ఆయుధం అడ్డగోలుగా వినియోగం

ఆయుధం అడ్డగోలుగా వినియోగం


జిల్లాలో విచ్చలవిడిగా ఆయుధాల వినియోగం

 హిట్‌లిస్టులో లేనివారి చేతుల్లో తుపాకులు

 జాబితాలో ముగ్గురు వైద్యులు, చోటామోటా నేతలు

 రియల్ దందా, సెటిల్‌మెంట్లు, స్టేటస్

 సింబస్‌కూ వినియోగిస్తున్న వైనం

 రాజకీయ, పోలీసుల

 అండదండలే కారణం

 

 

 కరీంనగర్ క్రైం:జిల్లాలో తుపాకుల వినియోగం పెరిగిపోతోంది. వీటిని అడ్డుపెట్టుకుని రియల్ దందాలు, సెటిల్‌మెంట్లు చేస్తున్న వారి సంఖ్య రోజురోజుకూ పెచ్చుమీరుతోంది. నక్సల్స్ హిట్‌లిస్టులో లేనప్పటికీ ఏదో ఒకసాకుతో ఆయుధాలను పొందుతూ దాదాగిరికి ఉపయోగించుకుంటున్న చోటామోటా నేతలూ జిల్లాలో ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లాలో సుమారు 220 మంది వద్ద లెసైన్స్‌డ్ తుపాకులున్నట్లు తెలుస్తోంది. వీరితోపాటు అక్రమ పద్ధతిలో తుపాకులను ఉపయోగిస్తున్న వారి సంఖ్య కూడా రెట్టింపు సంఖ్యలో ఉన్నట్లు సమాచారం. ఇటీవలి కాలంలో ఎల్లారెడ్డిపేట, చందుర్తి మండాలల్లో నాటు తుపాకులు లభ్యం కావడమే ఇందుకు నిదర్శనం. కొద్ది రోజుల క్రితం గంగాధర మండలం కురిక్యాల వద్ద ఏకంగా ఏకే 47కు చెందిన బానేట్ దొరకడం కూడా అక్రమ ఆయుధాల వినియోగం విచ్చలవిడిగా జరుగుతోందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

 

 ప్రస్తుతం జిల్లాలో నక్సల్స్ ప్రభావం తగ్గింది. అయినప్పటికీ గతంలో నక్సల్స్ పేరుతో ఆయుధాలు పొందిన వారు వాటిని వెనక్కు ఇవ్వలేదు. పోలీసు శాఖ సైతం వివిధ రకాలుగా వస్తున్న ఒత్తిళ్లతో వారి నుంచి ఆయుధాలను వెనక్కు తీసుకోలేకపోతోంది. గతంలో నక్సల్స్ హిట్‌లిస్టులో ఉన్న పోలీసుల నుంచి ఆయుధాలను ఇటీవల అధికారులు వెనక్కు తీసుకున్నారు. అదే తరహాలో మిగిలిన వారి నుంచి ఆయుధాలను వెనక్కు తీసుకోవాలని, లేనిపక్షంలో దుర్వినియోగమయ్యే ప్రమాదముందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

 

 లెసైన్స్‌లకు మించి ఆయుధాలు...?

 జిల్లాలో 220 ఆయుధాల లెసైన్స్‌లు ఉండగా, వీటిలో బ్యాంక్ సిబ్బంది, ప్రైవేట్ సెక్యూరిటీ కంపెనీల వద్ద 70 ఆయుధాలున్నాయి. వీటిలో ఎక్కువగా డీబీబీఎల్ తుపాకులే ఉన్నాయి. రాజకీయ, నక్సల్స్ టార్గెట్లు, బడా వ్యాపారుల వద్ద మరో 50కి పైగా ఉన్నాయి. జిల్లాకు చెందిన ముగ్గురు వైద్యుల వద్ద కూడా ఆయుధాలున్నాయి. ఇవికాకుండా ఎలాంటి టార్గెట్ లేని చోటామోటా లీడర్ల వద్ద ఏకంగా 97 అయుధాలున్నాయి. వీటిలో చాలా వరకూ 0.32 పిస్టళ్లు, రివాల్వర్లు ఉన్నాయి. ఇవికాకుండా అక్రమంగా ఆయుధాలు కలిగిన నేతలు, వ్యాపారులు, రియల్టర్లు వందల మంది ఉన్నట్లు సమాచారం. వీటితో కేవలం సెటిల్‌మెంట్లు, దందాలకు పాల్పడుతున్నటు తెలిసింది. తాము చెప్పినట్లు వినకుంటే చంపుతామంటూ తుపాకులతో బెదిరింపులకు దిగున్నారనే ఆరోపణలున్నాయి. కొన్నిసార్లు లెసైన్స్‌దారుల పేరు చెప్పుకుని అనుమతి లేని అయుధాలు కూడా వినియోగిస్తున్నారనే ఆరోపణలున్నాయి. జిల్లా కేంద్రంలో ఓ చోటా నేత ఎక్కడికి వచ్చినా తనవద్ద ఉన్న ఆయుధం అందరికీ కన్పించేలా ప్రదర్శిస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నట్లు తెలిసింది. గతంలో నక్సల్స్ హిట్‌లిస్టులో ఉన్న కారణంగా సుమారు 70 మందికి పైగా పోలీసులకు ఆయుధాలిచ్చారు. ప్రస్తుతం నక్సల్స్ ప్రభావం తగ్గిందని భావించిన పోలీసు ఉన్నతాధికారులు ఆరు నెలల క్రితం వాటిని తిరిగి వెనుక్క తీసుకున్నారు. నిత్యం అసాంఘికశక్తులతో తలపడే పోలీసుల అయుధాలు వెనుక్కు తీసుకున్న పోలీసుశాఖ... ఎలాంటి టార్గెట్ లేకుండా లెసైన్సు పొంది స్వప్రయోజనాలకు ఉపయోగిస్తున్న వారి నుంచి వాటిని వెనుక్కు తీసుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నారుు.

 

 అక్రమ ఆయుధాల తయారీ అడ్డా

 జిల్లాకు సరిహద్దులుగా ఉన్న ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రల నుంచి ఆధునిక ఆయుధాలు సులభంగా జిల్లాకు చేరుతున్నాయని సమాచారం. జిల్లాలో నాటు తుపాకులు తయారు చేస్తున్న సంఘటనలు బయటపడడం అందోళన కల్గించే విషయం. జగిత్యాల, సిరిసిల్ల, గోదావరిఖని, పెద్దపల్లి, కరీంనగర్ డివిజన్లలో ఆయుధాలు వినియోగం విచ్చలవిడిగా కొనసాగుతోందని పలు సంఘటనలు రుజువు చేస్తున్నాయి. గతంలో ఎల్లారెడ్డిపేట మండలంలో అత్యాధునికమైన పెన్‌గన్‌తో పాటు 16కు పైగా ఆయుధాలు లభించాయి. ఇదే మండలం వెంకటాపూర్ గ్రామంలో అయుధాలు తయారు చేస్తూ పట్టుబడ్డారు.

 

 రెండు నెలల క్రితం ఎల్లారెడ్డిపేటలో అటవీ జంతువులను హతమార్చుతున్న ఇద్దరిని అరెస్టు చేసి వారి నుంచి పలు నాటు తుపాకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇవి స్థానికంగానే తయారు చేస్తున్నారని తెలిసింది. ఇప్పటికే ఇక్కడ నుంచి జిల్లాలోని పలు ప్రాంతాలకు పదుల సంఖ్యలో నాటు తుపాకులు సరఫరా చేశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తుపాకులు వినియోగించి భూదందాలు, బెదిరింపులు, దొంగతనాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలున్నాయి. జిల్లా కేంద్రంలోనే సుమారు 60 మందికి పైగా సామాన్యుల వద్ద లెసైన్స్ ఆయుధాలున్నాయని సమాచారం.

 

 నేతల అండదండలతో...

 గన్ లెసైన్స్ అనేది స్టేటస్ సింబల్‌గా మారడంతో రాజకీయ అండదండలు, పలుకుబడి గలవారు సులభంగా లెసైన్స్‌లు పొందుతున్నారనే ఆరోపణలున్నారుు. మూడేళ్ల క్రితం జిల్లాలో విచ్చలవిడిగా అయుధాల లెసెన్స్‌లు జారీ చేశారు. రెండేళ్ల నుంచి వీటిని నియంత్రించినప్పటికీ గతంలో పొందిన లెసెన్స్‌లతో యథేచ్చగా వీటిని వినియోగిస్తున్నారు. ప్రధాన రాజకీయ పక్షాల ముఖ్యనాయకుల అనుచరులు తుపాకీ లెసైన్స్‌లతో దందాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వినవస్తున్నాయి. నిత్యం సివిల్, భూతగాదాల్లో జోక్యం చేసుకుంటూ తుపాకులతో బాధితులను  భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపణలున్నాయి. అనేక మంది నేరస్తుల వద్ద కూడా అక్రమంగా ఆయుధాలున్నాయని సమాచారం.

 

  మొత్తం మీద సుమారు 20 మందికి పైగా లెసైన్స్ లేకుండా షార్ట్ వెపన్ కలిగి ఉంటారని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. లెసైన్స్‌దారులు మాత్రం అక్రమంగా బుల్లెట్లు తెప్పించుకొని కాల్పులకు వాడుతున్నట్లు తెలుస్తోంది. పలు శివారు ప్రాంతాల్లో పార్టీల్లో ఫ్యాషన్ కోసం కాల్పులకు దిగుతున్నారని సమాచారం. ఈ సంఘటనలకు లెక్కల్లోలేని బుల్లెట్లు వాడుతున్నారని తెలిసింది. రెండేళ్ల క్రితం వేములవాడ వద్ద పోలీసులు తనిఖీ చేస్తున్న కేంద్రాన్ని దాటుకుని వెళ్లిన వ్యక్తులు ప్రభాకర్‌రావు అనే వ్యక్తిని కాల్చి చంపారనే ఆరోపణలున్నాయి. మాజీ నక్సలైట్లు కూడా విచ్చలవిడిగా ఆయుధాలను వినియోగిస్తున్నారని సమాచారం. గతంలో చందుర్తి మండలంలో చిక్కన మాజీ నుంచి మూడు అయుధాలు స్వాధీనం చేసుకున్నారు. వీటిపై ఫిర్యాదులొస్తున్నా పోలీసులు చూసిచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి.

 

 తుపాకీ పొందాలంటే....

 అయధాలు పొందాలంటే మొదట కలెక్టర్‌కు దరఖాస్తు పెట్టుకోవాలి. దరఖాస్తు చేసుకున్న వ్యక్తికి అయుధం ఇవ్వచ్చో లేదో విచారించి నివేదిక ఇవ్వమని కలెక్టర్ పోలీసు శాఖకు పంపుతారు. పోలీసులు విచారించి నివేదిక ఇస్తారు. దీని ఆధారంగా ప్రభుత్వం లెసెన్స్ జారీ చేస్తుంది. లెసెన్స్ పొందే వ్యక్తి నక్సల్స్, టైస్టులు టార్గెట్ అయి ఉండాలి. లేదా శత్రువుల వల్ల తన ప్రాణాలకు ప్రమాదం ఉందని నిరూపించగలగాలి. దాడులకు గురి కావడం, టైస్టుల హిట్ లిస్టులో ఉండడం, ప్రాణాలకు ప్రమాదం జరిగన సంఘటనలు జరిగి ఉండటం వంటి సందర్భాల్లో లెసైన్స్ ఇస్తారు.

 లెసెన్స్ పొందే వ్యక్తి గతంలో నేరచరిత్ర ఉన్న వ్యక్తి కాకూడదు. అయుధం పొందే సమయంలోనే పొందుతున్న అయుధాన్ని ఎక్కడ వినియోగిస్తారో స్పష్టంగా పేర్కొనాలి.

 తాను పొందిన అయుధం తన ప్రాణాపాయస్థితిలో తప్ప మరో విధంగా వినియోగించనని ఆఫిడవిట్ సమర్పించాలి.

 అయుధం తన పరిధిని దాటి వెళ్లితే అక్కడున్న పోలీసులకు సమాచారం ఇవ్వాలి. ఆలయాలు, నిషేధిత ప్రాంతాలకు అయుధాలను తీసుకుని వెళ్లకూడదు. అలాంటి సమయంలో వాటిని పోలీస్‌స్టేషన్‌లో భద్రపరిచాలి.

 ప్రతి నెలకోసారి అయుధం వినియోగంపై పోలీసులకు సమాచారం ఇవ్వాలి. తన వద్ద ఉన్న అయుధాన్ని ప్రజలకు కనిపించేవిధంగా, బయటకు కనబడే విధంగా ప్రదర్శించకూడదు. ఎన్నికల సందర్బాల్లో ముందుగానే పోలీస్‌స్టేషన్‌లో డిపాజిట్ చేయాలి. ప్రతి ఏడాది రెన్యువల్ చేసే సమయంలో, లెసెన్స్ తీసుకునే సమయంలోనూ ఈ నిబంధనలే వర్తిస్తాయి.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top