ఆగని వర్షం.. వరద

ఆగని వర్షం.. వరద - Sakshi


నిజామాబాద్‌లో 25 వేల హెక్టార్లలో పంటలు నష్టం

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలో వరద ఉధృతి కొనసాగుతోంది.  కురుస్తున్న వర్షాల వల్ల గోదావరి, మంజీర నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. నిజాంసాగర్ గేట్లు ఎత్తివేయడంతో గోదావరి వరద ఉధృతి మరింత పెరిగింది. మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఆర్మూరు, బోధన్, బాన్సువాడ తదితర ముంపు ప్రాంతాల్లో ఎమ్మెల్యేలు, అధికారులతో కలిసి పర్యటించారు. జిల్లావ్యాప్తంగా 26.3 మి.మీటర్ల సగటు వర్షపాతం నమోదయ్యింది.  25వేల హెక్టార్ల పంట నష్టం జరగా.. రూ.150 కోట్ల మేర నష్టం వాటిల్లిందని ప్రాథమిక అంచనా.  



సదాశివనగర్‌లో తుంగవాగులో పడి ఇద్దరు యువకులు మృతి చెందగా, మూడు రోజుల తరువాత ఈ ఘటన  వెలుగులోకి వచ్చింది. కోటగిరి, వర్ని, బీర్కూర్ మండలాల్లో మొత్తం 158 ఇళ్లు పూర్తిగా, 27 ఇళ్లు పాక్షికంగా కూలిపోయాయి.  మంజీర నది తీరంలో ఉన్న బోధన్ మండలంలోని మందర్న, హున్సా, ఖాజాపూర్ గ్రామ శివారులో వరద నీరు చేరింది. ముందస్తుగా సాలూర గ్రామ ప్రాథమిక పాఠశాలలో పునరావాస కేంద్రం ఏర్పాటు చేశారు. కందకుర్తి శివారులోని సోయా, పత్తి, పొగాకు పంటలు 1,500 ఎకరాల వరకు నీటి మునిగాయి. గోదావరి తీరంలో రెవెన్యూ, పోలీసు శాఖల మండల స్థాయి అధికారులు సిబ్బంది వరద పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. పోచారం ప్రాజెక్టుకు 29 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది.



నిజాంసాగర్ ప్రాజెక్టులోకి 1.4 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో, 19 గేట్ల ద్వారా లక్ష క్యూసెక్కుల ఔట్ ఫ్లో కొనసాగుతోంది.  శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి 14 గేట్‌ల గోదావరికి 2 లక్షల అవుట్‌ఫ్లో, 2.4లక్షల ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. కాగా, మంగళవారం సీఎం కేసీఆర్ నిజామాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టును ఆయన సందర్శించనున్నారు.  

 

కరీంనగర్‌లో నష్టం రూ.24కోట్లు

కరీంనగర్ అగ్రికల్చర్/మెదక్: కరీంనగర్ జిల్లాలో వరద నష్టం రూ.24 కోట్లుగా అంచనా వేశారు. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు 3.38 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, 34 గేట్లు ఎత్తి 2.57 లక్షల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. 24 టీఎంసీల సామర్థ్యం గల ఎల్‌ఎండీలో నీటిమట్టం 20 టీఎంసీలకు చేరింది. మిడ్‌మానేరుకు ఆదివారం రాత్రి 20మీటర్ల మేర పడిన గండి సోమవారం ఉదయం వరకు 130 మీటర్లకు పెరిగింది. మెదక్ జిల్లాలో 50 వేల హెక్టార్లలో పంట నష్టం వాటిల్లింది. 9 వేలకు పైగా ఇళ్లు దెబ్బతిన్నాయి. సింగూరు, మంజీర రిజర్వాయర్‌లోకి వరద ఉధృతి కొనసాగుతోంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top