వడదెబ్బతో బాలుడి సహా ఆరుగురి మృతి


పరిగి: వడదెబ్బతో జిల్లా వ్యాప్తంగా బుధవారం ఓ బాలుడితో పాటు ఆరుగురు మృత్యువాత పడ్డారు. పరిగిలో.. ధారూరు మండల పరిధిలోని కెరవెళ్లికి చెందిన చింతకింది బలరాం, అనిత అలియాస్ బేబి దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు అఖిలేష్(9) వికలాంగుడు కావటంతో పాఠశాలకు వెళ్లకుండా ఇంటిపట్టునే ఉంటున్నాడు. ఇటీవల అతడు పరిగిలో ఉండే మేనమామ బుద్లాపూర్ హన్మయ్య ఇంటికి వచ్చాడు. బుధవారం వడదెబ్బకు గురైన అఖిలేష్ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. అతడిని వెంటనే పరిగిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి.. అక్కడి నుంచి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స ప్రారంభించిన కొద్దిసేపటికే బాలుడు మృతిచెందాడు. అనంతరం మృతదేహాన్ని స్వగ్రామం కెరవెళ్లి తీసుకెళ్లి కుటుంబీకులు అంత్యక్రియలు చేశారు.

 

 తమ్మలోనిగూడలో వృద్ధుడు..

 యాచారం: మండల పరిధిలోని తమ్మలోనిగూడకు చెందిన వృద్ధుడు కాలె భీరయ్య(75)కు మూడు రోజులుగా వేడిగాలులకు అస్వస్థతకు గురయ్యాడు. ఆయనకు కుటుంబీకులు వైద్యం చేయించడంతో కాస్త కోలుకున్నాడు. తిరిగి బుధవారం తీవ్ర అస్వస్థతకు గురై భీరయ్య మృతిచెందాడు.

 

 శంషాబాద్‌లో వ్యక్తి..

 శంషాబాద్: శంషాబాద్ పట్టణంలోని యాదవ బస్తీకి చెందిన పి. నర్సింహాయాదవ్ (58) మంగళవారం మధ్యాహ్నం పశువులను మేపి ఇంటికి వచ్చాడు. భోజనం చేసి నిద్రకు ఉపక్రమించిన ఆయన ఎంతకు లేవలేదు. కుటుంబీకులు ఆయనను పరిశీలించగా అప్పటికే మృతిచెందాడు. మృతుడికి భార్య భారతి, ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. నర్సింహాయాదవ్ వడదెబ్బకు గురై మృతిచెందాడని కుటుంబీకులు, స్థానికులు తెలిపారు.

 

 బాబాగూడలో వృద్ధురాలు..

 శామీర్‌పేట్: మండల పరిధిలోని బాబాగూడలో ఓ వృద్ధురాలు వడదెబ్బకు గురై మృతిచెందింది. మృతురాల బంధువుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన బందని బాలమ్మ(80) మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండలో తిరిగింది. రాత్రి 11 గంటల అనంతరం తీవ్ర అస్వస్థతకు గురైన ఆమెను కుటుంబీకులు 108 వాహనంలో ఆస్పత్రికి తరలించేయత్నం చేయగా మృతిచెందింది.  

 

 మరో ఘటనలో..

 మేడ్చల్: మేడ్చల్ పట్టణంలోని కింది బస్తీకి చెందిన నడికొప్పు రాజయ్య(60) వారం రోజుల క్రితం వడదెబ్బతో అస్వస్థతకు గురయ్యాడు. కుటుంబీకులు ఆయనను మేడ్చల్‌లోని హోప్ ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందాడు.  

 

 కుమారుడి వివాహం.. అంతలోనే..

 షాబాద్: కుమారుడి పెళ్లి ఏర్పాట్లు చేస్తున్న ఓ వ్యక్తి వడదెబ్బకు అస్వస్థతకు గురై మృతిచెందాడు. మండల పరిధిలోని కక్కులూర్ గ్రామానికి చెందిన యాదయ్యగౌడ్(62) కుమారుడు పెళ్లి ఈ నెల 28న ఉంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లను యాదయ్యగౌడ్ చూస్తున్నాడు. ఈక్రమంలో మంగళవారం పనినిమిత్తం బయటకు వెళ్లిన ఆయన వడదెబ్బకు గురై అస్వస్థతకు గురయ్యాడు. కుటుంబీకులు ఆయనను షాద్‌నగర్ లో చికిత్స చేయించి రాత్రి ఇంటికి తీసుకొచ్చారు. పరిస్థితి విషమించడంతో యాదయ్యగౌడ్ బుధవారం తెల్లవారుజామున మృతి చెందాడు. తనయుడి పెళ్లిభాజాలు మోగాల్సిన ఇంట్లో తండ్రి చావు డప్పులు మోగుతున్నాయని మృతుడి బంధవులు కన్నీటిపర్యంతమయ్యారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top