రామాలయంలో టిక్కెట్ల మాయాజాలం!

రామాలయంలో టిక్కెట్ల మాయాజాలం! - Sakshi


భద్రాచలం : భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి ఆలయంలో గోదావరి పుష్కరాల సమయంలో జరిగిన అవకతవకలు ఒక్కోటి వెలుగులోకి వస్తున్నాయి. ‘సాక్షి’లో వస్తున్న వరుస కథనాల నేపథ్యంలో ఇక్కడి ఉద్యోగుల బాగోతం బట్టబయలౌతుంది. రాములోరి సొమ్మును సొంతానికి వాడుకుంటున్న ఇంటిదొంగల ఆటకట్టించేందుకు ప్రస్తుత ఈవో కూరాకుల జ్యోతి ఒకింత కఠినంగానే వ్యవహరించేందుకు సిద్ధమవుతుందని తెలుస్తోంది. భద్రాచలం స్టోర్ నిర్వహణలో తలెత్తిన లోపాలు, పర్ణశాలలో మాయమైన సరుకులు, తాజాగా  పర్ణశాలలో వెలుగులోకి వచ్చిన టిక్కెట్ల మాయాజాలం ఇలా వరుస ఘటనలు ఆలయానికి చెడ్డ పేరు తెచ్చిపెడుతున్నాయి.



ఆయా విభాగాల అధికారులు సరిగా పర్యవేక్షణ చేయకపోవటంతోనే ఇటువంటి తప్పిదాలు జరుగుతున్నాయనే  విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈవో జ్యోతి సెలువులో ఉన్న సమయంలో ఇంచార్జి ఈవోగా వ్యవహరించిన రమేష్‌బాబు భద్రాచలం స్టోర్ ఇంచార్జి, పర్ణశాలకు గుమస్తాలను సస్పెండ్ చేసిన సంగతి విధితమే. రెండు నెలల స్టాక్ నిల్వలను పుస్తకంలో నమోదు చేయలేదనే కారణంతో సెలవులో ఉనా, స్టోర్ ఇంచార్జిపై వేటు వేసిన అధికారులు, వరుస తప్పిదాలు బయటకు వస్తున్నా, పర్యవేక్షకులపై మాత్రం ఉదాసీనంగా వ్యవహరిస్తుండటంలో ఏదో మతలబు దాగిఉందనే ప్రచారం జరుగుతుంది.



రెండు నెలల పాటు స్టాక్ వివరాలను రికార్డుల్లో నమోదు చేయలేదనే విషయం ఈవోను గమనిస్తే కానీ వెలుగులోకి రాలేదు. ప్రతీ వారం దీనిపై పర్యవేక్షణ ఉంటే ఇలా జరిగి ఉండేది కాదు. అదేవిధంగా పర్ణశాలలో పుష్కరాలకు సంబంధించిన టిక్కెట్లును ఉద్యోగులకు పంపిణీ చేసిన సమయంలోనే ఏ నంబర్ నుంచి ఏ నంబర్ వరకూ ఇచ్చామనేది నమోదు చేయాల్సి ఉంటుంది. కానీ పుష్కరాలు గడిచి, నెల రోజుల తరువాత డబ్బులు జమ చేసే సమయంలో ఇవి బయటం పడటం పర్యవేక్షణ లేమిని వెల్లడి చేస్తుంది. ఈ మొత్తం పరిణామాలకు ఒక్కరే పర్యవేక్షకులు కాగా, జరిగిన లోపాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఆలయలోని మరికొంతమంది అధికారులు అతనికి వత్తాసు పలుకుతున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. దీనిపై ఈవో జ్యోతి ఏ విధంగా స్పందిస్తారనేది వేచి చూడాలి. కాగా ఇదే విషయమై ఈవోను వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఆమె ఫోన్‌కు అందుబాటులోకి రాలేదు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top