పోలీసుల పనితీరు మెరుగుపడాలి

పోలీసుల పనితీరు మెరుగుపడాలి - Sakshi


 మహబూబ్‌నగర్ క్రైం: పోలీసుల పనితీరు మెరుగుపడాలని, ప్రజలకు వ్యవస్థపై నమ్మకం కలిగించాలని హైదరాబాద్ రేంజ్ డీఐజీ టీవీ శశిధర్‌రెడ్డి  జిల్లా పోలీసు అధికారులు, సిబ్బందికి సూచించారు. పోలీస్‌స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదు వెనక ఓ సమస్య ఉంటుందని, సత్వరస్పందన బాధితులకు ఊరట కలిగిస్తుందన్నారు. జిల్లాకు ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్న ఆయన శనివారం జిల్లా పోలీసు అధికారులతో నేర సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డీఐజీ శశిధర్‌రెడ్డి మాట్లాడుతూ.. పోలీసువృత్తిలోని ప్రతి అంశాన్ని ఆస్వాదిస్తూ పనిచేయడం ద్వారా మంచి ఫలితాలు సాధించగలమని విశ్వాసం వ్యక్తంచేశారు. జిల్లాలో పెరుగుతున్న నేరాలపై ఆరాతీస్తూ మహిళల హత్యలు, దొంగతనాలను అరికట్టేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని సూచించారు. అందుబాటులో ఉన్న గ్రామాల సందర్శన, కొత్త వ్యక్తుల కదలికలపై ఆరా, రాత్రి, పగటిపూట పహారా, అనుమానిత వ్యక్తులపై నిఘా, ప్రజా సంబంధాలపై శ్రద్ధ వంటివి పోలీసుశాఖకు విలువైన సమాచారాన్ని అందిస్తాయని  వివరించారు.

 

 పేద, ధనిక అనే తేడా లేకుండా సమన్యాయం చేసినప్పుడు అరాచక శక్తులకు తావివ్వని వారమవుతామని పేర్కొన్నారు. కొన్ని పోలీస్‌స్టేషన్లలో చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న విషయాన్ని ప్రస్తావిస్తూ.. దర్యాప్తులో శ్రద్ధ వహిస్తే వాటిని తగ్గించవచ్చని అన్నారు. సంబంధిత అధికారులు తగిన సూచనలు అందించాల్సిన డీఐజీ ప్రత్యేకంగా వివరించారు. రాజకీయ, భూతగాదాలను ప్రాథమిక స్థాయిలోనే కఠినంగా అణచివేయాలని సూచిస్తూనే క్రమశిక్షణ రాహిత్యాన్ని సహించేది లేదని హెచ్చరించారు.

 

 ఇటీవల కల్వకుర్తి, అచ్చం పేట, జడ్చర్ల నియోజకవర్గాల్లోని పలు ప్రాంతాల్లో మావోయిస్టుల పేర పోస్టర్లు వెలిసిన విషయమై అనుమానితులను అదుపులోకి తీసుకొని దర్యాప్తును వేగవంతం చేయాలని ఆదేశించారు. శాంతి భద్రతల పరిస్థితి, పరిశోధన ఫలితాలు సంతృప్తికరంగా ఉన్నా నేరాల నివారణకు శ్రద్ధచూపాలని నొక్కిచెప్పారు. ముఖ్యంగా జిల్లా, రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో మరింత అప్రమత్తంగా కోరారు. సమావేశంలో అదనపు ఎస్పీ వి.ప్రకాశ్‌రావు, ఓఎస్‌డీ జె.చెన్నయ్య, డీఎస్పీలు మల్లికార్జున, గోవిందరెడ్డి, మహేశ్, శ్రీనివాస్‌రావు, ద్రోణాచార్యులు, గోవర్ధన్, రామేశ్వర్, ఇన్‌స్పెక్టర్లు పాల్గొన్నారు.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top