రేషన్ బియ్యం పట్టివేత


మల్లాపూర్: మల్లాపూర్ మండలం సాతారం, చిట్టాపూర్ శివార్లలో గురువారం ఉదయం రేషన్ దుకాణాల నుంచి అక్రమంగా తరలిస్తున్న బియ్యం, గోధుమలు, కిరోసిన్‌ను ఎస్సై షేక్ జానీపాషా నేతృత్వంలో పోలీసు సిబ్బంది దాడులు చేసి పట్టుకున్నారు. రాయికల్ మండలం ఇటీక్యాలకు చెందిన డీలర్ నారాయణ దుకాణం నుంచి మెట్‌పల్లికి చెందిన లింబాద్రి నాలుగు క్వింటాళ్ల బియ్యం, 16 క్వింటాళ్ల గోధుమలు కొనుగోలు చేసి తరలిస్తుండగా స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. మరో ఘటనలో గొర్రెపల్లి నుంచి మెట్‌పల్లికి చెందిన శేఖర్ అనేవ్యక్తి 200 లీటర్ల కిరోసిన్ తరలిస్తుండగా చిట్టాపూర్ శివారులో స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఆరుగురిపై కేసు నమోదు చేశామని, సరకులతో పాటు నలుగురిని అదుపులోకి తీసుకున్నామని ఎస్సై తెలిపారు.



కిరోసిన్ ట్యాంకర్ సీజ్

జగిత్యాల అర్బన్: అదనంగా కిరోసిన్‌ను తరలించిన పౌరసరఫరాల శాఖ ట్యాంకర్‌ను అధికారులు సీజ్‌చేశారు. గురువారం పట్టణంలోని వేంకటేశ్వర ఆటో సర్వీస్ హోల్‌సేల్ కిరోసిన్ డీలర్ దుకాణం వద్దకు కిరోసిన్ పోసేందుకు వచ్చిన ట్యాంకర్‌లో ఉండాల్సిన 10,048 లీటర్ల కన్నా 3,591 లీటర్లు అదనంగా ఉండడంతో దాడిచేసి అధికారులు ట్యాంకర్‌తోపాటు కిరోసిన్‌ను సీజ్ చేశారు. దాడుల్లో ఏజీపీవో కాశీవిశ్వనాథం, డిప్యూటీ తహశీల్దార్ అంజయ్య, కిరణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.



రెండు రేషన్ దుకాణాలపై 6ఏ కేసు

బోయినపల్లి: మండలంలోని అనంతపెల్లి, బూర్గుపెల్లి గ్రామాల్లో రేషన్ దుకాణాల నిర్వాహకులపై 6ఏ కేసు నమోదు చేసినట్లు కరీంనగర్ డివిజన్ ఏఎస్‌వో కె. శ్రీనివాస్ గురువారం తెలిపారు. సివిల్ సప్లై అధికారులు రేషన్ దుకాణాల్లో జరిపిన తనిఖీల్లో నిర్వాహకులు సుమారు వంద లీటర్ల కిరోసిన్ తక్కువగా తీసుకుని ట్యాంకర్ వారికే అమ్మినట్లు తేలడంతో కేసులు నమోదు చేశామన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top