అమ్మకానికి ఆడబిడ్డలు

అమ్మకానికి ఆడబిడ్డలు

  • పిల్లలను విక్రయించే ముఠా గుట్టు రట్టు

  • ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన వైనం

  • మహిళను ప్రశ్నిస్తున్న ఐసీడీఎస్ అధికారులు

  • దూలపల్లి: సూరారం కాలనీలో చంటి పిల్లలను విక్రయించే ముఠా గుట్టు రట్టయింది. ఓ బిడ్డను విక్రయించేందుకు యత్నిస్తుండగా ఐసీపీఎస్, ఐసీడీఎస్ అధికారులు వలపన్ని ముఠాను పట్టుకున్నారు. చంటిబిడ్డను శిశువిహార్‌కు తరలించారు. వివరాలివీ... తూర్పు గోదావరి జిల్లా అమలాపురానికి చెందిన రత్నకుమారి, శర్మ దంపతులు రెండు నెలల క్రితం నగరానికి వ చ్చారు. సూరారం కాలనీలోని రాజిరెడ్డి నగర్‌లోగల అంగన్‌వాడీ-05 సెంటర్ వద్ద అద్దె ఇంట్లో ఉంటున్నారు.



    స్థానిక అంగన్‌వాడీ కార్యకర్తను రత్నకుమారి పరిచయం చేసుకుని తాను 8 నెలల గర్భిణినని, తన పేరు జాబితాలో రాసుకోవాలని పదే పదే కోరింది. డాక్టర్ పరీక్ష చేసిన తరువాతనే నమోదు చేస్తామని అంగన్‌వాడీ కార్యకర్త ఆమెకు తేల్చి చెప్పింది. మరో వారం తరువాత రత్నకుమారి 45 రోజుల చంటిబిడ్డతో కనిపించింది. అంగన్‌వాడీ కార్యకర్త ప్రశ్నించగా.. పొంతనలేని సమాధానం చెప్పింది.



    ఈ విషయాన్ని ఐసీడీఎస్ అధికారి జ్యోతి పద్మ దృష్టికి ఆమె తీసుకెళ్లింది. దీంతో ఐసీడీఎస్, ఐసీపీఎస్ అధికారులు రత్నకుమారిని రెండు రోజుల క్రితం నిలదీయగా..సరైన సమాధానం రాలేదు. దీంతో వారు పాపను స్వాధీనం చేసుకొని, శిశు విహార్‌కు తరలించారు.

     

    మరో సంఘటన ఇలా..



    ఆనంద్‌నగర్‌కు చెందిన అమీనాబేగం కూతురు ఆషాబేగంకు ఐడీపీఎల్‌కు చెందిన సలీంతో 12 ఏళ్ల క్రితం వివాహమైంది. కొన్నాళ్లుగా సలీం వేరే మహిళతో ఉంటున్నాడు. ఆషాబేగం ఒక్కతే ఉంటోంది. ఈనెల 8న ఆషాబేగంకు పాప పుట్టింది. గర్భవతులు, చిన్నారుల వివరాలు సేకరించే క్రమంలో ఓ అంగన్‌వాడీ కార్యకర్త.. ఆషాబేగం వద్ద చిన్నారి లేకపోవడం చూసి ప్రశ్నించింది. ఇక్కడా పొంతన లేని సమాధానం వచ్చింది. అనుమానం వచ్చిన కార్యకర్త తమ అధికారి అధికారి జ్యోతి పద్మ దృష్టికి తీసుకువెళ్లింది.  



    ఐసీడీఎస్, ఐసీపీఎస్ అధికారులు విచారించగా... జగద్గిరిగుట్టలోని రాజీవ్ గృహకల్పకు చెందిన తపస్వి, విష్ణు సర్కార్‌లకు పాపను రూ.25 వేలకు విక్రయించినట్టు ఆషా చెప్పింది. దీంతో పాపను కొనుగోలు చేసిన వారిని రప్పించారు. వారు జీడిమెట్ల పీఎస్‌కు వచ్చి, పాపను తిరిగి ఇచ్చేది లేదని మొండికేశారు. ఈ ఘటనపై దుండిగల్ పీఎస్‌లో కేసు నమోదైంది. అక్కడే సమస్యను పరిష్కరించుకోవాలని చెప్పి పోలీసులు వారిని పంపించారు.



    అధికారుల దర్యాప్తులో సూరారం కాలనీలో ఉంటున్న రత్నకుమారి కొన్ని రోజులుగా రాత్రి వేళల్లో ఆనంద్‌నగర్‌లోని ఆషా బేగం ఇంటికి వస్తున్నట్టు తేలింది. రెండు నెలలకోసారి ఇల్లు మార్చడం.. ఇప్పటికే ఓ చంటిబిడ్డతో పట్టుబడినే నేపథ్యంలో ఐసీడీఎస్ అధికారులు ఆమెపై అనుమానంతో కూపీ లాగుతున్నారు.

     

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top