మిథ్యగా నగదు రహిత వైద్యం..!

మిథ్యగా నగదు రహిత వైద్యం..!


♦ ప్రభుత్వ ఉద్యోగులకు చుక్కలు చూపిస్తున్న ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు

♦ కేన్సర్‌తో వచ్చిన ఓ ఉద్యోగి భార్యను నెలన్నర తిప్పి గాలికొదిలేసిన నిమ్స్

♦ రూ. 200 కోట్లకు పైగా ఆరోగ్యశ్రీకి బకాయి ఉన్నందునే ఈ పరిస్థితి

♦ సమస్యను పరిష్కరించడంలో వైద్య ఆరోగ్యశాఖ వైఫల్యం


సాక్షి, హైదరాబాద్: అతను ఖమ్మం జిల్లాకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు. భార్యకు కేన్సర్ సోకడంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు కేన్సర్ ఆస్పత్రిలో చేర్చాడు. అక్కడ నగదు రహిత వైద్యం అమలు కాక ప్రతి 21 రోజులకు ఒకసారి వేయాల్సిన సూదిమందుకు వేలాది రూపాయలు చెల్లించాడు. 4 నెలలు ఇబ్బందులు పడి వైద్యం చేయిం చాడు. ఆర్థిక పరిస్థితి సహకరించకపోవడం.. సన్నిహితుల సూచన మేరకు భార్యను నిమ్స్‌లో చేర్చాడు.


నగదు రహిత వైద్యం అందిస్తామని.. 21 రోజుల తర్వాత వస్తే సూది మందు వేస్తామని నిమ్స్ వైద్యులు చెప్పారు. 21 రోజులకు వస్తే.. ఈసారికి ప్రైవేటు ఆస్పత్రిలో సూదిమందు వేయించుకోమని సలహా ఇచ్చారు. గత్యంతరం లేక అప్పు చేసి మందు వేయించాడు. మళ్లీ 21 రోజుల తర్వాత రెండోసారి నిమ్స్‌కు వస్తే.. తాము నగదు రహిత వైద్యం చేయలేమని చేతులెత్తేశారు. నెలన్నరపాటు తిప్పి చివరకు గాలికొదిలేశారు. గత్యంతరం లేక భార్య ప్రాణాలు కాపాడుకునేందుకు ఆమెను ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించాడు.


ఇలాగే ప్రభుత్వ వైద్య గెజిటెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర నేత కూడా తన తండ్రికి నగదు రహిత వైద్యం చేయించుకోలేకపోయారు. దీంతో ఆయన ఇటీవలే కన్నుమూశారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు నగదు రహిత వైద్యం ఎంత గొప్పగా అమలవుతుందో ఇంతకంటే పెద్ద ఉదాహరణ అవసరం లేదు. ప్రభుత్వాన్ని నమ్ముకున్న వేలాది మంది ఉద్యోగులకు ప్రైవేటు, ప్రభుత్వ ఆస్పత్రులు చుక్కలు చూపిస్తున్నాయి.


 ఆరోగ్య కార్డులకు విలువేది?

తెలంగాణ రాష్ట్రంలో 5.5 లక్షల మంది ఉద్యోగులు, మరో లక్షన్నర మందికిపైగా పింఛన్‌దారులు ఉన్నారు. వారి కుటుంబ సభ్యులతో కలుపుకుంటే దాదాపు 22 లక్షల మందికిపైగా ఉన్నారు. వారందరి కోసం ప్రభుత్వం నగదు రహిత వైద్య సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ సేవలను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చింది. ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌లో ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులన్నీ ఉద్యోగులందరికీ ఉచిత వైద్య సేవలు అందించాలి. కానీ ప్రైవేటు ఆస్పత్రుల్లో ఎక్కడా నగదు రహిత చికిత్సలు అందక వేలాది మంది ఉద్యోగులు సొంత డబ్బులు చెల్లిస్తున్నారు. ఇక కార్పొరేట్ ఆస్పత్రులైతే నగదు రహిత వైద్యం చేయబోమని సర్కారుకు తేల్చిచెప్పేశాయి. మరోవైపు ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఉచిత ఔట్ పేషెంట్ (ఓపీ) సేవలను సర్కారు ప్రారంభించినా.. ఆయా ఆస్పత్రులు దీన్ని ఏమాత్రం పట్టించుకోవడంలేదు.


రూ. 200 కోట్ల బకాయిలు..

ప్రభుత్వం ఆరోగ్యశ్రీకి రూ. 200 కోట్ల మేర బకాయిలు పడింది. దీంతో ఆరోగ్యశ్రీ కింద వైద్యం చేయించుకున్న పేదలు, ప్రభుత్వ ఉద్యోగుల తరఫున బిల్లులు పెట్టిన ఆస్పత్రులకు చెల్లింపులు జరగలేదు. బకాయిలు చెల్లించకపోవడంతో ఉద్యోగులకు వైద్య సేవలను ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు దాదాపు నిలిపివేశాయి. ఉచిత ఓపీ సేవలనూ ఆస్పత్రులు అమలు చేయడంలేదు. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు ఉద్యోగుల కోసమే ప్రత్యేక ఓపీ సేవలు అందించాలని నిర్ణయించి నా.. పూర్తిస్థాయిలో ఉచిత ఓపీ సేవలు అందడంలేదని ఉద్యోగులు చెబుతున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top