సకల వస్త్రోత్పత్తుల కేంద్రంగా ఓరుగల్లు


వినూత్నంగా టెక్స్‌టైల్ పార్కు

వివిధ రాష్ట్రాల్లో ఎంపీ కడియం బృందం అధ్యయనం 

సూరత్‌కు వలసలు ఆగాలి:  ముఖ్యమంత్రి కేసీఆర్




సాక్షి, హైదరాబాద్ : సూరత్..షోలాపూర్.. తిర్పూర్‌ను తలపించేలా వరంగల్‌లో టెక్స్‌టైల్ పార్కును నిర్మించాలని, ప్రత్యక్ష పరోక్ష ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు, వస్త్ర సంబంధ ఉత్పత్తులన్నీ ఒకేచోట లభించేలా ఈ పార్కు అధునాతనంగా ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఆదేశించారు. వరంగల్ నగరం చుట్టూ ఇప్పటికే సేకరించిన ప్రభుత్వ భూముల్లో టెక్స్‌టైల్ పార్కును ఏర్పాటు చేస్తామన్నారు. నాణ్యమైన వస్తువులను విక్రయించేందుకు వరంగల్ నగరంలో స్టాల్స్‌తో మార్కెట్ ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు. టెక్స్‌టైల్ పార్కుకు సంబంధించి ఉన్నతాధికారులు, వరంగల్ జిల్లా ప్రజాప్రతినిధులతో ఆయన సోమవారం సమీక్ష నిర్వహించారు.



దేశంలోనే ఎక్కువ వస్త్ర ఉత్పత్తులు లభ్యమయ్యే సూరత్, షోలాపూర్, తిర్పూర్ లాంటి నగరాల్లో అధ్యయనం చేసి వరంగల్ టెక్స్‌టైల్ పార్కుకు తుదిరూపం ఇవ్వాలని ముఖ్యమంత్రి సూచించారు. ప్రభుత్వ సలహాదారు బి.వి.పాపారావు, వరంగల్ ఎంపీ కడియం శ్రీహరి, వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్, పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డి, అధికారులతో కూడిన బృందం ఈ వారంలోనే సూరత్ పర్యటించి రావాలని ఆదేశించారు. నెలాఖరులోగా తమ అధ్యయన నివేదికను సమర్పించాలని కోరారు.



మూడు లక్షలమంది వలస...

ఒక్క వరంగల్ జిల్లా నుంచే దాదాపు మూడు లక్షలమంది సూరత్‌కు వెళ్లి మగ్గాలపై వస్త్రాలు తయారు చేస్తున్నారని ముఖ్యమంత్రి అన్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన కార్మికులు టెక్స్‌టైల్ పరిశ్రమల్లో పని చేస్తున్నారని చెప్పారు. వీరందరూ అపారమైన నైపుణ్యంతో పాటు అనుభవం సంపాదించారని, అలాంటి వారిని ఉపయోగించుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. సూరత్‌లో చీరలు, సల్వార్ దుస్తులు, షోలాపూర్‌లో నాణ్యమైన చద్దర్లు తయారవుతాయని, తిర్పూర్‌లో డ్రెస్ మెటీరియల్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుందని సీఎం తెలిపారు. ఈ మూడురకాల ఉత్పత్తులతో పాటు మిగతా అన్ని రకాల వస్త్ర సంబంధ ఉత్పత్తులు వరంగల్‌లోనే తయారు కావాలని ముఖ్యమంత్రి అన్నారు. అందుకు అనువైన పరిశ్రమలను స్థాపించడం ప్రభుత్వ ఉద్దేశమన్నారు. ఈ రంగంపై ఆధారపడిన వారు ఇక్కడే పని చేసుకొని బతకాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top