సిమెంటు పంపిణీకి బ్రేక్!

సిమెంటు పంపిణీకి బ్రేక్! - Sakshi


 తాండూరు: ‘ఇందిరమ్మ’ సిమెంటు పంపిణికీ బ్రేక్ పడింది. దీంతో వివిధ దశల్లోని వేలాది ఇళ్ల నిర్మాణాలు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. తాండూరు నియోజవకవర్గ పరిధిలోని పెద్దేముల్, యాలాల, తాండూరు, బషీరాబాద్ మండలాలతోపాటు తాండూరు అర్భన్‌లో ఇందిరమ్మ, రచ్చబండ ఇళ్ల నిర్మాణాలు ఆగిపోయాయి. బిల్లులు చెల్లించక, సిమెంట్ లేక లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు.



 సిమెంట్ పంపిణీ చేయకపోవడంతో ఇళ్ల నిర్మాణాలు ముందుకు సాగటం లేదు. ఈ ఏడాది ఎన్నికల కోడ్ నేపథ్యంలో సిమెంట్ పంపిణీని మార్చి నెలలో అధికారులు నిలిపివేశారు. అప్పటి ఇప్పటి వరకు దాదాపు ఎనిమిది నెలలుగా లబ్ధిదారులకు ఒక్క బస్తా సిమెంట్ కూడా ఇవ్వలేదు. ఎన్నికలు ముగిసి కోడ్ తొలగించినా సిమెంట్ మాత్రం పంపిణీ చేయడం లేదు. గత ఏడాది కాంట్రాక్టుకు సంబంధించి గోదాంలో 658 సిమెంట్ బస్తాలు మాత్రమే ఉన్నాయి. దాదాపు 4,529 మంది లబ్ధిదారులకు సుమారు 50వేల బస్తాలకుపైగా సిమెంట్ పంపిణీ చేయాల్సి ఉంది.



 తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన నేపథ్యంలో సిమెంట్ కర్మాగారాలతో సిమెంట్ బస్తాల పంపిణీ కాంట్రాక్ట్ ఖరారు లేదు. ప్రభుత్వం ఏర్పడక ముందు బస్తా సిమెంట్ రూ.148.50 ధరకు లబ్ధిదారులకు పంపిణీ చేశారు. తాజాగా కొత్త ప్రభుత్వం సిమెంట్ కర్మాగారాలతో కాంట్రాక్ట్ ఖరారు కానందున బస్తా సిమెంట్ ఎంత అన్నది తేలలేదు. ఈ క్రమంలో సిమెంట్ పంపిణీలో తీవ్ర జాప్యం ఏర్పడుతోంది. 947 ఇళ్లు పునాదిలోపు, 2,806 ఇళ్లు పునాది, 137 ఇళ్లు లెంటల్ స్థాయి, 639 ఇళ్లు రూప్‌స్థాయిలో ఉన్నాయి. ఈ క్రమంలో గ్రామాల లబ్ధిదారులు సిమెంట్ కోసం హౌసింగ్ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. స్థానిక హౌసింగ్ అధికారులు మాత్రం తామేమీ చేయలేమని చేతులెత్తేస్తున్నారు.



మూడు విడతల్లో పునాది స్థాయిలో ప్రతి లబ్ధిదారుడికి పది బస్తాల సిమెంట్ ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. ఎనిమిది నెలలుగా సిమెంట్ అందక లబ్ధిదారులు అవస్థలు పడుతున్నారు. బహిరంగ మార్కెట్‌లో డబ్బులు పెట్టి సిమెంట్ కొనుగోలు చేయలేక నిర్మాణాలు ఆపేశారు. ఇప్పటి వరకు జరిగిన నిర్మాణాల కుగాను లబ్ధిదారులకు చెల్లించాల్సిన రూ.కోటి బిల్లులు ఆగిపోయాయి. చేసిన నిర్మాణాలకు బిల్లులు అందక.. మిగిలిన పనులను పూర్తి చేసేందుకు సిమెంట్ కొరత కారణంగా ఇందిరమ్మ నిర్మాణాలు అసంపూర్తిగా మిగిలి పోయాయి.



మండలంలోని కోత్లాపూర్ కుర్ధుకు చెందిన గోవిందమ్మ అనే లబ్ధిదారు లెంటల్ స్థాయి వరకు ఇంటి నిర్మాణం చేపట్టింది. ఆమెకు రూ.20వేల బిల్లు, 20 బస్తాల సిమెంట్ అందలేదు. ఇలా వివిధ దశల్లో ఆగిపోయిన ఇళ్లకు సిమెంట్, బిల్లులు ఆగిపోవడంతో నిర్మాణాలు ఎక్కడిక్కడ ఆగిపోయాయి. సిమెంట్ కంపెనీలతో ప్రభుత్వం కాంట్రాక్టు కుదిరితే లబ్ధిదారులకు సిమెంట్ పంపిణీ అందే అవకాశం ఉందని హౌసింగ్ అధికారవర్గాలు భావిస్తున్నాయి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top