ఇంటి పెద్ద మరణాన్ని తట్టుకోలేక..

ఇంటి పెద్ద మరణాన్ని తట్టుకోలేక.. - Sakshi


ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్య

- రంగారెడ్డి జిల్లా ఘట్‌కేసర్ శివార్లలో విషాదం

- అనారోగ్యంతో మృతిచెందిన తండ్రి సత్యనారాయణ

- మనస్తాపంతో రైలు కింద పడిన భార్య, ముగ్గురు పిల్లలు

 

ఘట్‌కేసర్ : ఆప్యాయత, అనురాగం, ప్రేమాభిమానాలకు నిలయం ఆ కుటుంబం.. ఒకరి ని విడిచి మరొకరు ఉండలేనంత ప్రేమ వారిది.. అనూహ్యంగా ఆ కుటుంబ పెద్ద మరణించాడు.దాంతో ఆయన భార్యాపిల్లలు తీవ్ర ఆవేదనలో కూరుకుపోయారు. ఆయన లేకుండా తాము జీవించలేమంటూ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. రంగారెడ్డి జిల్లా ఘట్‌కేసర్ మండలం అంకుశాపూర్ వద్ద శుక్రవారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. వరంగల్ జిల్లా మద్దూరు మండలం లద్నూరు గ్రామానికి చెందిన పారుపల్లి సత్యనారాయణ (55) ఆ ఇంటి పెద్ద. ఆత్మహత్య చేసుకున్నది ఆయన భార్య మీరా, కుమార్తెలు స్వాతి(33), నీలిమ(28), కుమారుడు శివరామకృష్ణ(22).



అనారోగ్యంతో...

 ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్ సమీపంలోని కెరిమెరి మండలంలో హౌసింగ్ డీఈగా సత్యనారాయణ పనిచేస్తున్నారు. భార్యాపిల్లలు హన్మకొండలోని టీచర్స్ కాలనీలో ఉంటున్నా రు. ఆయన పెద్ద కుమార్తె, కుమారుడు బీటెక్ చదవగా.. చిన్న కుమార్తె ఎంటెక్ పూర్తిచేసిం ది.సత్యనారాయణ రెండేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. రెండు రోజుల కిందట ఆయన తీవ్ర అస్వస్థతకు గురవడంతో ఆసిఫాబాద్‌కు వెళ్లిన భార్యాపిల్లలు..మెరుగైన చికిత్స కోసం శుక్రవారం ఉదయం హైదరాబాద్‌కు బయలుదేరారు.మార్గమధ్యంలో రాత్రి 9 గంటల సమయంలో నల్లగొండ జిల్లా భువనగిరి సమీపంలో ఉన్న ఓ హోటల్‌లో భోజనం చేశారు.ఆ తర్వాత సత్యనారాయణ తీవ్ర అస్వస్థతకు గురికావడంతో.. భువనగిరిలోని ఆస్పత్రికి వెళ్లారు.



అప్పటికే సత్యనారాయణ మరణించి నట్లు వైద్యులు చెప్పడంతో వారంతా శోకసంద్రంలో మునిగిపోయారు. మృతదేహాన్ని కారులోనే డ్రైవర్ పక్కసీటులో ఉంచి, సీటు బెల్టు పెట్టి హైదరాబాద్ వైపు బయలుదేరారు.  ఘట్‌కేసర్ మండలం అంకుశాపూర్ వద్ద హెచ్‌పీసీఎల్ డిపో సమీపంలో హైవే నుంచి పక్కగా వెళ్లి కారును ఆపారు. సత్యనారాయణను వదిలి ఉండలేమనే ఆవేదనతో రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డారు.



పట్టాలపై భార్యాపిల్లలు...

శనివారం వేకువజామున రైల్వే ట్రాక్‌పై మృతదేహాలున్నాయన్న సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. నలుగురు ఆత్మహత్యకు పాల్పడడంతో రైల్వే ట్రాక్‌పై శరీర భాగాలు చెల్లాచెదురుగా పడి భయానక వాతావరణం నెలకొంది. ట్రాక్ సమీపంలోనే పార్క్ చేసివున్న కారులో సత్యనారాయణ మృతదేహాన్ని, ఆస్పత్రి కేస్ షీట్‌ను పోలీసులు గుర్తించారు. కారులో ఫోన్‌లోని నంబర్ల ఆధారంగా మృతుడి సోదరుడు రవీందర్‌కు సమాచారమిచ్చారు. ఆయన వచ్చి మృతి చెందినవారిని సత్యనారాయణ, మీరా, స్వాతి, నీలిమ, శివరామకృష్ణగా గుర్తించారు. తమ సోదరుడు సత్యనారాయణ కుటుంబం ఎంతో అన్యోన్యంగా ఉండేదని.. ఎక్కడికెళ్లినా కుటుంబ సభ్యులంతా కలిసే వెళ్లేవారని రవీందర్ చెప్పారు. కుమార్తెల పెళ్లి చేసేందుకు పలుసార్లు సంబంధాలు తెచ్చినా సాకులు చెప్పి వద్దనే వారని తెలిపారు.



అర్ధరాత్రి దాటిన తరువాత..

సత్యనారాయణ కుటుంబ సభ్యులు శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. కుటుంబ పెద్ద సత్యనారాయణ అనారోగ్యంతో మృతి చెందడంతో తట్టుకోలేక అందరూ ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని మల్కాజిగిరి ఏసీపీ రవిచందర్‌రెడ్డి తెలిపారు. అయినా అన్ని కోణాల్లో కేసు దర్యాప్తు చేస్తున్నామని వివరించారు. సత్యనారాయణతో పాటు ఆయన భార్య మీరా, కుమార్తెలు స్వాతి, నీలిమ, కుమారుడు శివరామకృష్ణల మృతదేహాలకు శనివారం సాయంత్రం స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. సత్యనారాయణ తండ్రి ప్రకాశం వారందరికీ తలకొరివి పెట్టడం అందరినీ కలచివేసింది.

 

చాలా కాలంగా దూరమే..

సత్యనారాయణకు ఇద్దరు సోదరులు ఉండగా.. ఆయన భార్య మీరాకు ఓ సోదరుడు, ఇద్దరు సోదరిలు ఉన్నారు. అయినా వారి కుటుంబం ఎవరితోనూ కలిసేది కాదని బంధువులు చెబుతున్నారు. వారికి ఆర్థికంగా కూడా ఎలాంటి ఇబ్బందులు లేవని.. సత్యనారాయణ మరణించి ఉన్న కారును కూడా ఇటీవలే కొన్నారని పేర్కొన్నారు. కొన్నాళ్ళుగా సత్యనారాయణ దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్నారని... ఆయనకు నయమైతేనే పిల్లలకు పెళ్లిళ్లు అవుతాయనే భావనలో ఉండేవారని తెలిపారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top