కాపాడాల్సినవాడే కడతేర్చాడు

కాపాడాల్సినవాడే కడతేర్చాడు


జలచర జీవుల్లో ఓ మగ చేప ఆడ చేప పెట్టిన గుడ్లను నోటిలో భద్ర పరచుకుంటుంది. పిల్లలు అయ్యే దాకా ఆహారం కూడా తీసుకోదు. ఒక్కోసారి ఆకలి తట్టుకోలేక మృత్యువాత కూడా పడుతుంది. తన సంతాన్ని కాపాడుకోవడానికి ఆ మగ చేప అంతటి త్యాగానికి సిద్ధమవుతుంది. కానీ కొందరు మనుషులు సభ్య సమాజం తలదించుకునేలా తమ సంతానాన్నే చేజేతులా బలి తీసుకుంటున్నారు. ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం రవీందర్. కట్టుకున్న భార్య, రెండేళ్ల కూతుర్ని కర్కశంగా హతమార్చాడు.

 

- అదృశ్యమైన తల్లి, కూతురు హత్య

- బావతో కలిసి హత్యలకు పాల్పడిన భర్త

- వివరాలు వెల్లడించిన డీఎస్పీ తిరుపతన్న

రాయికోడ్:
మండలంలోని నాగన్‌పల్లి గ్రా మానికి చెందిన స్వప్న (23) ఆమె కూ తురు ఐశ్వర్య (2) అదృశ్యమైన కేసును పోలీసులు ఛేదించారు. అదృశ్యమైన తల్లి, కూతురు హత్యకు గురయ్యారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఆదివారం సంగారెడ్డి డీఎస్పీ తిరుపతన్న రాయికోడ్ విలేకరులకు తెలిపారు.

 

రాయికోడ్ మండలం నాగన్‌పల్లి గ్రామానికి చెందిన బీ రవీందర్ హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఓ కళాశాలలో ఇంటర్ చదువుతున్న సమయంలో తన క్లాస్‌మేట్ అయిన వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన స్వప్నను ప్రేమించి 2011లో పెళ్లి చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న రవీందర్ తల్లిదండ్రులు కొడుకు, కోడలును తమ ఇంట్లో ఉంచుకోవడానికి నిరాకరించారు. దీంతో గ్రామపెద్దలు సహకారంతో నాగన్‌పల్లిలో రవీందర్ నివాసం ఏర్పాటు చేసుకున్నాడు. కొంత కాలం తరువాత రవీందర్, అతని తల్లి లక్ష్మమ్మ, తండ్రి నాగయ్య కట్నం కోసం స్వప్నను వేధించడం మొదలు పెట్టారు. దీంతో ఆమె 2013లో రాయికోడ్ పోలీసులకు ఫిర్యాదు చేసి పుట్టింటికి వెళ్లిపోంది. అప్పటికే గర్భిణి అయిన ఆమె ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం కూతురు ఐశ్వర్య వయస్సు రెండు సంవత్సరాలు.



జహీరాబాద్ కోర్టులో అదనపు కట్నం వేధింపుల కేసుకు సంబంధించి వాదనలు కొనసాగుతుండగా రవీందర్ లోక్ అదాలత్‌లో కేసును రాజీ చేసుకున్నాడు. స్వప్న కాపురానికి అంగీకరించి రవీందర్‌తో నాగన్‌పల్లికి వెళ్లింది. రాజీ అనంతరం లోక్ అదాలత్‌పేషిలకు స్వప్న హాజరు కాకపోవడంతో ఆమె తల్లి సాంబ లక్ష్మి కూతురు ఏదీ అని స్పప్న తల్లిదండ్రులు అల్లుడి రవీందర్‌ను ప్రశ్నించారు. తనకు తెలియదని చెప్పడంతో ఈ నెల 20న రవీందర్‌పై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు.

 

రవీందర్‌ను అరెస్ట్ చేసి విచారించగా తల్లి, కూతురు హత్యకు గురైనట్లు తేలింది. జోగిపేట మండలం నేరేడుకుంటకు చెందిన తన బావ కిష్టయ్యతో కలిసి మే 15న నాగన్‌పల్లి నుంచి స్వప్న నేరేడుకుంట సమీపంలోని ఓ వ్యవసాయ బావి వద్దకు తీసుకువెళ్లి చున్నీని మెడకు బిగించి హత్య చేశాడు. శవాన్ని అక్కడే తగులబెట్టి ఎముకలను మంజీర నదిలో కలిపేశారు. మే 18న అభం శుభం తెలియని చిన్నారి ఐశ్వర్య(2)ను నేరేడుకుంట గ్రామశివారులోని నిర్మానుష్య ప్రాంతంలో గొంతు నులిమి హత్య చేశారు. శవాన్ని అక్కడే తగులబెట్టినట్లు బావ, మరిది రవీందర్, కిష్టయ్య తమ విచారణలో ఒప్పుకున్నారని డీఎస్పీ తెలిపారు. నిందితులపై హత్య కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపినట్లు వివరించారు. కార్యక్రమంలో జహీరాబాద్ రూరల్ సీఐ రఘు, స్థానిక ఎస్‌ఐ శివప్రసాద్, సిబ్బంది అంజిరెడ్డి, శ్రీనివాస్, సికిందర్ ఉన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top