కట్టుకున్నోడే కాలయముడు


► మద్యం మత్తులో భార్య గొంతు నులిమి కడతేర్చిన వైనం

► అదనపు కట్నం కోసమే ఘాతుకం

► పోలీసుల అదుపులో నిందితుడు

► మాల్‌ వెంకటేశ్వరనగర్‌లో దారుణం

 

చింతపల్లి: కట్టుకున్నవాడే కాలయముడయ్యాడు.. జీవి తాంతం తోడూ నీడగా ఉండాల్సింది పోయి..అదనపు కట్నం కోసం గొంతునులిమి దారుణంగా హతమార్చాడు. ఆపై ఉరివేసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించాడు. ఈదారుణ ఘటన చింతపల్లి మండలం మాల్‌ వెంకటేశ్వరనగర్‌లో చోటు చేసుకుంది.  పోలీసులు, మృతురాలి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. మాల్‌ వెంకటేశ్వరనగర్‌ గ్రామానికి చెందిన కడారి పర్వతాలు, శ్యామలమ్మల ఒక్కగానొక్క కుమార్తె స్వాతి(20)ని దేవరకొండ పట్టణానికి చెందిన పొగాకు మధుకు ఇచ్చి 16 నెలల క్రితం వివాహం చేశారు. మధు హైదరాబాద్‌లోని మిథాని డిపోలో ఆర్టీసీ డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. మాల్‌లోనే మధు, స్వాతి దంపతులు సొంతిళ్లును కట్టుకుని జీవనం సాగిస్తున్నారు. వివాహం జరిగిన రెండు నెలల పాటు సజావుగా సాగిన దాంపత్య జీవితంలో మధు ప్రవర్తనతో తగాదాలు మొదలయ్యాయి. తరచూ మద్యం సేవించి భార్యను చిత్రహింసలకు గురి చేసేవాడు. 

 

మద్యం సేవించి..

ఈ క్రమంలోనే మంగళవారం రాత్రి మద్యం సేవించి ఇంటికి వచ్చిన మధు భార్యను చితకబాదాడు. ఆపై స్వాతి గొంతు నులుమి హత్యచేశాడు. అనంతరం ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ఇంట్లోని ఫ్యాన్‌కు స్వాతిని ఉరి వేశాడు. ఆపై వారి ఇంట్లో అద్దెకు ఉండే వారికి స్వాతి గదిలోకి వెళ్లి తలుపులు పెట్టుకుందని చెప్పాడు. వారు వెళ్లి చూసే సరికి అప్పటికే స్వాతి మృతి చెంది ఉంది. ఇదిలా ఉండగా ఐదు నెలల క్రితం స్వాతి గర్భవతిగా ఉన్న సమయంలో కూడా చిత్రహింసలకు గురి చేయడంతో అబార్షన్‌ అయ్యిందని, తరచూ స్వాతిని మద్యం సేవించి చిత్రహింసలకు గురి చేసే వాడని మృతురాలి తల్లిదండ్రులు వాపోయారు. 

 

ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు యత్నం 

స్వాతిని గొంతు నులుమి హతమార్చిన అనంతరం ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు మధు తీవ్ర ప్రయత్నాలు చేశాడు. ఇంట్లోని ఫ్యాన్‌కు  స్వాతిని వేలాడతీసి ఉరిగా నమ్మించేందుకు ఇంటి ముందు తలుపును మూసివేశాడు. వెనుక తలుపుల నుంచి తాను ఇంటి బయటకు వచ్చి ఇరుగుపొరుగు వారికి నా భార్య ఇంట్లోకి వెళ్లి తలుపులు పెట్టుకుందని సమాచారం అందించి పరారయ్యేందుకు ప్రయత్నించాడు. అప్పటికే మృతిచెందిన స్వాతి మృతదేహాన్ని చూసే సరికి మధు సంఘటన స్థలంలో ఉండకపోవడంతో పాటు ఇంటి వెనుక నుంచి పరారవుతుండగా గ్రామస్తులు పట్టుకుని పోలీసులకు అప్పజెప్పారు. 

 

వివాహేతర సంబంధమే కారణమా ..?

మండల పరిధిలోని మాల్‌ వెంకటేశ్వరనగర్‌లో మంగళవారం రాత్రి జరిగిన హత్య ఘటనకు వివాహేతర సంబంధమే కారణమా అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.  గ్రామానికి చెందిన ఓ మహిళతో మధు సఖ్యతగా ఉంటూ తన ఇంట్లోనే ఓ గదిలో అద్దెకు ఉంచినట్లు పలువురు పేర్కొంటున్నారు. ఇది లా ఉండగా అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళ హత్యకు సహకరించిందనే కారణంతో బుధవారం గ్రామస్తులు, మృతురాలి బంధువులు మహిళను చితకబాదారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సదరు మహిళను అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు మృతురాలి బంధువులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. మృతురాలి కుటుంబానికి న్యాయం చేసేంత వరకు మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించేది లేదని భీష్మించారు. చివరకు సాయంత్రం 4 గంటల సమయంలో మృతదేహాన్ని  దేవరకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. 

 

గ్రామంలో ఉద్రిక్తత 

భార్యను భర్త హతమార్చడంతో గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వేల సంఖ్యలో తరలివచ్చారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా నాంపల్లి, కొండమల్లేపల్లి సీఐలు బాల గంగిరెడ్డి, శివరాంరెడ్డిలు బందోబస్తు చేపట్టారు. సంఘటన స్థలాన్ని దేవరకొండ డీఎస్పీ రవికుమార్‌ పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.  తహసీల్దార్‌ దేవదాసు పంచనామా నిర్వహించారు. చింతపల్లి ఎస్‌ఐ నాగభూషణ్‌రావు, మల్లేపల్లి ఎస్‌ఐ శంకర్‌రెడ్డి, నాంపల్లి ఎస్‌ఐ ప్రకాశ్‌రెడ్డి, మర్రిగూడ ఎస్‌ఐ రాజు బందోబస్తు నిర్వహిస్తున్నారు.  
Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top