పచ్చని చెట్లపై ‘హైవే’ వేటు

పచ్చని చెట్లపై ‘హైవే’ వేటు - Sakshi


నేలకొరుగుతున్న భారీ వృక్షాలు



హైదరాబాద్‌–వరంగల్‌ జాతీయ రహదారి విస్తరణతో వృక్ష సంపద కనుమరుగు

‘ట్రాన్స్‌ ప్లాంటేషన్‌’పై దృష్టిసారించని అధికారులు




సాక్షి, జనగామ: హరితహారం పేరిట ప్రభుత్వం ఓ వైపు మొక్కలు నాటి హరితాన్ని పెంచేందుకు ప్రయత్నాలు చేస్తుండగా.. జాతీయ రహదారి విస్తరణ కోసం మరోవైపు భారీ వృక్షాలను నేలకూలుస్తున్నారు. దీంతో ఒకప్పుడు పచ్చని చెట్లతో కనిపించే రోడ్డు ఇప్పుడు చెట్లు లేక బోసిపోతోంది. హైదరాబాద్‌–వరంగల్‌ జాతీయ రహదారిని యాదా ద్రి భువనగిరి జిల్లా రాయగిరి నుంచి వరంగల్‌ వరకు నాలుగు లేన్లుగా విస్తరిస్తున్నారు. రూ.1,905 కోట్ల వ్యయంతో 99 కిలో మీటర్ల మేర 163వ రహదారిని విస్తరిస్తున్నారు. ఈ నిర్మాణ పనులను ఎల్‌అండ్‌టీ కంపెనీ నిర్వహిస్తోంది. 30 నెలల్లో పనులను పూర్తి చేయనున్నారు.



అయితే రోడ్డు విస్తరణ కారణంగా ఇరువైపులా వేప, తుమ్మ, మర్రి, చింత, సుబాబుల్, జామాయిల్‌ వంటి 5 వేల చెట్లు ఉన్నాయి. దశాబ్దాల వయస్సు ఉన్న చెట్లు ఈ విస్తరణ పనుల కారణంగా తొలగిస్తున్నారు. ట్రాక్టర్లకు కటింగ్‌ మెషిన్లను అమర్చి కేవలం ఐదు నిమిషాల్లోనే చెట్టును నరికివేస్తున్నారు. చెట్టు మొదలు, కొమ్మలను తొలగించి అప్పటికే తెచ్చుకున్న లారీల్లోకి ఎక్కించి హైదరాబాద్‌లోని సామిల్లులకు తరలిస్తున్నారు. ఒక చెట్టు పెరగడానికి సంవత్సరాల సమయం పడుతుండగా తొలగించడం మాత్రం నిమిషాల్లో పూర్తి చేస్తున్నారు. కాం ట్రాక్టు సంస్థకు చెట్ల పేరుమీద రూ.5 కోట్ల ఆదాయం సమకూరినట్లుగా సమాచారం.



ఊసేలేని ‘ట్రాన్స్‌ ప్లాంటేషన్‌’

రోజు రోజుకు అంతరించిపోతున్న అడవులను కాపాడాలని, అడవుల శాతాన్ని పెంచడం కోసం 1994లో ‘ట్రాన్స్‌ ప్లాంటేషన్‌’చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చింది. తప్పని సరి పద్ధతిలో చెట్లను తొలగించవలసి వస్తే ట్రాన్స్‌ ప్లాంటేషన్‌ చేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ మాత్రం అలాంటి ప్రయోగాలు ఏమాత్రం చేయకుండానే చెట్లను తొలగించడం పట్ల పర్యావరణ ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top