కుటుంబ పరిస్థితులు గుర్తించండి


  •       వాదనకు రాకపోవడం న్యాయవాది తప్పు

  •       జస్టిస్ సి.వి.నాగార్జున రెడ్డి

  •       తల్లీ బిడ్డలకు అండగా హైకోర్టు

  •       కింది కోర్టు తీర్పును తప్పుపట్టిన వైనం

  • సాక్షి, హైదరాబాద్: చిన్న వయస్సులో భర్తను కోల్పోయి... కుటుంబం గ డిచేదెలాగో తెలియక దిక్కుతోచని స్థితిలో, పరిహారం కోసం న్యాయ పోరాటం చేస్తున్న 25 ఏళ్ల వితంతువుకు, ఆమె ఐదేళ్ల కుమారుడికి హైకోర్టు అండగా నిలిచింది. పరిహారం కోసం ఆ మహిళ, ఆమె కుమారుడు దాఖలు చేసుకున్న పిటిషన్‌ను ఓ చిన్న కారణంతో కొట్టివేస్తూ రంగారెడ్డి రెండోఅదనపు జిల్లా కోర్టు వెలువరించిన ఉత్తర్వులను హైకోర్టు తప్పుబట్టింది. ఆ ఉత్తర్వులను కొట్టివేస్తూ, పరిహారం కోసం వారు దాఖలు చేసుకున్న పిటిషన్‌ను మూడు నెలల్లో పరిష్కరించాలని కింది కోర్టును ఆదేశించింది.



    ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి ఇటీవల తీర్పు వెలువరించారు. కుటుంబాల జీవితాలు ముడిపడి ఉండే కేసుల్లో ఓ నిర్ణయం వెలువరించే ముందు బాధితుల పరిస్థితులను, క్షేత్రస్థాయి వాస్తవాలను పరిగణనలోకి తీసుకోవాలని కింది కోర్టులకు జస్టిస్ నాగార్జునరెడ్డి హితవు పలికారు. వాదనలు వినిపించేందుకు కోర్టు ముందు హాజరు కాకపోవడం న్యాయవాది తప్పిదమే అవుతుంది తప్ప, అందుకు బాధితులను బాధ్యులను చేయడం సరికాదని స్పష్టం చేశారు.



    రంగారెడ్డి జిల్లాకు చెందిన షేక్ గడ్డం ఖాసిం ఆరేళ్ల క్రితం ఆర్టీసీ బస్సు ప్రమాదంలో మృతి చెందారు. 25 ఏళ్ల అతని భార్య, ఐదేళ్ల కుమారుడు రోడ్డున పడ్డారు. దీంతో వారు ఆర్టీసీ నుంచి పరిహారం ఇప్పించాలని కోరుతూ రంగారెడ్డి జిల్లా కోర్టులో 2008లో పిటిషన్ దాఖలు చేశారు. వాదనలు వినిపించేందుకు న్యాయవాది రాలేదన్న చిన్న కారణంతో 2011లో కోర్టు వారి పిటిషన్‌ను కొట్టివేసింది. దీంతో తమ పిటిషన్ కొట్టివేత ఉత్తర్వులను రద్దు చేసి, మళ్లీ విచారణ చేపట్టాలని కోర్టును కోరారు.



    ఆర్టీసీ సైతం ఈ అభ్యర్ధనను వ్యతిరేకించకుండా, కేసు పూర్వాపరాల ఆధారంగా విచారణ చేపట్టాలని కోర్టును కోరారు. కోర్టు అందుకు నిరాకరిస్తూ, ఆర్టీసీ వైఖరిని తప్పుపట్టింది. దీంతో ఆ తల్లీ కుమారులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై జస్టిస్ నాగార్జునరెడ్డి విచారణ జరిపారు. వాదనలు విన్న న్యాయమూర్తి ఇటీవల తీర్పునిస్తూ, బాధితుల పిటిషన్‌ను కొట్టివేసే సమయంలో కింది కోర్టు క్షేత్ర స్థాయిలో వాస్తవాలను పరిగణనలోకి తీసుకోవడాన్ని విస్మరించినట్లు కనిపిస్తోందన్నారు.



    ‘బాధితులు చిన్న వయస్సులోనే భర్తను, తండ్రిని కోల్పోయిన వారు. అన్నం పెట్టే వ్యక్తిని కోల్పోయి, దిక్కుతోచని స్థితిలో ఆ కుటుంబం ఉంది. వాస్తవానికి న్యాయస్థానాలు కేసుల విచారణ సమయంలో అనవసర సానుభూతి చూపాల్సిన అవసరం లేదు. అదే కోర్టు ఆ కేసుల నేపథ్యం, అందులో ముడిపడి ఉన్న కుటుంబాల జీవితం, క్షేత్రస్థాయి వాస్తవాలను పరిగణనలోకి తీసుకోవాలి. అన్నం పెట్టే వ్యక్తి అకస్మాత్తుగా మరణిస్తే ఆ కుటుంబ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించడం అంత కష్టం కాదు. వారి జీవితం మొత్తం విధ్వంసానికి గురై, అంధకారంగా మారింది.



    ఈ కారణంతోనే ఆర్టీసీ సైతం మానవతా దృక్పథంతో బాధితుల పిటిషన్‌ను కింది కోర్టులో వ్యతిరేకించలేదు. కింది కోర్టు దీనిని అభినందించాల్సింది పోయి, అర్ధం లేని వ్యాఖ్యలు చేసింది. ఇటువంటి కేసుల విచారణ సమయంలో న్యాయస్థానాలకు కొంత మానవతా దృక్పథం అవసరం. కోర్టు ముందు వాదనలు వినిపించేందుకు ఎందుకు హాజరు కాలేదో చెప్పకపోవడం న్యాయవాది తప్పు. ఇందుకు బాధితులను బాధ్యులను చేయడం తగదు.



    ఈ విషయాన్ని పట్టించుకోకుండా బాధితుల పిటిషన్‌ను కొట్టివేయడం వారి న్యాయపరమైన హక్కును హరించడమే అవుతుంది.’ అని జస్టిస్ నాగార్జునరెడ్డి తన తీర్పులో పేర్కొన్నారు. బాధితుల పిటిషన్‌ను కొట్టివేస్తూ రంగారెడ్డి రెండోఅదనపు జిల్లా జడ్జి ఐ.రమేష్ ఇచ్చిన తీర్పును రద్దు చేస్తూ, వారి పిటిషన్‌ను మూడు నెలల్లో పరిష్కరించాలని ఆదేశించారు.

     

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top