పరిపూర్ణ విశ్వనగరంగా హైదరాబాద్

హైదరాబాద్ లో  ‘డ్రైవర్ కమ్ ఓనర్’ కొత్త కార్లను  ప్రారంభిస్తున్న సీఎం కేసీఆర్ - Sakshi


 అందరూ అబ్బురపడేలా మార్చేస్తామన్న సీఎం కేసీఆర్

 రాజధానిని తీర్చిదిద్దే బాధ్యత నాదే, త్వరలోనే ప్రణాళికలు వెల్లడిస్తా

 మౌలిక వసతుల్లో మహానగరం బాగా వెనుకబడి ఉందని ఆవేదన

 ప్రపంచ ఐటీ సదస్సుకు నగరం ఎంపికవడం గర్వకారణమని వ్యాఖ్య

 ‘డ్రైవర్ కమ్ ఓనర్’ పథకం కింద 303 మందికి కార్ల పంపిణీ


 

 సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరాన్ని చూసి అందరూ అబ్బురపడేలా, ఎవరూ ఊహించని విధంగా నగరాన్ని నూరు శాతం నిక్కమైన విశ్వనగరం (ట్రూత్‌ఫుల్ గ్లోబల్ సిటీ)గా మార్చేందుకు ప్రణాళిక లు సిద్ధం చేస్తున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తెలిపారు. త్వరలోనే వాటిని వెల్లడిస్తామని చె ప్పారు. రాజధానిని అద్భుతంగా తీర్చిదిద్దే బాధ్యతను తానే తీసుకున్నానని, అందుకే మున్సిపల్ పరిపాలన శాఖను తన వద్దే పెట్టుకున్నానని సీఎం పేర్కొన్నారు. ఇక్కడి నెక్లెస్‌రోడ్ పీపుల్స్‌ప్లాజాలో శుక్రవారం జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో  ‘డ్రైవర్ కమ్ ఓనర్’ పథకం ద్వారా 303 మంది లబ్ధిదారులకు కార్లను అందజేసే కార్యక్రమంలో కేసీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నా రు. ఈ సందర్భంగా మాట్లాడుతూ  హైదరాబాద్‌లో తగిన మౌలికవసతులు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. రహదారులు, జంక్షన్లు సరిగా లేవని, మహానగరానికి ఉండాల్సిన స్థాయిలో లేవని వాపోయారు. వర్షం వస్తే నీరు వెళ్లే మార్గం లేదని, భూ మాఫియాదార్లు, గూండాలు, పైరవీ కారులు, దళారులందరూ కలిసి నాలాలు, చెరువులు కబ్జాచేసి అడ్డగోలు పనులు చేశారని, పనికిమాలిన నగరంగా మార్చారని వ్యాఖ్యానించారు. మహానగరం ఇలాగే ఉంటే బతకలేమన్నారు. ఈ పరిస్థితిని చక్కదిద్దాల్సి ఉందన్నారు. అందుకే నగరాన్ని పరిపూర్ణ విశ్వనగరంగా తీర్చిదిద్దే బాధ్యతను తానే తీసుకున్నానని చెప్పారు. ‘డ్రైవర్ కమ్ ఓనర్’ పథకం ద్వారా మరో 600 కార్లు అవసరమని జీహెచ్‌ఎంసీ కమిషనర్ కోరారని, ఆరువేలు ఇచ్చినా ఇంకా అవసరమయ్యేలా నగరం అభివృద్ధి చెందుతుందని సీఎం వ్యాఖ్యానించారు.  

 

 స్కిల్ డెవలప్‌మెంట్ వర్సిటీకి స్థలం

 

 రాష్ర్టంలోని నిరుద్యోగులకు వివిధ రంగాల్లో ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పించే స్కిల్ డెవలప్‌మెంట్ యూనివర్సిటీకి తగినంత స్థలం కేటాయిస్తామని సీఎం హామీ ఇచ్చారు. అంతకుముందు కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ.. రాష్ర్ట ప్రభుత్వం స్థలమిస్తే వర్సిటీ ఏర్పాటుకు కేంద్ర సాయం అందేలా చూస్తానని చెప్పారు. అవసరమైన నిధులను అందిస్తామన్నారు. నైపుణ్యాలను పెంచుకుంటే యువతలో ఉపాధికి ఢోకా ఉండదని వ్యాఖ్యానించారు. దీంతో కేసీఆర్ స్పందిస్తూ.. స్థల కేటాయింపునకు సిద్ధమని ప్రకటించారు. హైదరాబాద్ అభివృద్ధి కోసం పాటుపడుతున్నారంటూ దత్తాత్రేయకు ధన్యవాదాలు తెలిపారు. కాగా, ప్రపంచ ఐటీ సదస్సు నిర్వహించే అవకాశం హైదరాబాద్‌కు దక్కడం అందరికీ గర్వకారణమని ముఖ్యమంత్రి అన్నారు. 2018లో జరిగే ఈ సదస్సుకు నగరం ఎంపిక కావడానికి నాలుగైదు నెలలుగా ఎంతో శ్రద్ధతో పనిచేశామని తెలిపారు. ప్రపంచాన్ని ఉర్రూతలూగిస్తున్న ఐటీ రంగానికి సంబంధించిన సదస్సే నగరంలో జరగబోతున్నందున రాబోయే రోజుల్లో ఇంకా చాలా మార్పులొస్తాయన్నారు. నగరంలోని ఖాళీ స్థలాలను శాస్త్రీయ పద్ధతుల్లో సరిగా వినియోగించుకుంటే హైదరాబాద్ ఇంకా ఎంతో అభివృద్ధి చెందుతుందన్నారు. డ్రైవర్ కమ్ ఓనర్ పథకం ద్వారా కార్లు పొందిన వారితోసహా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కేంద్ర మంత్రి దత్తాత్రేయ మాట్లాడుతూ.. ఈ పథకంతో లబ్ధిపొందిన వారు మరో పది మందికి ఉద్యోగాలిచ్చేలా ఎదగాలని అభిలషించారు. ఇప్పుడు ఒక కారు ఉన్న వారు వచ్చే ఏడాదిలోగా రెండు కార్ల యజమానులు కావాలని, అలాగే రెండు కార్లున్నవారు నాలుగుకార్లు.. నాలుగుకార్లున్న వారు పదహారు కార్లకు యజమానులవ్వాలని అన్నారు. దీంతో అన్ని కార్లకు సరిపడా రోడ్లను ఢిల్లీ నుంచి తెస్తారా అని వేదికపై వెనుక వరుసలో ఉన్న మంత్రులు చమత్కరించారు. లబ్ధిదారుల కొత్తకార్లకు సీఎం లాంఛనంగా జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రులు మహమూద్‌అలీ, రాజయ్యతో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top