నకిలీ నోట్లను గుర్తించండిలా...

నకిలీ నోట్లను గుర్తించండిలా... - Sakshi


నకిలీ నోట్లతో సామాన్యులు పడుతున్న ఇబ్బంది అంతా ఇంతా కాదు. కష్టపడి సంపాదించిన డబ్బుల్లో నకిలీ నోట్లు ఉన్నాయని తెలిస్తే ఆందోళన తప్పదు. రిజర్వ్‌బ్యాంక్ 2011 లెక్కల ప్రకారం మన దగ్గర 64,577 మిలియన్ నోట్లను దొంగనోట్లుగా గుర్తించారు. మరి డబ్బులు తీసుకునే ముందు అవి నకిలీవా లేక అసలైనవా? తెలుసుకోవడం తప్పనిసరి. వాటిని ఎలా గుర్తించాలి. ఏ నోటును ఎలా పరీక్షించాలనే వివరాలు మీ కోసం...



రూ.వెయ్యి, 500, 100, 50, 20ను గుర్తించాలంటే

ఈ 10 అంశాలను పరిశీలించాలి






1. ఎడమవైపున మధ్యలో 1000 సంఖ్యలో ప్రతి అక్షరం సగం కనిపించి సగం కనపడకుండా ఉంటుంది. వెలుతురులో చూస్తే పూర్తిగా కనిపిస్తుంది. నోటును తిరగేసి చూస్తే రివర్స్‌లో సంఖ్య కనిపిస్తుంది.



2.  దాని పక్కనే ఉన్న ఖాళీ ప్రదేశంలో గాంధీజీ ఫొటో వాటర్ మార్క్‌తో కనిపిస్తుంది. వాటర్ మార్క్‌కు పక్కన 1000 సంఖ్య నిలువుగా ఉంటుంది. దీన్ని కూడా వెలుతురుకు పెట్టి చూడాలి.



3.  నోటును పైకీ కిందకు అంటుంటే మధ్యలో ఉన్న 1000 అక్షరాల రంగు మారుతుంది. గ్రీన్, బ్లూగా కనిపిస్తుంది.

 

4. కుడి వైపున పైన, ఎడమ వైపు కింద ఉన్న సిరీస్ నంబరు వెలుతురులో చూస్తే ప్రత్యేకంగా కనిపిస్తుంది.

 

5.  మధ్యలో ఉన్న థ్రెడ్(దారం)పై భారత్, ఆర్‌బిఐ, 1000 అక్షరాలు కనిపిస్తాయి. నోట్‌ను పైకీకిందకు అంటుంటే మధ్యలో థ్రెడ్ బ్లూ, గ్రీన్ కలర్‌లో కనిపిస్తుంది.

 

6.  దానికిందే ఉన్న హిందీ అక్షరాలు, అలానే పైన నోటుకు మధ్యలో ఉన్న హిందీ, ఇంగ్లిష్ అక్షరాలు ముట్టుకుంటే చేతికి తగిలిన భావన కలుగుతుంది.

 

7.  నోటుకు కుడి వైపున చివరన 1000 సంఖ్యకు, రిజర్వ్ బ్యాంక్ ముద్రకు మధ్యలో లెటెంట్ ఇమేజ్. దీన్ని సూక్ష్మంగా పరిశీలిస్తేనే కనిపిస్తుంది. నోటును దగ్గరగా పెట్టుకుని చూస్తేనేఇది కనిపిస్తుంది.

 

8. ఇమేజ్ ఎడమ వైపున, గాంధీజీ ఫొటోకు మధ్యలో ఉన్న ఖాళీలో సూక్ష్మ పరిశీలన చేస్తే ఆర్‌బిఐ, 1000 అక్షరాలు కనిపిస్తాయి.

 

9. ఎడమ వైపు చివర మధ్యలో డైమండ్ ఆకారంలో గుర్తు ఉంటుంది. దీన్ని చేతితో తడుముతుంటే ముట్టుకున్న ఫీలింగ్ కలుగుతుంది.

 

10. నోటు వెనుక వైపు మధ్యలో సంవత్సరం ముద్రించి ఉంటుంది.

 

రూ.10 నోట్ ఈ విధంగా...

రూ. పది నోటుకు ఏడు అంశాలు పరిశీలించాలి. పైన పేర్కొన్న వాటిలో స్పెషల్ ఐడెంటిఫికేషన్ మార్క్, లెటెంట్ ఇమేజ్ ఉండదు. అక్షరాలు చేతితో తడిమితే ఎలాంటి భావన కలగవు. మిగిలినవన్నీ యథాతథం

 

గమనిక: ప్రతి నోటుకు ఎడమ వైపు చివర మధ్యలో గుర్తులు మారుతుంటాయి. రూ.1000కి డైమండ్, రూ.500కు రౌండ్ చుక్క, రూ.వందకు త్రిభుజం, రూ.50కి బ్లాక్ గుర్తు, రూ. 20కి రెక్టాంగిల్ గుర్తు ఉంటుంది. రూ.10 నోటుకు ఎలాంటి గుర్తు ఉండదు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top