నేనెలాంటి తప్పూ చేయలేదు

నేనెలాంటి తప్పూ చేయలేదు - Sakshi

  • దేవుడి సాక్షిగా చెబుతున్నా: రాజయ్య

  • తప్పు చేసినట్లు నిరూపణ అయితే ఏ శిక్షకైనా సిద్ధం..

  • సాక్షి, హైదరాబాద్: ‘ఏసు ప్రభువును నమ్మిన బిడ్డగా.. నేను ఎలాంటి తప్పూ చేయలేదు. తప్పు చేసినట్లు నిరూపణ అయితే ఏ శిక్ష కైనా సిద్ధం. ముఖ్యమంత్రిగా, టీఆర్‌ఎస్ అధ్యక్షుడిగా కె.చంద్రశేఖర్‌రావు తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉన్నాను’’ అని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయిన టి.రాజయ్య పేర్కొన్నారు. ఆదివారం రాజయ్యను కేబినెట్ నుంచి తప్పించి, ఆ స్థానంలో కడియం శ్రీహరిని డిప్యూటీ సీఎంగా ఎంపిక చేసిన విషయం తెలిసిందే.



    ఈ పరిణామం తర్వాత హైదరాబాద్‌లోని తన క్వార్టర్ నుంచి బయటకు రాని రాజయ్య... రాత్రి పది గంటల సమయంలో అత్యవసరంగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి, ఈ అంశంపై మాట్లాడారు. ‘‘సీఎం కే సీఆర్ తండ్రిలా ప్రోత్సహించారు. తెలంగాణ రాష్ట్రం కేసీఆర్‌తో మాత్రమే సాధ్యమని కాంగ్రెస్‌ను వదులుకుని వచ్చి ఆయన నాయకత్వంలో పనిచేశాను. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాను. నేను ఊహించని రీతిలో ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు.



    ఈ ఏడు నెలల కాలంలో ఎంతో సహకారం అందించారు..’’ అని చెప్పారు. వైద్య, ఆరోగ్యశాఖ ప్రక్షాళన,  క్షేత్ర స్థాయిలో ప్రజలతో మమేకం కావడం కోసం ఎంతో కృషి చేశానన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా తెలంగాణలో హాస్పిటల్ బేస్‌డ్ బడ్జెట్ కేటాయించారన్నారు. కేసీఆర్ లక్ష్యం, ఆరోగ్య తెలంగాణకు అనుగుణంగా ఆసుపత్రుల రూపురేఖలు మారేలా కృషి చేశానని, వీటి ఫలితాలు త్వరలోనే అందుతాయని తెలిపారు.వైద్య, ఆరోగ్య శాఖకు వన్నె తెచ్చేందుకు ప్రయత్నించానని, తనకు సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాన ని పేర్కొన్నారు.

     

    క్షేత్రస్థాయిలో తప్పులు..



    వైద్య ఆరోగ్య శాఖలో క్షేత్రస్థాయిలో తప్పులు జరిగాయని.. అధికారులు తప్పులు చేస్తున్నారని పసిగట్టి సీఎం ఒక నిర్ణయం తీసుకున్నారని రాజయ్య వ్యాఖ్యానించారు. మరో పెద్ద పొరపాటు జరగకుండా బంగారు తెలంగాణ కోసం పారదర్శకంగా ఉండాలని సీఎం నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. కేసీఆర్ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తానని.. తెలంగాణ పున ర్నిర్మాణంలో కూలీగా, పార్టీలో క్రియాశీలక కార్యకర్తగా పనిచేస్తానని తెలిపారు. వైద్య, ఆరోగ్య శాఖకు చెందిన అన్ని స్థాయిల ఉద్యోగులను ఏమైనా బాధపెట్టి ఉంటే క్షమించాలని కోరారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top