తాగునీటి సమస్యపరిష్కరిస్తా..


కొడంగల్ నియోజకవర్గం.. జిల్లాకు సరిహద్దులో దూరంగా విసిరేసినట్టుగా ఉండే ప్రాంతం. అభివృద్ధిలోనూ అంతేదూరంలో ఉంది. ఉపాధి కోసం పొట్టచేతపట్టుకుని ఏటా వలసబాట పట్టేవారూ ఎక్కువే.. భార్యాపిల్లలను వదలి దుబాయ్.. లేదంటే ముంబైకి వెళ్తుంటారు. అయితే గిరిజన తండాలు ఎక్కువగా ఉన్న ఈ ప్రాంతంలో తాగునీటి సమస్య తీవ్రంగా వేధిస్తోంది. పారిశుద్ధ్య వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే ఎ.రేవంత్‌రెడ్డి ‘సాక్షి’  రిపోర్టర్‌గా నియోజకవర్గ ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. ముఖ్యంగా తాగునీటి సమస్యను  పరిష్కరిస్తానని భరోసా ఇచ్చారు.

 

 రేవంత్‌రెడ్డి : ఏం పకీరయ్య బాగున్నావా.. చిట్లపల్లిలో ఏం సమస్యలు ఉన్నాయి.

 పకీరయ్యగౌడ్ : సార్..! మా గ్రామంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. మా ఊరోళ్లు ఇబ్బంది పడుతున్నారు. వేసవికాలం వస్తోంది. అధికారులకు చెప్పి ఇబ్బంది లేకుండా చూడండి.

 రేవంత్‌రెడ్డి : తాగునీటి సమస్యను పరిష్కరించాలని ఇప్పటికే అధికారులను ఆదేశించాను. రానున్న వేసవిలో ఇబ్బంది లేకుండా చూస్తా. చిట్లపల్లి పంచాయతీతో పాటు అనుబంధ గ్రామాలు, తండాల్లో పింఛన్లు, రేషన్‌కార్డులు అందరికీ వస్తున్నాయా..? ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా..?

 

 పకీరయ్య గౌడ్ : సార్..! పింఛన్లు ఇప్పటికీ చాలామందికి రాలేదు. ఆధార్ కార్డును అనుసంధానం చేయడం వల్ల అర్హులైన పేదలు ఎంతోమందికి నష్టం జరుగుతోంది. వయోపరిమితిని 65 ఏళ్లకు పెంచడం వల్ల అర్హులకు అన్యాయం జరిగింది. ప్రభుత్వం విధించిన నిబంధనలు

 

 

 కూడా అడ్డంకిగా మారాయి.

 రేవంత్‌రెడ్డి: ఈ విషయంలో నేను అసెంబ్లీలో మాట్లాడి అర్హులందరికీ న్యాయం జరిగే విధంగా ప్రయత్నిస్తా.. ప్రభుత్వం బాధ్యత వహించాలి. అందరికీ న్యాయం జరిగేటట్లు చూడాల్సిన అవసరం ఉంది. మానవతా దృక్పథంతో అధికారులు అర్హులందరికీ న్యాయం చేయాలి.

 రేవంత్‌రెడ్డి: నాయక్ జీ.. కైసా హై అప్‌నా తండా..

 రేగ్యానాయక్: సార్.. బాపల్లితండాలో చాలా మందికి పింఛన్లు రాలేదు. రేషన్‌సరుకులు కూడా అందలేదు. వృద్ధులకు పింఛన్లు చెల్లించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. లో ఓల్టేజీ సమస్య తీవ్రంగా ఉంది. కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియడం లేదు. ఇబ్బందిగా ఉంది.




 రేవంత్‌రెడ్డి : అర్హులందరికీ పింఛన్లు, రేషన్‌కార్డులు ఇవ్వాలని ఇప్పటికే అధికారులకు చెప్పాను. కరెంట్ సమస్య పరిష్కరించాలని ట్రాన్స్‌కో అధికారులకు చెబుతాను. నియోజకవర్గంలో కరెంట్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఈ విషయంలో జిల్లా, రాష్ట్ర ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తాను.




 రేవంత్‌రెడ్డి : కిష్టానాయక్‌జీ పల్లెగడ్డలో ఏంటి పరిస్థితి.




 కిష్టానాయక్ : మద్దూరు మండలం దోరేపల్లి పంచాయతీ పల్లెగడ్డతండాలో తాగునీటి సమస్య ఉంది. ఇళ్లబిల్లులు రావడం లేదు. పింఛన్ల

 మంజూరులో కూడా ఇబ్బందులు ఉన్నాయి. జనాభా ప్రాతిపదికన తండాలను పంచాయతీలుగా ఏర్పాటుచేయాలి.

 రేవంత్‌రెడ్డి : జనాభా ప్రాతిపదికన పంచాయతీలు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఉన్నతస్థాయి అధికారులు చర్చిస్తున్నారు. త్వరలో అమలయ్యే అవకాశం ఉంది. తాగునీటి సమస్యను పరిష్కరించాలని ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించాను. రానున్న వేసవిలో సమస్య లేకుండా చూస్తారు.




 రేవంత్‌రెడ్డి: హన్మంతు.. దోరేపల్లిలో సమస్యలు ఏమున్నాయి..?




 హన్మంతు : దోరేపల్లిలో 65 ఏళ్లు దాటిన వారికి కూడా పింఛన్లు రావడం లేదు. తండాలకు రోడ్డు సౌకర్యం లేదు.  

 రేవంత్‌రెడ్డి : గిరిజనులకు న్యాయం జరిగే విధంగా అసెంబ్లీలో మాట్లాడుతా. తండాలకు రోడ్డు సౌకర్యం కల్పిస్తాను. క్యావోరా రహీంబాయి.


రోడ్ల విస్తరణ పనులు జరుగుతున్నాయా..?




 రహీం : లేదు సార్..! రోడ్ల విస్తరణ పనులు ముందుకు సాగడం లేదు. అభివృద్ధి జరిగితే అందరికీ మంచిది. కొడంగల్‌కు రాకపోకలు పెరుగుతాయి. వ్యాపారం వృద్ధి చెందుతుంది.

 

 రేవంత్‌రెడ్డి : ఈ సారి అభివృద్ధి జరగకపోతే భవిష్యత్తులో ఆ అవకాశం రాకపోవచ్చు.




 రహీం : సార్ మీరే అధికారులకు చెప్పి పనులు వేగవంతమయ్యే విధంగా చర్యలు తీసుకోవాలి. మురుగుకాల్వల నిర్మాణం కూడా తొందరగా పూర్తయ్యే విధంగా ఆర్‌అండ్‌బీ అధికారులను ఆదేశించండి.. దుకాణాల ముందు తవ్వకాలు చేపట్టడం వల్ల ప్రజలకు, వ్యాపారులకు ఇబ్బందికరంగా ఉంది.




 రేవంత్‌రెడ్డి : రోడ్ల విస్తరణకు సంబంధించి స్థానికులతో కమిటీ వేశాను. వ్యాపారులతో కలిసి చర్చించమని చెప్పాను. ఆర్‌అండ్‌బీ అధికారులు,  పంచాయతీ ఏఈఓను పోలీసులతో కలిసి సమన్వయంతో పనిచేయాలని చెప్పాను. మురుగుకాల్వల నిర్మాణం వేగవంతం చేయాలని ఆర్‌అండ్‌బీ అధికారులను ఆదేశిస్తాను. స్థానికులకు ఇబ్బంది లేకుండా చూస్తాను. రోడ్ల విస్తరణకు ప్రజలు సహకరించాలి. అభివృద్ధిని అడ్డుకుంటే పట్టణం పురోగతి సాధించదు. అందరి సహకారం, సమన్వయంతోనే అది సాధ్యమవుతుంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top