ఇఫ్తార్ విందులో డిప్యూటీ సీఎం

ఇఫ్తార్ విందులో డిప్యూటీ సీఎం


జిల్లా కేంద్రంలోని ఎస్‌ఆర్ గార్డెన్స్‌లో సోమవారం రాత్రి జరిగిన ఇఫ్తార్ విందుకు డిప్యూటీ సీఎం మహమూద్ అలీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనతోపాటు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గుంటకండ్లజగదీష్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, వేముల వీరేశం, టీఆర్‌ఎస్ నేతలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, చాడ కిషన్‌రెడ్డి, చకిలం అనిల్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

 

 నల్లగొండ కల్చరల్ :తెలంగాణ ప్రభుత్వం మైనార్టీల సంక్షేమానికి కట్టుబడి ఉందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ అన్నారు. అందుకోసమే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమ శాఖలను సీఎం కేసీఆర్ తన వద్దనే ఉంచుకున్నారన్నారు. సోమవారం స్థానిక ఎస్‌ఆర్ గార్డెన్స్‌లో టీఆర్‌ఎస్ జిల్లా మైనార్టీ సెల్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఇఫ్తార్ విందులో ఆయన పాల్గొని మాట్లాడారు. ముఖ్యమంత్రి  జిల్లాకు విద్యాశాఖను ఇచ్చి ప్రజల అభిమానాన్ని చూరగొన్నారని, టీఆర్‌ఎస్ ప్రభుత్వ ఆధ్వర్యంలో రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందాలని ముస్లింలు ప్రార్థించాలని కోరారు.

 

 హిందువులు, ముస్లింలు పండగలను కలిసిమెలిసి నిర్వహించుకునే గొప్ప సంప్రదాయం నల్లగొండకు ఉందని, దీనిని ఇలాగే కొనసాగించాలన్నారు. అనంతరం విద్యాశాఖ మంత్రి గుంట కండ్ల జగదీష్‌రెడ్డితో కలిసి ఇఫ్తార్ విందు ఆరగించారు. కార్యక్రమంలో నకిరేకల్, తుంగతుర్తి, మునుగోడు శాసనసభ్యులు వేముల వీరేశం, గాదరి కిషోర్, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ పూలరవీందర్, ఆర్‌డీఓ ఎండీ జహీర్, టీఆర్‌ఎస్ నాయకులు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, నోముల నర్సింహయ్య, జిల్లా అధ్యక్షులు బండా నరేందర్‌రెడ్డి, మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఫరీదొద్దీన్, చాడ కిషన్‌రెడ్డి, చకిలం అనిల్‌కుమార్, దుబ్బాక నర్సిం హారెడ్డి, కె.వి.రామారావు, ఎంపీపీ రెగట్టే మల్లికార్జున్‌రెడ్డి, సైయ్యద్ జమాల్‌ఖాద్రీ, అలీమ్, బషీరోద్దీన్, ముంతాజ్ అలీ, వలీ, ఫయిమోద్దీన్, ఎంఐఎం జిల్లా అధ్యక్షులు అహ్మద్ ఖలీమ్ పాల్గొన్నారు.

 

 వక్ఫ్‌బోర్డుకు త్వరలో జ్యుడీషియల్ పవర్

 నల్లగొండ : వక్ఫ్‌బోర్డుకు త్వరలో జ్యుడీషియల్ పవర్ కల్పించనున్నట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ తెలిపారు.  సోమవారం నల్లగొండలో ఏర్పాటుచేసిన ఇఫ్తార్ విందులో పాల్గొనేందుకు వచ్చిన ఆయన ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో విలేకరులతో మాట్లాడారు. వక్ఫ్‌బోర్డుకు జ్యుడీషియల్ పవర్ ఇవ్వాలని మంత్రి మండలిలో తీర్మానించినట్టు పేర్కొన్నారు. తెలంగాణలో అన్యాక్రాంతమైన వక్ఫ్‌బోర్డు ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందన్నారు. ముస్లిం మైనార్టీలకు 12శాతం రిజర్వేషన్లను కల్పించడానికి కమిటీ వేశామని, కమిటీ నివేదిక అందగానే అమలు చేయనున్నట్లు వెల్లడించారు. ముస్లిం, మైనార్టీల సంక్షేమానికి గత ప్రభుత్వాలు ఏడాదికి 394 కోట్ల రూపాయలు కేటాయించాయన్నారు.

 

 కానీ ప్రస్తుతం తెలంగాణ సీఎం కేసీఆర్ ఏటా వెయ్యి కోట్ల రూపాయలు కేటాయించినట్లు తెలిపారు. అదేవిధంగా రంజాన్ మాసం సందర్భంగా మజీద్‌లు, ఈద్గాల మరమ్మతులకు 50 లక్షల రూపాయలు విడుదల చేసినట్లు తెలిపారు. స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి కూడా లాల్‌దర్వాజ వద్ద బోనాల పండగకు ఏ ముఖ్యమంత్రి కూడా హాజరు కాలేదని, మొట్టమొదటిసారిగా కేసీఆర్ హాజరయ్యారన్నారు. హిందూ, ముస్లిం అనే భావన లేకుండా కలిసిమెలిసి ఉండాలని కోరారు. జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. రెవెన్యూ పరంగా జిల్లా వెనుకబడి ఉందని, కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఎస్పీతో చర్చించి అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.  

 

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top