భర్తల భరతం పట్టిన భార్యలు

భర్తల భరతం పట్టిన భార్యలు


ఖమ్మం: భర్తల భరతం పట్టే డూండ్ వేడుక షూరు అయింది. పచ్చి బరిగలతో మహిళలు ఇరగదీస్తుంటే మీసం మెలేసే పురుషులు సైతం పరుగులు తీశారు. దీరులమని వీర్రవీగిన వారికి పచ్చి బరిగెల దెబ్బలతకు వాతలు తేలాయి. భర్తలను భార్యలు కొట్టడమేమిటనుకుంటున్నారా..? అయితే మీరు గిరిజన సంప్రదాయ క్రీడ డూండ్ గురించి తెలుసుకోవాల్సిందే మరి.. గిరిజన సంప్రదాయ వేడుకల్లో ఒకడైన డూండ్ క్రీడ గురువారం సాయంత్రం కారేపల్లి మండలం సామ్యతండాల్లో ఉత్సాహంగా నిర్వహించారు.హోలీ వేడుకల్లో భాగంగా అనాధిగా వీరు ఈ క్రీడను జరుపుకుంటున్నారు. భార్యలు భర్తల్ని కర్రలతో చితకబాదే ఈ క్రీడ ఆద్యంతం ఆసక్తిదాయకంగా సాగుతుంది.

 

అసలు డూండ్  అంటే...

డూండ్ అంటే వెతకడం అని అర్థం. గత ఏడాది హోలీ నుంచి ఈ హోలీ రోజుకు మధ్య కాలంలో తండాలో ఎవరి కుటుంబంలో మగ పిల్లాడు జన్మిస్తాడో అతనిని సంప్రదాయ బద్ధంగా ఈ హోలీ రోజు తెల్లవారుజామున నాలుగు గంటలకు గేరినీ(మహిళలు)లు తండాలో ఒక చోట దాచి పెడతారు. ఇక తండాలోని గేర్యాలు(పురుషులు) కర్రలు చేతబట్టి ఆ పిల్లవాడిని ఎక్కడ దాచారో డూండ్(వెతకడం) చేస్తారు. పిల్లవాడు దొరికాకా గేర్యా, గేరినీలు కామదహనం చేసి రంగులు పూసుకుంటారు. అనంతరం సాయంత్రం కుమారుడి ఇంటి వద్ద ఒక స్థూపం (గుంజ) చుట్టు తినుబండరాలను గంగాళాల్లో( బకెట్లు) ఉంచి తాళ్లతో వాటిని ఒకదానికొకటి బిగించి వాటి చుట్టు గేరినీలు పచ్చి బరిగలు చేతబూని  కాపలా ఉంటారు.



ఇక వాటిని తీసుకుని వెళ్లడానికి గేర్యాలు ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో గేరినీలు వారిని కర్రలతో కొడుతూ పాటలు పాడుతూ ఆ స్థూపం చుట్టూ తిరుగుతుంటారు. దీంతో ఆ ప్రాంతమంతా ఒకరకమైన సందడి నెలకొంటుంది. ఎవరైతే గేరినీలను చేధించుకుని ఆ గంగాళాలను ఎత్తుకొస్తారో వారిని ఆ తండాలో ధీరుడిగా గుర్తిస్తారు. అనంతరం ఆ తినుబండరాలను  గేర్యా, గేరినీలు రెండు వాటాలుగా వేసుకొని కామదహనం చేసిన ప్రాంతానికి వెళ్లి దాన్ని చల్లార్చి ఆ పక్కనే ఉన్న బీళ్లలో ఆరగిస్తారు.


దీంతో డూండ్ వేడుక ముగస్తుంది. గురువారం జరిగిన డూండ్ వేడుకకు తండాలోని భూక్యా సునీల్, వసంత దంపతుల కుమారుడు కీలకమయ్యూడు. అతను గత హోలీ తర్వాత జన్మించడంతో తండాలోని గేరినీలు అతనిని దాచిపెట్టి వేడుక నిర్వహించారు. అలాగే సాయంత్రం జరిగిన డూండ్ వేడుకకు సునీల్ ఇల్లు వేదికైంది. ఈ కార్యక్రమాన్ని  కులపెద్దలు వాంకుడోతు సామ్య నాయక్, భూక్య సక్రియ. ఈర్యానాయక్‌లు పర్యవేక్షించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top