నూరేళ్ల ‘పోచారం’

నూరేళ్ల  ‘పోచారం’


నిజాంల కాలంలో నిర్మాణం.. ఇప్పటికీ చెక్కుచెదరని కట్టడం

నిర్మాణ వ్యయం రూ. 27.11 లక్షలు

నిర్మాణ సమయం  1917 – 1922

నీటి నిల్వ సామర్థ్యం : 21 మీటర్లతో 1.52 టీఎంసీలు

ఆయకట్టు 10,500 ఎకరాలు



ప్రకృతి అందాల మధ్య ఉన్న పోచారం ప్రాజెక్టు పర్యాటకులను ఆకర్షిస్తోంది. ఇక్కడ పోచారం అభయారణ్యం కూడా ఉండడంతో సెలవు రోజుల్లో పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటోంది. అభయారణ్యంలో వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం ఉంది.



కామారెడ్డి నుంచి ఎస్‌.వేణుగోపాలచారి: ప్రకృతి రమణీయతకు మారుపేరు పోచారం ప్రాజెక్టు పరిసరాలు. ఎప్పుడూ పర్యాటకు లతో అలరారే ఈ ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం ఏడాదికేడాది తగ్గుతూ వస్తోంది. కామా రెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం పోచారం శివారులో గల మంచిప్ప వాగుపై ఈ ప్రాజెక్టును నిర్మించారు. 1917లో ప్రారంభమైన ప్రాజెక్టు నిర్మాణం 1922లో పూర్త యింది. 21 అడుగుల ఎత్తుతో 1.7 కిలోమీటర్ల పొడవుతో ప్రాజెక్టు ఆనకట్టను నిర్మిం చారు. నిర్మాణంలో రాళ్లు, డంగుసున్నం మాత్రమే ముడిసరుకుగా వినియోగించారు. ప్రాజెక్టు దిగువన ఉన్న భూములకు సాగునీటిని అందించేలా అప్పట్లోనే 58 కిలోమీటర్ల పొడవుతో కాలువ తవ్వించారు. దీనికి 73 డిస్ట్రిబ్యూటరీలను సైతం నిర్మించారు. అప్పటి హైదరాబాద్‌ స్టేట్‌లో తొలి మానవ నిర్మిత ప్రాజెక్టుగా ఇది పేరుగాంచింది. నిర్మించి వందేళ్లయినా చెక్కు చెదరకపోవడం గమనార్హం.



నీటి నిల్వ సామర్థ్యం..

మొదట 3.4 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో ఈ ప్రాజెక్టును నిర్మించాలని భావించినప్పటికీ.. ప్రతికూల పరిస్థితుల కారణంగా 2.423 టీఎంసీలకు పరిమితం చేశారు. యేటా పూడిక పేరుకుపోవ డంతో నీటి నిల్వ సామర్థ్యం 1.52 టీఎంసీలకు పడిపోతోంది.



ఏ, బీ జోన్‌లుగా ఆయకట్టు..

నాగిరెడ్డిపేట, ఎల్లారెడ్డి మండలాల వరప్రదాయినిగా పోచారం ప్రాజెక్టు పేరొందింది. ప్రాజెక్టు నీటిని నాగిరెడ్డిపేట, ఎల్లారెడ్డి మండలాల పరిధిలో గల వ్యవసాయ భూములకు అందిస్తారు. ప్రాజెక్టు పరిధిలోని ఆయకట్టును రెండు జోన్లుగా విభజించారు. ప్రధానకాలువ డిస్ట్రిబ్యూటరీ 01 నుంచి 48 వరకు ‘ఏ’జోన్‌గానూ, 49 నుంచి 73వ డిస్ట్రిబ్యూటరీ వరకు ‘బీ’జోన్‌గానూ విభజించారు. యేటా ఖరీఫ్‌ సీజన్‌లో రెండు జోన్లకు, రబీ సీజన్‌లో ఒక ఏడాది ‘ఏ’ జోన్‌కు, మరో ఏడాది ‘బీ’జోన్‌కు మాత్రమే నీటిని అందిస్తారు.



వైఎస్సార్‌ ఇచ్చిన నిధులతో..

వైఎస్సార్‌ 2001లో నిర్వహించిన పాదయాత్రలో భాగంగా నాగిరెడ్డిపేట, ఎల్లారెడ్డి మండలాల్లో పర్యటించారు. పోచారం ప్రాజెక్టు పరిస్థితిని తెలుసుకుని చలించిపోయారు. అధికారంలోకి వస్తే పోచారం ప్రధానకాలువ ఆధునికీకరణకు నిధులిస్తామని హామీ ఇచ్చారు. అధికారం లోకి రాగానే మాట నిలబెట్టుకున్నారు. రూ.14.30 కోట్లు మంజూరు చేశారు.



2006 ఏప్రిల్‌ 7న వైఎస్సార్‌ సీఎం హోదాలో నాగిరెడ్డిపేటకు వచ్చి పోచారం ప్రధానకాలువ ఆధునికీకరణ పనులకు శంకుస్థాపన చేశారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top