హోరు వాన..!

హోరు వాన..! - Sakshi

- విస్తారంగా వర్షాలతో తడిసి ముద్దయిన రాష్ట్రం 

రెంజల్, నల్లబెల్లిల్లో 19 సెం.మీ అత్యధిక వర్షం

చాలా చోట్ల 15 సెంటీమీటర్లకుపైగా కుండపోత 

నిండిపోయి అలుగుపారుతున్న చెరువులు

పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు 

గోదావరి, మంజీరా, మానేరులకు జలకళ

నిండుకుండను తలపిస్తున్న కడెం ప్రాజెక్టు 

శ్రీరాంసాగర్‌లోకి పెరిగిన నీటి చేరిక

 

సాక్షి, నెట్‌వర్క్‌/హైదరాబాద్‌: విడవకుండా కురిసిన వర్షాలతో ఆదివారం రాష్ట్రం తడిసిముద్దయింది.. చాలా చోట్ల కుండపోత వానతో చెరువులు, కుంటలు నిండిపోయాయి.. మరింతగా వస్తున్న వరదతో అలుగుపారుతున్నాయి.. వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. గోదావరి, మంజీరా నదు లు, మానేరు వంటి ఉప నదులు జలకళ సంతరించుకున్నాయి. బాసర వద్ద గోదావరి ఇరువైపులా ఒడ్డును తాకుతూ నిండుగా ప్రవహిస్తోంది. నిర్మల్‌ జిల్లాలోని కడెం ప్రాజెక్టు నిండు కుండలా మారింది. శ్రీరాంసాగర్, నిజాంసాగర్‌ ప్రాజెక్టుల్లోకి నీటి చేరిక పెరిగింది.



ఆదిలాబాద్‌ జిల్లాలోని కుంటాల, పొచ్చర, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని బొగత, పెద్దపల్లి జిల్లాలోని పులి గుండం జలపాతాలు ఉప్పొంగుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో గత 24 గంటల్లో కామారెడ్డి జిల్లా రెంజల్, మహబూబాబాద్‌ జిల్లా నల్లబెల్లిలలో అత్యధికంగా 19 సెంటీమీటర్ల భారీ వర్షం కురిసింది. నవీపేట, ముధోల్, వెంకటాపూర్‌లలో 18, సారంగాపూర్, నిజాంసాగర్, కోటగిరిలలో 17 సెంటీమీటర్ల చొప్పున భారీ వర్షపాతం నమోదైంది. మరో 4 రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. 

 

చాలా ప్రాంతాల్లో కుంభవృష్టి 

వర్ని, శాయంపేట, ఎల్లారెడ్డిలలో 16, ఆత్మకూర్, బోధన్‌లలో 15, ములుగు, గోవింద రావుపేటలో 14, నారాయణఖేడ్, రుద్రూరులలో 13, పిట్లం, జుక్కల్, బాన్సువాడ, గాంధారిలలో 12, మాక్లూర్, భిక్కనూరులలో 11, కామారెడ్డి, హసన్‌పర్తి, బోథ్, నిజామాబాద్‌లలో 10, సదాశివనగర్, ఊట్నూరు, నిర్మల్, లింగంపేట, పరకాల, డిచ్‌పల్లి, ఆసిఫాబాద్, హన్మకొండ, ఎడపల్లి, తాడ్వాయి, నందిపేటలలో 9, మాచారెడ్డి, నాగిరెడ్డిపేట, మెదక్‌లలో 8 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురిశాయి. 

 

వరినాట్లు పుంజుకునే అవకాశం 

సరైన స్థాయిలో వర్షాల్లేక రాష్ట్రంలో ఇప్పటివరకు వరి నాట్లు పుంజుకోలేదు. తాజా వర్షాలతో అనేకచోట్ల కుంటలు, చెరువులు నిండాయి. వాగులు పొంగాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో వరి నాట్లు పుంజుకుంటా యని వ్యవసాయశాఖ వర్గాలు పేర్కొన్నాయి. ఈ నెలాఖరు వరకు నాట్లు వేసుకోవడానికి వీలుంది. కాబట్టి వరి నాట్లు పడతాయని తెలిపాయి. అయితే జలాశయాలు పూర్తిస్థాయిలో నిండితేనే అన్నిచోట్లా వరినాట్లు పడతాయని అధికారులు చెబుతున్నారు.



ప్రస్తుత వర్షాలతో పత్తి, సోయాబీన్, కంది తదితర వర్షాధార పంటలకు మేలు జరిగిందని పేర్కొంటున్నారు. ఖరీఫ్‌లో అన్ని పంటల సాధారణ సాగు విస్తీర్ణం 1.08 కోట్ల ఎకరాలు కాగా.. ఇప్పటివరకు 86.25 లక్షల ఎకరాల్లో సాగు మొదలైంది. ఇందులో వరి సాధారణ సాగు విస్తీర్ణం 23.35 లక్షల ఎకరాలుకాగా.. ఇప్పటివరకు 12.35 లక్షల ఎకరాల్లో (53%) మాత్రమే నాట్లు పడడం గమనార్హం. ఒక్క పత్తి సాగు మాత్రం సాధారణానికి మించి నమోదైంది. మిర్చి కూడా తక్కువగా సాగైంది. 

 

ఇంకా లోటే 

ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభమైన జూన్‌ ఒకటో తేదీ నుంచి ఆదివారం వరకు రాష్ట్రంలో 10 శాతం లోటు వర్షపాతం నమోదైంది. సీజన్‌ మధ్యలో పెద్ద డ్రైస్పెల్‌ (ఓ మోస్తరు వర్షానికి–వర్షానికి మధ్య అంతరం) రావడంతో ఈ లోటు ఇంకా కొనసాగుతోంది. ఖరీఫ్‌ సీజన్‌లో ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 52 సెంటీమీటర్ల సరాసరి వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా.. 47 సెంటీమీటర్లే కురిసింది. పాత జిల్లాల ప్రకారం ఆదిలాబాద్‌ జిల్లాలో ఇంకా 24 శాతం లోటు కొనసాగుతోంది. మహబూబ్‌నగర్‌ జిల్లాలో 20 శాతం లోటు నమోదైంది. ఖమ్మం, హైదరాబాద్, వరంగల్‌ జిల్లాల్లో మాత్రమే అధిక వర్షపాతం నమోదుకాగా.. మిగతా జిల్లాలన్నింటా లోటే నమోదైంది. 

 

కుంటాల కనువిందు.. 

ఆదిలాబాద్‌ జిల్లా నేరడిగొండ మండలంలో పోటెత్తుతున్న కుంటాల జలపాతం. మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ఆదివారం జలపాతం ఉప్పొంగింది. భారీగా వరద వస్తుండడంతో పర్యాటకులను జలపాతం సమీపంలోకి అనుమతించకుండా భద్రత ఏర్పాటు చేశారు. 

 

పొచ్చెర పరవళ్లు.. 

ఆదిలాబాద్‌ జిల్లాలో రెండ్రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో నీరు చేరి పొచ్చర జలపాతం ఉప్పొంగుతోంది. దీంతో జలపాతానికి సందర్శకుల తాకిడి ఎక్కువైంది. 

 

పులిగుండం పొంగింది... 

పెద్దపల్లి జిల్లాలోని గుర్రాంపల్లిలో ఉన్న పులిగుండం జలపాతం చాలా కాలం తర్వాత మళ్లీ కళకళలాడింది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఆదివారం ఈ జలపాతం ఉప్పొంగింది. దీంతో పెద్ద సంఖ్యలో సందర్శకులు జలపాతం వద్దకు వచ్చారు. 

 

జిల్లాల్లో ఇలా..

సాక్షి, నెట్‌వర్క్‌: రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ వానలు కురుస్తున్నాయి. శనివారం మధ్యాహ్నం నుంచే మొదలైన ముసురు ఆదివారం రాత్రికి కూడా కొనసాగింది. చాలా చోట్ల భారీ వర్షాలు కురియగా, మిగతా చోట్ల కూడా పూర్తిగా ముసురు పట్టింది. ఆదిలాబాద్‌ జిల్లా గాదిగూడ మండలం లో వాగు ఉప్పొంగడంతో 30 గ్రామాలకు రాక పోకలు నిలిచిపోయాయి. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో గోదావరి, మంజీరా నదులు వరదతో పోటెత్తుతున్నాయి.  చాలా చోట్ల సోయా, వరి తదితర పంటలు నీట మునిగాయి.   కల్యాణి ప్రాజెక్టు గేట్లు మొరాయించడంతో రెండు గంటల పాటు శ్రమించి మరమ్మతు చేసి నీటిని దిగువకు వదిలారు.







నిర్మల్‌ జిల్లాలోని బాసర వద్ద గోదావరి నది ఇరు ఒడ్డులను తాకుతూ ప్రవహిస్తోంది. వరంగల్‌ రూరల్‌ జిల్లా ఖానాపురం మండలం లోని పాకాల సరస్సు నిండుకుండలా మారింది.  జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని లక్నవరం సరస్సు నిండిపోయి మత్తడి పోస్తోంది. మహబూ బాబాద్‌ జిల్లా గూడూరు మండలం చిర్రకుంట తండాకు చెందిన బానోతు కౌంసల్య (40) అనే మహిళ పాకాల వాగులో గల్లంతైంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో కడెం ప్రాజెక్టులోకి భారీగా వరద వచ్చి చేరడంతో నిండుకుండలా మారింది. ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలకు శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టులోకి నీటి చేరిక మొదలైంది. అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం కారణంగా హైదరాబాద్‌లో శనివారం నుంచే ముసురుపట్టింది. ఆదివారం పలు ప్రాంతాల్లో జల్లులు కురిశాయి.

 

గర్భిణికి వరద కష్టాలు.. ఆటోలోనే ప్రసవం

నిండు చూలాలు.. ఇటు చూస్తే పురుటినొప్పులు.. అటు భారీ వర్షం.. అంబులెన్స్‌ రాలేని పరిస్థితి.. ధైర్యం చేసి ఆటోలో బయలుదేరినా.. వాగులో ఆటో దిగబడింది. దీంతో ఆ భారీ వర్షంలో.. ఆ ఆటోలోనే మహిళ ప్రసవించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం కుర్న వల్లికి చెందిన ఇర్సా రమ్య దుస్థితి ఇది. పురుటినొప్పులతో బాధపడుతున్న ఆమెను ఆదివారం తెల్లవారుజామున చర్ల మండల కేంద్రానికి తరలిస్తుండగా.. చింతగుప్ప – బోదనెల్లి గ్రామాల సమీపంలో వాగు వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే స్థానికుల సహాయంతో ఆ ఆటోను వాగు దాటించి.. రమ్యను 108 వాహనంలో భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించారు.



Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top