డ్రంకన్ డ్రైవ్‌లో సంచలన తీర్పు

డ్రంకన్ డ్రైవ్‌లో సంచలన తీర్పు - Sakshi


* తాగిన మోతాదును బట్టి శిక్ష

* ఒకరికి రెండు నెలలు.. మరో ఇద్దరికి నెల రోజులు జైలు

* ఇంత ఎక్కువకాలం శిక్ష పడటం ఇదే తొలిసారి



సాక్షి, హైదరాబాద్: మందుబాబుల దిమ్మ తిరిగేలా ఉన్నాయి డ్రంకన్ డ్రైవ్ జైలు శిక్షలు. ఎంత ఎక్కువ మోతాదులో తాగితే అంత ఎక్కువ కాలం జైలుశిక్ష విధించడం సంచలనం సృష్టిస్తోంది. తాజాగా డ్రంకెన్‌డ్రైవ్‌లో పట్టుబడిన ఒకరికి రెండు నెలలు, మరో ఇద్దరికి నెల రోజుల పాటు జైలు శిక్ష విధించారు. మరో ఆటో డ్రైవర్‌కు 15 రోజులు, మరో నలుగురికి పది రోజులు, ఆరుగురికి మూడు రోజుల చొప్పున జైలు శిక్ష, మరో 36 మందికి ఉదయం నుంచి సాయంత్రం వరకు కోర్టు ఆవరణలో ఉండేలా శిక్ష విధిస్తూ మూడవ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ జి.రాధిక, నాలుగవ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఎం.శివశంకర్‌ప్రసాద్ గురువారం తీర్పు చెప్పారు.



2011 నవంబర్ నుంచి మొదలైన డ్రంకెన్ డ్రైవ్ కేసుల్లో ఇప్పటి వరకు అత్యధికంగా 14 రోజులు మాత్రమే జైలు శిక్ష పడింది. ఇలా రెండు నెలల జైలు శిక్ష వేయడం డ్రంకెన్ డ్రైవ్ చరిత్రలోనే మొదటిసారి కావడం గమనార్హం. హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు ప్రారంభమైన 2011 నవంబర్ నుంచి నేటి వరకు 39,995  కేసులు నమోదు కాగా 3,751 మందికి జైలు శిక్ష పడింది.



రెండు నెలలు జైలు శిక్ష..

హైదరాబాద్‌కు చెందిన ఓ లారీ డ్రైవర్(43) రెడీమిక్స్ భారీ వాహనంపై పనిచేస్తున్నాడు. రెండు రోజుల క్రితం ఇతను మద్యం తాగి బైక్‌పై వస్తుండగా నాంపల్లి ట్రాఫిక్ పోలీసులకు పట్టుబడ్డాడు. డ్రంకెన్‌డ్రైవ్ తనిఖీల్లో బ్రీత్‌ఎనలైజర్‌తో పరీక్షించగా 445 ఎంజీ మద్యం సేవించినట్లు తేలింది. అత్యంత ప్రమాదకర స్థాయిలో మద్యం సేవించినట్లు భావించిన మెజిస్ట్రేట్ ఇతనికి రెండు నెలల జైలు శిక్ష విధించారు.



ఇక నల్లకుంటకు చెందిన జిమ్‌కోచ్ (37) బైక్‌పై వస్తుండగా గత సోమవారం నల్లకుంట పోలీసులకు పట్టుబడ్డాడు. ఇతన్ని పరీక్షించగా 256 ఎంజీ మద్యం తాగినట్లు తేలింది. అలాగే మలక్‌పేటకు చెందిన ఓ ఆటో డ్రైవర్ (34) గత బుధవారం మలక్‌పేట ట్రాఫిక్ పోలీసులకు చిక్కాడు. ఇతను 237 ఎంజీ మద్యం సేవించినట్లు తేలింది. వీరిద్దరికి నెల రోజుల పాటు జైలు శిక్ష పడింది. ఈ ముగ్గురు అత్యంత ప్రమాదకర స్థాయిలో మద్యం తాగడం, వీరి కారణంగా అమాయకులు కూడా రోడ్డు ప్రమాదానికి గురయ్యే అవకాశాలు ఉన్నందున ఈ తీర్పు ఇచ్చినట్లు మెజిస్టేట్ పేర్కొన్నారు.



ప్రమాదాల నివారణే ధ్యేయం: పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి

రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు అదనపు పోలీసు కమిషనర్ జితేందర్ నేతృత్వంలో డ్రంకెన్‌డ్రైవ్ తనిఖీలు చేస్తున్నారు. తనిఖీల కారణంగా ఈ సంవత్సరం ప్రమాదాలు తగ్గడంతో పాటు గణనీయంగా మృతుల సంఖ్య కూడా తగ్గింది. తనిఖీలు నిర్విరామంగా చేస్తూనే ఉన్నాము. శిక్షలు కఠినతరం చేయడం వల్ల ప్రమాదాలు తగ్గుతాయని భావిస్తున్నాము.



రహదారులు రక్తసిక్తం కాకుండా..

రోడ్డు ప్రమాదాల నివారణ, మరణాల సంఖ్యను తగ్గించేందుకు 175 మంది ట్రాఫిక్ ఏఎసై్సలకు యాంటీ డ్రంకెన్ ఉపకరణాలు (బ్రీత్‌ఎనలైజర్లు) ఇచ్చారు. రాత్రి 10 గంటల నుంచి కమిషనరేట్ పరిధిలో పది బృందాలు పనిచేస్తున్నాయి. శుక్ర, శనివారాల్లో తనిఖీల కోసం పోలీసు స్టేషన్‌కు ఒక టీమ్ చొప్పున 25 బృందాలు ఉన్నాయి. ట్రాఫిక్ పోలీసులు ఈ డ్రైవ్‌ను మోటారు వెహికల్ యాక్ట్‌లోని సెక్షన్ల ప్రకారం చేస్తారు.



మద్యం తాగి పట్టుబడిన వారిని కోర్టుకు తీసుకెళ్లాలంటే సెక్షన్ల 185 ప్రకారం బుక్‌చేసి, ఆధారాలతో వెల్లడం అవసరం. చట్ట ప్రకారం ప్రతి 100 మిల్లీలీటర్ల రక్తంలో 30 మిల్లీగ్రాములు అంతకంటే ఎక్కువ ఉంటేనే చర్యలు తీసుకునే అవకాశం ఉంది. బ్రీత్‌ఎనలైజర్లు ఆల్కహాల్ క్వాంటిటీని ప్రింటవుట్ రూపంలో ఇస్తాయి. వాహనదారుడు అత్యంత ప్రమాదకరస్థాయిలో మద్యం సేవించాడని న్యాయమూర్తి భావిస్తే నెల నుంచి రెండు నెలల వరకు జైలు శిక్ష పడొచ్చు. రెండోసారి చిక్కితే రెండేళ్ల వరకు కూడా జైలు శిక్ష విధించే అవకాశం ఉంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top