నగదు రహితంగా ట్రాఫిక్ చలానా

నగదు రహితంగా ట్రాఫిక్ చలానా - Sakshi


* ఇకపై చెల్లింపులన్నీ డెబిట్, క్రెడిట్, బ్యాంకు, ఈ-సేవ, మీ-సేవ ద్వారానే

* కొత్త విధానానికి హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల శ్రీకారం



సాక్షి, హైదరాబాద్: ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడిన వాహనదారుల నుంచి బేగంపేట ట్రాఫిక్ సిబ్బంది చలానా రాసి డబ్బులు కట్టించుకునే పనిలో నిమగ్నమయ్యారు. అదే సమయంలో ఏసీబీ అధికారులు వారిని తనిఖీ చేయగా చలానా పుస్తకంలో బిల్లు కంటే సిబ్బంది జేబులో అదనంగా కొన్ని వేల రూపాయలు దొరికాయి. దీంతో ఓ ఎసై్సతో పాటు ముగ్గురు సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు. ఇది రెండు నెలల కిందటి సంఘటన. ఇలాంటివి తరచుగా జరుగుతున్న నేపథ్యంలో ట్రాఫిక్ సిబ్బంది వాహనదారుడి నుంచి చలానా రుసుం నగదు రూపంలో చెల్లించే విధానానికి స్వస్తి పలికారు.



నిబంధనలు ఉల్లంఘించి ట్రాఫిక్ పోలీసులకు చిక్కిన వాహనదారులు ఇక నుంచి నగదు రూపంలో చలానా రుసుము వారికి చెల్లించకూడదు. డెబిట్, క్రెడిట్, బ్యాంకు, ఈ-సేవ, మీ-సేవ కేంద్రాల్లో మాత్రమే డబ్బులు చెల్లించాలి. ఈ కొత్త విధానం మంగళవారం నుంచి హైదరాబాద్ పరిధిలోని ట్రాఫిక్  విభాగంలో అమలులోకి వచ్చింది. అంటే ఇకపై ట్రాఫిక్ సిబ్బంది కేవలం చలానాలు రాయాలి.. డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా డబ్బులు వారి వద్ద ఉన్న పీడీఎఫ్ మిషన్‌తో స్వైప్ చేయాలి. అలా చేయడం ద్వారా నేరుగా వాహనదారుడి డబ్బులు ప్రభుత్వ ఖాతాలోకి జమ అవుతాయి.



వాహనదారుడి వద్ద క్రెడిట్, డెబిట్ కార్డులు లేకుంటే పోలీసులు చలానా రసీదు రాసి ఇస్తారు. వారం వ్యవధిలో చలానాను పైన పేర్కొన్న ఏ ఒకదానిలోనైనా చెల్లించాల్సి ఉంటుంది. లేకపోతే వాహనాన్ని సీజ్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలిస్తారు. చలానా డబ్బులు పారదర్శకంగా ఉండేలా ఈ కొత్త విధానాన్ని దేశంలోనే మొదటి సారిగా హైదరాబాద్‌లో మొదలుపెట్టారు. గతంలో వాహనదారులు చలానా మొత్తాన్ని నగదు రూపంలోనే ట్రాఫిక్ సిబ్బందికి చెల్లించేవారు. ఇలా వసూలైన డబ్బులను ఆయా ట్రాఫిక్ పోలీసుస్టేషన్ ఇన్‌స్పెక్టర్లు మరుసటి రోజు ఐసీఐసీఐ బ్యాంకులోని ప్రభుత్వ ఖాతాలో జమ చేసేవారు.



కొత్త విధానంతో ఇవీ లాభాలు...

* ట్రాఫిక్ సిబ్బంది అవినీతికి పాల్పడేఅవకాశం ఉండదు.

* డబ్బులు వసూలు చేయడం, బ్యాంకులో జమ చేసే పనిభారం సిబ్బందికి తప్పుతుంది.

* చలానా డబ్బు మొత్తంలో తేడా వస్తే అధికారే బాధ్యత వహించాల్సి వచ్చేది.

* ఈ కొత్త విధానంతో డబ్బు లెక్కల్లో తేడాలు రావు

* వాహనదారుడి వద్ద డబ్బు లేకున్నా చలానా రసీదు తీసుకుని వెళ్లిపోవచ్చు

* చలానా ఎంత రాసినా డబ్బు నేరుగా ప్రభుత్వ ఖాతాలోకే వెళుతుంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top