్లల్లో జరిగిన అక్రమాలపై థర్డ్ పార్టీ విచారణకు ఆదేశించింది. అక్రమాల నిగ్గుతేల్చకుండానే అధికారులు ఫైళ్లను మూలకుపడేశారు.

 

అధికారుల విచారణకు సహకరించని పీడీ కార్యాలయం

గద్వాల పట్టణంలో మూడేళ్ల క్రితం థర్డ్ పార్టీ విచారణ జరిగింది. అధికారులు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో రూ.28లక్షల మేర అక్రమాలు జరిగినట్లు గుర్తించారు. చాలా ఇళ్లు లబ్ధిదారుల పేర్లు కాకుండా మరో వ్యక్తి పేరుతో ఫొటోలు మార్చి రుణాలు పొందారని తేల్చారు. అదేవిధంగా గద్వాల నియోజకవర్గంలోని ధరూరు, గట్టు, మల్దకల్, గద్వాల మండలాల్లో అధికారుల బృందాలు ఇందిరమ్మ అక్రమాలపై సర్వేలు నిర్వహించి తుది నివేదికలను ఉన్నతాధికారులకు సమర్పించారు.

 

హౌసింగ్ ఉన్నతాధికారుల ఆదేశాలు ఉన్నా...

2011 మార్చి 14న హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డెరైక్టర్ ఆదేశాల మేరకు జిల్లా హౌసింగ్ అధికారులు గద్వాల ఇందిరమ్మ ఇంటిదొంగలపై కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. ఈ మేరకు గద్వాల హౌసింగ్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాలను సమగ్రంగా అందిస్తేనే సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవడానికి వీలవుతుందని అప్పట్లో పట్టణ ఎస్‌ఐ, సీఐలు హౌసింగ్ డీఈఈకి తేల్చిచెప్పారు. థర్డ్ పార్టీ విచారణ వివరాలు అందించాలని డీఈఈ జిల్లా హౌసింగ్ పీడీ కార్యాలయానికి లేఖరాసినా ఇంతవరకు సమాధానం రాలేదు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో చోటుచేసుకున్న అక్రమాలపై సీఐడీ విచారణకు ఆదేశించడంతో గద్వాల పట్టణంలో ఆసక్తి నెలకొంది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top