ఆరోపణలు రుజువు చేయకపోతే సభ్యుడి తొలగింపే శిక్ష !

అసెంబ్లీలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ - Sakshi


* ఆరోపణలు రుజువు చేయకపోతే సభ్యుడి తొలగింపే శిక్ష !

* సభ నుంచి తొలగించేలా తీర్మానం చేయాలి: సీఎం

* ప్రతిపక్షాల ఆరోపణలపై అసెంబ్లీలో ధ్వజమెత్తిన కేసీఆర్

* డీఎల్‌ఎఫ్ భూముల వ్యవహారంపై శాసనసభలో ప్రకటన

* నోరు తెరిస్తే అబద్ధాలే.. మీరు బ్లాక్‌మెయిలర్లు, రాక్షసులు

* కొత్త రాష్ట్రం మర్యాదను మంటగలుపుతున్నారు

* మహారాష్ర్ట అసెంబ్లీ ఆదర్శంగా చర్యలు తీసుకోవాలి

* డీఎల్‌ఎఫ్‌కు భూములిచ్చింది గత ప్రభుత్వమే.. మాకేం సంబంధం?

* ‘మై హోం’ రామేశ్వరరావును బెదిరించి డబ్బులడిగిన వారి పేర్లను బయటపెడతాం..

* బ్లాక్‌మెయిలర్లకు తలొగ్గి ప్రగతి రథచక్రాలను ఆపం

* పెట్టుబడిదారులకు పూర్తి రక్షణ కల్పిస్తామన్న ముఖ్యమంత్రి

* భూములపై చర్చకు విపక్షాల పట్టు.. నేడు కొనసాగిద్దామన్న ప్రభుత్వం


 

సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వంపై చేస్తున్న ఆరోపణలను రుజువు చేయకపోతే సదరు సభ్యుడ్ని సభ నుంచి తొలగించాలని సీఎం కె.చంద్రశేఖర్‌రావు గురువారం అసెంబ్లీలో ప్రతిపాదించారు. ఇందుకోసం తీర్మానం చేయాలని, దానిపై స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని కోరారు. టీఆర్‌ఎస్ సర్కారుపై ప్రతిపక్ష సభ్యులు చేస్తున్న పలు ఆరోపణలపై సీఎం తీవ్రస్థాయిలో స్పందించారు. నిరాధారమైన ఆరోపణలు చేస్తూ కొత్త రాష్ర్టం మర్యాదను మంటగలుపుతున్నారని మండిపడ్డారు. ‘సద్విమర్శ చేస్తే స్వీకరిస్తాం. ఇదేనా మీ విమర్శల స్థాయి. దిక్కూమొక్కూ లేకుండా ఏదైనా మాట్లాడతారా? ఆరోపణలు చేసిన వారు వాటిని రుజువు చేయకపోతే సభ నుంచి తొలగించాలి. ఇందుకు తీర్మానం చేయాలి. మహారాష్ట్ర అసెంబ్లీ ఆదర్శం కావాలి. అక్కడ గవర్నర్‌పై దాడి చేస్తే రెండేళ్లపాటు సభ్యులను సస్పెండ్ చేశారు. ఇక్కడా అలాగే చేయాలి’ అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. డీఎల్‌ఎఫ్ భూముల అంశంపై శాసనసభలో టీఆర్‌ఎస్, టీడీపీ ఇచ్చిన సావధాన తీర్మానంపై ముఖ్యమంత్రి ప్రకటన చేశారు. ఈ సందర్భంగా విపక్ష సభ్యుల ఆరోపణలపై కేసీఆర్ ఆవేశంగా మాట్లాడారు. టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి పేరును నేరుగా ప్రస్తావించకుండా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘‘నోరు తెరిస్తే పచ్చి అబద్ధాలు.. దురుద్దేశంతో, దుర్బుద్ధితో, ఉద్దేశపూర్వకంగా నాపై, నా కుటుంబసభ్యులపై విమర్శలు చేస్తారా? బ్లాక్‌మెయిలర్లు.. రాక్షసులు.. అధికారం కోల్పోయిన వారు.. చౌకబారు విమర్శలు చేస్తున్నారు. వీటిని లెక్కచేయం. బ్లాక్‌మెయిలర్లకు తలొగ్గి ప్రగతి రథచక్రాలను ఆపం. పెట్టుబడిదారులకు పూర్తి రక్షణ కల్పిస్తాం. రాయదుర్గం భూములను అమ్మిందెవరు? వాటికి ఉత్తర్వులు ఇచ్చిందెవరో తెలియదా? మేం అధికారంలోకి రాగానే విమర్శలు చేస్తారా? దిక్కూ మొక్కూ లేకుండా మాట్లాడతారా? ఓ దొరకు మరో దొర భూమి రాసిచ్చాడా? ఇవా విమర్శలు? ఇంత చండాలంగా మాట్లాడతారా? విమర్శలకు ఓ పరిమితి ఉంటుంది. ఎంగిలి మెతుకులకు ఆశపడి కొత్త రాష్ట్రం మర్యాదను పోగొడుతున్నారు. అధికారం, పదవులు శాశ్వతం కాదు. వస్తాయి పోతాయి. కానీ ప్రజాస్వామ్యం అపహాస్యం కావద్దు. భవిష్యత్తులో ఏ ప్రభుత్వం ఉన్నా ఇలాంటి ఆరోపణలకు స్థానం ఇవ్వొద్దు’’ అని సీఎం కేసీఆర్ అన్నారు.

 

 ఇంత దారుణమైన విమర్శలా..?

 డీఎల్‌ఎఫ్‌కు భూములను బహిరంగ వేలం ద్వారా గత ప్రభుత్వమే విక్రయించిందని, వాస్తవాలను మరుగునబెట్టి ఓర్వలేనితనంతో తమ ప్రభుత్వంపై కొందరు సభ్యులు ఆరోపణలు చేస్తున్నారని ముఖ్యమంత్రి మండిపడ్డారు. ‘‘అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం నిధుల సమీకరణలో భాగంగా 2006లో ఏపీఐఐసీ ద్వారా భూములను అమ్మకానికి పెట్టింది. అది గ్లోబల్ టెండర్లు పిలిచి బహిరంగ వేలంలో అమ్మింది. లాటరీ ద్వారా కేటాయించలేదు. అందులో ఎలాంటి రహస్యం లేదు. రూ. 7,600 కోట్ల నిధుల సమీకరణ కోసం ఆ భూమిని విక్రయించింది. డీఎల్‌ఎఫ్‌కు కేటాయించిన దాంట్లో వారసత్వ సంపదగా గుర్తించిన భూమి కూడా ఉన్నందున, వారికి ప్రత్యామ్నాయ భూమి ఇవ్వాలని, రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయించాలని అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సంతకం చేసిన మెమోలోనే ఉంది. వాస్తవాలు ఇలా ఉంటే.. ఓ దొర మరో దొరకు రాసిచ్చారట.. గడీలు ఉంటాయన్నారు. ఇంకో దొర కోసం సిమెంటు ధరలు పెంచారట, ఇంకొకరి కోసం మెడిసిన్ ఫీజులు పెంచారంట! ఇంత దారుణమైన విమర్శలు చేస్తారా? నా జీవితాన్ని పణంగా పెట్టి, పోరాటాలు చేసి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో మేం అధికారంలోకి వచ్చిన 15 రోజులకే ఇన్ని విమర్శలు చేస్తారా? చేసిన పోరాటానికి ఫలితంగా ప్రజలు అధికారాన్ని ఇచ్చారు. ఒంటరిగా సాధించాం. మాకు అధికారం దొంగచాటుగా రాలేదు. ఎవరి నుంచి గుంజుకోలేదు. ఓర్వలేని వారు, పెత్తనం కోల్పోయిన వారు, ఎంగిలి మెతుకులకు ఆశపడి కొత్త రాష్ట్రం మర్యాదను పోగొడుతున్నారు. ఓ దొర కోసం మేం సిమెంటు ధరలను పెంచామా? ఇపుడు ఇక్కడ రూ. 230 ఉంటే ఆంధ్రప్రదేశ్‌లో రూ. 300 ఉంది. అక్కడ ఎవరి కోసం పెంచారని మేం అడగలేదు? సద్విమర్శ చేస్తే స్వీకరిస్తాం. ఇదేనా మీ విమర్శల స్థాయి’’ అని కేసీఆర్ మండిపడ్డారు.

 

 ఆ రికార్డులు, ఫైళ్లన్నీ స్పీకర్ ముందుంచుతాం

 గత కాంగ్రెస్ సర్కారు హయాంలోనే భూముల విక్రయం జరిగిందని సీఎం వివరించారు. ‘కాంగ్రెస్ నేతలు జానారెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, డీకే అరుణ అంతా అప్పటి ప్రభుత్వంలోనే ఉన్నారు. వారి సాక్షిగానే ఆరోజు భూముల అమ్మకాలు జరిగాయి. ఆ రికార్డులను, నోటు ఫైళ్లను, ఉత్తర్వులను స్పీకర్ టేబుల్‌పై పెడతాం. ఎవరెవరి పాత్ర ఏంటో తేల్చుదాం. ఎవరెవరికి ఏ శిక్ష విధిద్దామో తేల్చుదాం. ఏం రూల్సో ఏమో! విచిత్రంగా బహిరంగ స్థలం వారసత్వ సంపద ఎలా అవుతుంది? అలాగైతే భూగోళం మొత్తం వారసత్వ సంపదే. మనుషులు చెట్ల కిందే బతకాలి. చెట్ల కిందే చావాలి. ఈ భూమల ఫైలుపై అప్పటి పరిశ్రమల శాఖ మంత్రి గీతారెడ్డి సంతకం చేశారు. స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి తోట నరసింహం సంతకం చేశారు. రిజిస్ట్రేషన్ ఫీజు సర్దుబాటు ఉత్తర్వులు రావాల్సి ఉంది’’ అని సీఎం చెబుతుండగా.. భట్టి విక్రమార్క కలుగజేసుకున్నారు. దీంతో ‘మిస్టర్ విక్రమార్క! వాస్తవాలు మింగుడు పడటం లేదా? నచ్చడం లేదా?’ అని పేర్కొంటూ కేసీఆర్ తన ప్రసంగాన్ని కొనసాగించారు.

 

 ‘ఆపరేషన్ బ్లూ స్టార్’ బయటపెడతాం

 ‘‘ఈ ఏడాది ఫిబ్రవరి 28 నాడే భూమి బదలాయింపు లేఖలను ఆయా సంస్థలకు ఏపీఐఐసీ ఇచ్చింది. అయితే రిజిస్ట్రేషన్ ఫీజు సర్దుబాటు ఉత్తర్వులు రాలేదు. ఇదిలా ఉండగానే అప్పటి ఐటీ మంత్రి పొన్నాల లక్ష్మయ్యకు కల పడింది. తాడూ బొంగరం లేకుండా ఆ భూమిలోనే గేమింగ్ సిటీ అన్నారు. అందులో అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. ఆ సందర్భంగా దాదాపు రూ. 600 కోట్లు వెచ్చించి ఆక్వాస్పేస్ సంస్థ పేరుతో భూములు తీసుకున్న మై హోం అధినేత రామేశ్వర్‌రావు ఆందోళనకు దిగారు. ఆయన్ని పోలీసులు అరెస్టు చేశారు. దీంతో ఆయనకు అప్పటి టీడీపీ, కాంగ్రెస్, టీఆర్‌ఎస్ నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు దయాకర్‌రావు, కేఎస్ రత్నం, జైపాల్‌యాదవ్, భాను, స్వామిగౌడ్, మహమూద్ అలీ, హరీష్‌రావు తదితరులు అండగా నిలిచారు. ఇవన్నీ జరిగిపోయాయి..’’ అని సీఎం పేర్కొన్నారు. ఈ సందర్భంగా రామేశ్వర్‌రావుకు అండగా నిలిచిన వారిలో జూపల్లి కృష్ణారావు కూడా ఉన్నారు. ఆయన పేరు ఒక్కసారి కూడా చెప్పలేదని రేవంత్‌రెడ్డి పేర్కొనడంతో.. ‘చెబుతాం కదా! ఏ పద్ధతిలో చెప్పాలో చెబుతాం! ఆపరేషన్ బ్లూ స్టార్ మొత్తం చెబుతాం’ అని సీఎం పేర్కొన్నారు.

 

 అసెంబ్లీ ప్రమాణాలను కాపాడాలి

 అనంతరం కేసీఆర్ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. ‘‘భూమి బదలాయిస్తూ లేఖలు ఇచ్చారు. సంస్థలకు భూమి ఇవ్వాలని అన్ని పార్టీల వారు అడిగారు. అప్పుడు రామేశ్వర్‌రావు తరఫున మాట్లాడి ఇప్పుడిలా మాట్లాడుతున్నారు. అపుడు రిజిస్ట్రేషన్ ఫీజు సర్దుబాటు ఆర్డర్ వచ్చే సమయంలోనే కిరణ్‌కుమార్‌రెడ్డి రాజీనామా చేశారు. రాష్ట్రపతి పాలన వచ్చింది. ఫైలు గవర్నర్‌కు వెళ్లింది. జూన్ 2న కొత్త ప్రభుత్వం వచ్చాక చూసుకుంటుందని, అప్పటివరకు పక్కన పెట్టాలనిగవర్నర్ నోట్‌ఫైల్ రాశారు. మేం అధికారంలోకి వచ్చాక దాన్ని అమలు చేశాం. దీనిపై ఎన్ని ఆరోపణలు చేస్తున్నారు. ఓ దొర మరో దొరకు ఇచ్చిందేంది? బ్లాక్‌మెయిల్ చేసేవాళ్లు, ఆరోపణలపై బతికేవాళ్లు, కొన్ని పేపర్లు, చెత్త పలుకులు పలికే వాళ్లే ఈ ఆరోపణలు చేస్తున్నారు.

 

  ఇకపై ఆరోపణలు చేస్తే రుజువు చేయాలి. లేదంటే శిక్ష ఉండాలి. నిర్ణయం తీసుకోండి. లేకపోతే సభ గౌరవం పోతుంది. సభను ప్రజలు దేవాలయం అనుకుంటున్నారు. ప్రజా సమస్యలపై చర్చించాలి. దిగజారిపోయే అసెంబ్లీ ప్రమాణాలను కాపాడాలి. కొందరు రామేశ్వరరావును బ్లాక్‌మెయిల్ చేసి, బెదిరించి డబ్బులు డిమాండ్ చేశారు. సందర్భం వచ్చినప్పుడు వారి పేర్లను వెల్లడిస్తాం. మై హోమ్ కంపెనీకి సిక్స్ స్టార్ క్రిసిల్ రేటింగ్ ఉంది. ఒక గజం ప్రభుత్వ భూమిని కూడా తీసుకోలేదు. వేలంలో బిడ్ వేసి భూమి కొనుగోలు చేశారు. సంస్థలను, వ్యక్తులను ఉద్దేశపూర్వకంగా బద్నాం చేయడం మంచి పద్ధతి కాదు. పెట్టుబడిదారులను సతాయిస్తే రాష్ట్ర భవిష్యత్తుకు మంచిది కాదు.  బ్లాక్ మెయిల్ చేసి భయపెట్టే సంసృ్క తి మంచిది కాదు. ఇన్వెస్టర్ల ప్రయోజనాలను కాపాడుతాం. ఇలాంటి చిల్లర మల్లర చర్యలతో ప్రభుత్వ ప్రయాణాన్ని ఆపలేరు’’ అని పేర్కొన్నారు.

 

 రేవంత్ రెడ్డిపై అనర్హత వేటు వేయండి: జగదీశ్ రెడ్డి

టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని అనర్హుడిగా ప్రకటించాలని విద్యా మంత్రి జగదీశ్‌రెడ్డి స్పీకర్‌కు విజ్ఞప్తి చేశారు. డీఎల్‌ఎఫ్‌కు భూముల కేటాయింపులపై వాడివేడి చర్చ అనంతరం మంత్రి పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తారు. పదో తేదీన అసెంబ్లీ సమావేశాల్లో రైతుల ఆత్మహత్యలు, విద్యుత్తుపై చర్చ జరిగిన సందర్భంలో టీడీపీ సభ్యుడు రాష్ట్ర ప్రజల ప్రయోజనాలకు భిన్నంగా మాట్లాడారని.. నిరాధారమైన పేపర్ చూపించారని.. ఆ లోడ్ డిస్పాచ్ సెంటర్ పత్రాలు సభకు అందజేయాలని సీఎం కోరితే.. ఇస్తామని చెప్పి ఇప్పటికీ ఇవ్వలేదన్నారు. ఈ అంశంలో సభను తప్పుదోవ పట్టించినందుకు ఆ సభ్యుడు క్షమాపణ చెప్పాలని.. లేకుంటే అనర్హుడిగా ప్రకటించాలని కోరారు. దీనిపై స్పందించిన స్పీకర్ మధుసూదనాచారి రేవంత్‌రెడ్డికి మాట్లాడే అవకాశమిచ్చారు. రేవంత్‌రెడ్డి మైక్ అందుకోగానే   అధికార పార్టీ ఎమ్మెల్యేలంతా అడ్డుపడి, ముందు క్షమాపణ చెప్పాలంటూ పట్టుబట్టారు. అధికార పార్టీ సభ్యులు శాంతించకుండా వాదనకు దిగటంతో స్పీకర్ అరగంట సేపు సభను వాయిదా వేశారు.  

 

 చర్చకు విపక్షాల పట్టు

డీఎల్‌ఎఫ్ భూములపై ఇచ్చిన సావధాన తీర్మానంపై సీఎం ప్రసంగం అనంతరం విపక్షాలకు మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడంతో కాంగ్రెస్, టీడీపీ సభ్యులు అభ్యంతరం తెలిపారు. దీంతో అధికార, విపక్షాల మధ్య తీవ్ర వాగ్యుద్ధం జరిగింది. వాయిదా అనంతరం మధ్యాహ్నం 3.30 గంటలకు సభ తిరిగి సమావేశంకాగానే టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి మాట్లాడేందుకు సిద్ధమవుతుండగా టీఆర్‌ఎస్ సభ్యులు అడ్డుపడ్డారు. క్షమాపణ చెప్పిన తర్వాతే మాట్లాడాలని పట్టుబట్టారు. గందరగోళం మధ్య సీఎం కేసీఆర్ కల్పించుకుంటూ.. ‘ముందుగా నిర్ణయించుకున్న మేరకు సావధాన తీర్మానంపై మధ్యాహ్నం 2 గంటల వరకే అనుమతి ఉంది. ఇప్పుడు ‘ఆసరా’ పథకంపై చర్చిద్దాం. సావధాన తీర్మానంపై శుక్రవారం చర్చ కొనసాగిద్దాం’ అని పేర్కొన్నారు.

 

  ప్రతిపక్ష నేత జానారెడ్డి మాట్లాడుతూ.. సావధాన తీర్మానంపై చర్చను 30 నిమిషాల్లో ముగించుకొని తర్వాత ఆసరాపై చర్చిద్దామన్నారు. దీనిపై కేసీఆర్ కల్పించుకొని సావధాన తీర్మానం ముఖ్యమా లేక ఆసరాపై చర్చ ముఖ్యమా అని మరోమారు ప్రశ్నించారు. భూములకు సంబంధించిన అన్ని ఫైళ్లను సభ ముందు పెడతామన్నారు. దీంతో ఆసరాపై చర్చించాలని సీపీఐ, సీపీఎం, వైఎస్సార్ కాంగ్రెస్‌లు కోరాయి. బీజేపీ మాత్రం ఈ నిర్ణయాన్ని స్పీకర్‌కే వదిలేసింది. జానారెడ్డి కూడా అంగీకరించడంతో సభలో ఆసరాపై చర్చ జరిగింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top