రాష్ట్రంలో మరిన్ని మార్కెట్ యార్డులు

రాష్ట్రంలో మరిన్ని  మార్కెట్ యార్డులు - Sakshi


41 యార్డులకోసం ప్రతిపాదనలు

 

హైదరాబాద్: వ్యవసాయ ఉత్పత్తుల లావాదేవీల్లో దళారీల జోక్యాన్ని నివారించేందుకు మరిన్ని వ్యవసాయ మార్కెట్ యార్డులు ఏర్పాటు చేయడమే మార్గమని ప్రభుత్వం భావిస్తోంది. కొత్త యార్డుల ఏర్పాటుతో ధాన్యం తూకంలో జరిగే మోసాలను అరికట్టడం, పంటలకు కనీస మద్దతు ధర వంటి లక్ష్యాలు నెరవేరుతాయని చెప్తోంది. ప్రస్తుతమున్న యార్డుల్ని విభజించడం ద్వారా కొత్త యార్డుల ఏర్పాటుతో రైతులకు మార్కెటింగ్ సౌకర్యాన్ని మరింత అందుబాటులోకి తెస్తామని అధికారులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతమున్న 150 వ్యవసాయ మార్కెట్‌లకు తోడుగా మరో 41 నూతన యార్డులను ఏర్పాటు చేయనుంది. 1966 నాటి వ్యవసాయ చట్టం నిబంధనల మేరకు నూతన యార్డుల ఏర్పాటు ప్రక్రియ వివిధ దశల్లో ఉంది. సాధ్యాసాధ్యాల నివేదిక, ప్రాథమిక, తుది నోటిఫికేషన్లు, ప్రభుత్వామోదం, గెజిట్ ప్రచురణ అనంతరం కొత్తగా ఏర్పాటయ్యే యార్డులకు పర్సన్ ఇన్‌చార్జిలను నియమించాలి. ఇప్పటివరకు 5 యార్డులు ప్రతిపాదనల్లో అన్ని దశలను పూర్తి చేసుకోగా వాటికి పర్సన్ ఇన్‌చార్జిలను నియమించాలి.  



 ఎమ్మెల్యేల అభ్యర్థనతో అదనంగా 10..

 ప్రభుత్వం మొదట 31 వ్యవసాయ మార్కెట్ యార్డులను కొత్తగా ఏర్పాటు చేయాలని భావించింది. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల అభ్యర్థనలతో మరో 10 యార్డుల ఏర్పాటుకు సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేయాల్సిందిగా మార్కెటింగ్ శాఖ అసిస్టెంట్ డెరైక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది.  నూతన యార్డుల ఏర్పాటుతో సరిపెట్టకుండా ప్రస్తుత యార్డుల ఆధునీకరణపై కూడా దృష్టి సారిస్తున్నామన్నారు.



 రిజర్వేషన్లపై అందని మార్గదర్శకాలు

 వ్యవసాయ మార్కెట్ కమిటీ కాలపరిమితిని మూడేళ్ల నుంచి ఏడాదికి తగ్గిస్తూ, నూతన పాలక మండళ్లు ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. పాలక మండళ్ల నియామకంలో తొలిసారిగా రిజర్వేషన్ల విధానాన్ని ప్రవేశపెడుతున్నారు. గతంలో కమిటీల్లో చైర్మన్, వైస్ చైర్మన్‌తో పాటు 18 సభ్యులు ఉండగా, నూతన కమిటీల్లో ఈ సంఖ్యను 14కు తగ్గించనున్నారు. అయితే కేటగిరీల వారీగా రిజర్వేషన్ శాతం, ఇతర మార్గదర్శకాలు ప్రభుత్వం నుంచి అందాల్సి ఉంది. ఆ తర్వాత జరిగే కసరత్తులో ఏ యార్డు ఏ కేటగిరీకి చెందుతుందనే అంశంపై స్పష్టత వస్తుందని మార్కెటింగ్ శాఖ వర్గాలు తెలిపాయి. కొత్తగా మెదక్ జిల్లాలోని నంగునూరు, నిజామాబాద్ జిల్లాలోని కోటగిరి, కరీంనగర్    జిల్లాలోని ఇల్లంతకుంట, పెగడపల్లి, బెజ్జంకి మార్కెట్ యార్డులు ఆవిర్భవించాయి. కాగా మహబూబ్‌నగర్ జిల్లాలోని కొల్లాపూర్, వరంగల్ జిల్లాలోని కొత్తగూడ, ఏటూరునాగారం, పాలకుర్తి, నిజామాబాద్ జిల్లాలోని డిచ్‌పల్లి, ధర్పల్లి, ఆదిలాబాద్    జిల్లాలోని జైనూరు, నల్లగొండ జిల్లాలోని మోటకొండూరు, కేతేపల్లి, నార్కట్‌పల్లి యార్డుల ఏర్పాటుకు సంబంధించి సాధ్యాసాధ్యాలపై నివేదిక కోరారు.

 

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top