పరిశ్రమల కోసం భూములు గుర్తించాలి

పరిశ్రమల కోసం భూములు గుర్తించాలి


రాంనగర్  :రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు అనుకూలమైన భూములను గుర్తించి వాటి వివరాలు ప్రభుత్వానికి అందజేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయ అదనపు కార్యదర్శి స్మితా సబర్వాల్ జిల్లా కలెక్టర్లను కోరారు. సోమవారం సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో పరిశ్రమలు పెద్ద ఎత్తున ప్రోత్సహించేందుకు సీఎం నిర్ణయించినట్లు చెప్పారు. అందుకు అనుగుణంగా  రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు అనుకూలమైన భూములను గుర్తించాలన్నారు. వాటిని సర్వేచేసి వివరాలను సర్వే నెంబర్లతో సహ తెలియజేయాలన్నారు. భూమి ఒకే చోట కాకుండా వేరు వేరు ప్రాంతాలలో ఉన్నదానిని గుర్తించాలని సూచించారు.

 

 పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రదీప్ చంద్ర మాట్లాడుతూ రాష్ట్రంలో చాలా ప్రాంతాలలో పరిశ్రమల స్థాపనకు అనుకూలమైన భూములు ఉన్నాయన్నారు. వాటిపై జిల్లా కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. ముఖ్యంగా హైదరాబాద్‌కు దగ్గరగా ఉన్న జిల్లాలో పారిశ్రామిక వేత్తలు పరిశ్రమలు స్థాపించడానికి ముందుకు వస్తున్నట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్ టి. చిరంజీవులు మాట్లాడుతూ జిల్లాలో 10134 ఎకరాల భూమిని గుర్తించి నట్లు చెప్పా రు.  అందులో 4500ల ఎకరాలు సర్వేచేయగా 400 ఎకరాలు మాత్రమే పరిశ్రమల స్థాపనకు అనుకూలంగా ఉందని తెలిపారు. ఇంకా 6500ల ఎకరాల భూమిని సర్వే చేయించాల్సి ఉందన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జేసీ హరిజవహర్‌లాల్, అదనపు జేసీ వెంకట్రావు, జిల్లా పరిశ్రమలశాఖ మేనేజర్ ప్రసాదరావు, డ్వామా పీడీ సునంద, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

 

 భూపంపిణీ వివరాలు సేకరించాలి : రేమండ్ పీటర్

 భూ పంపిణీకి అర్హులైన దళితులకు సంబంధించిన వివరాలను పకడ్బందీగా సేకరించాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ రేమండ్ పీటర్ ఆదేశించారు. సోమవారం సచివాలయం నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. వ్యవసాయ ఆధారిత నిరుపేద షెడ్యూల్డ్ కులాల వారికి ఆగస్టు15న ప్రతి నియోజకవర్గంలో ఒక హాబిటేషన్‌లో భూ పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. దానికి అనుగుణంగా ప్రతి నియోజకవర్గంలో గుర్తించబడిన హాబిటేషన్‌లో అందుబాటులో ఉన్న భూముల వివరాలు, కొనుగోలు చేయాల్సిన వివరాలను జిల్లాల వారీగా సమీక్షించారు.

 

 వ్యవసాయరంగంపై ఆధారపడిన భూమి లేని ఎస్సీలను గుర్తించాలన్నారు. లబ్ధిదారులు, స్వయం సహా యక సంఘాల సభ్యులను భాగస్వాములను చేసి భూములు అమ్మేవారీతో రేటు మాట్లాడాలని సూచించారు. జిల్లాస్థాయి కమిటీ ఆ భూమి విలువను నిర్థారించాలని సూచించారు. జిల్లా కలెక్టర్ టి. చిరంజీవులు మాట్లాడుతూ జిల్లాలో 12 నియోజకవర్గాల్లో 12 హాబిటేషన్లను గుర్తించినట్లు తెలిపారు. ఈ గ్రామాలలో  ఈ నెల 30 వరకు సర్వే పూర్తి అవుతుందని తెలిపారు. భూములు కొనుగోలు చేయడంలో కమ్యూనిటీ, స్వయం సహాయక సంఘూలను భాగస్వాములను చేసి వారి ద్వారా భూములను  అమ్మే వారితో మాట్లాడినట్లు చెప్పారు.  వెల్త్ ర్యాంకింగ్ ప్రకారం లబ్ధిదారులను ఎంపిక చేసి భూములను పంపిణీ చేయనున్నట్లు వివరించారు. కాన్ఫరెన్స్‌లో సచివాలయం నుంచి సీఎం అడ్వయిజర్ రాంలక్ష్మణ్, షెడ్యూల్డు కులాల సంక్షేమ శాఖ కమిషనర్ రాహుల్‌బొజ్జా, సెర్పు సీఈఓ మురళి తదితరులు పాల్గొన్నారు.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top