మంతెనలో భారీ అగ్ని ప్రమాదం

మంతెనలో భారీ అగ్ని ప్రమాదం - Sakshi


100 పూరి గుడిసెలు బుగ్గిపాలు



మంతెన (కంకిపాడు): భారీ అగ్నిప్రమాదంలో 100 పూరి గుడిసెలు అగ్నికి ఆహుతయ్యాయి. తెలంగాణ రాష్ట్రం నల్లగొండ జిల్లా నుంచి పొట్టచేతపట్టుకుని చెరుకు పొలాల్లో పనులకు వచ్చిన కూలీలు కట్టుబట్టలతో రోడ్డునపడ్డారు. కృష్ణాజిల్లా కంకిపాడు మండలం మంతెన గ్రామంలో ఆదివారం ఉదయం 9 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. నల్లగొండ జిల్లా నకిరేకల్లు తాలూకా రామచంద్రాపురం, తాటికల్లు, కడపర్తి, బాయిరావుని బండ, మునుకుంట్ల, కటంగూరు, నార్కట్‌పల్లి, చిట్యాల, తిప్పర్తి, కనగల్‌ ప్రాంతాలకు చెందిన 216 వలస కూలి కుటుంబాలను చెరకు పొలాల్లో పని కోసం కౌలురైతు కొండేటి వెంకటేశ్వరరావు మంతెనకు తీసుకొచ్చారు.



మూడు నెలలుగా బుడమేరు వంతెన సమీపంలోని పంట పొలాల్లో చెరకు ఆకుతో పూరిగుడిసెలు నిర్మించుకుని జీవిస్తున్నారు. ఆదివారం ఉదయం వంట పనులు పూర్తి చేసుకుని అంతా చెరకు నరుకుడు పనులకు వెళ్లారు. గుడిసెల వద్ద చిన్నారులు, వృద్ధులు మాత్రమే ఉన్నారు. 9 గంటల సమయంలో ఓ గుడిసెకు నిప్పంటుకుని క్షణాల్లో మిగతా వాటికి వ్యాపించింది. ఏడు గ్యాస్‌ సిలిండర్లు పేలాయి. గమనించిన కూలీలు ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. అప్పటికే 100 గుడిసెలు పూర్తిగా మంటలు అలముకుని కాలిబూడిదయ్యాయి. గుడిసెల్లోని దుస్తులు, వంట సామగ్రి, ఆహార పదార్థాలు, వెండి, బంగారు ఆభరణాలు కాలిబూడిదయ్యాయి. రూ.6 లక్షలు మేర ఆస్తినష్టం వాటిల్లింది. ఎస్‌ఐ హనీశ్, రెవెన్యూ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.



శభాష్‌ రేవతి..

 అగ్ని ప్రమాదం తీవ్రతను తగ్గించడంలో, పలువురి చిన్నారుల ప్రాణాలు కాపాడంలో ఓ బాలిక చూపిన తెగువ అందరి ప్రశంసలూ అందుకుంది. ఐటీఐ చదువుతున్న విశ్వనాథపల్లి రేవతి (16) తమ బంధువులతో పాటు నల్లగొండ జిల్లా నుంచి పనులకు వచ్చింది. అగ్ని ప్రమాదాన్ని గుర్తించిన వెంటనే గుడిసె ల్లో నిద్రపోతున్న సుమారు 10 మంది చిన్నారులను బయటకు తీసుకొచ్చింది. గ్యాస్‌ సిలిండర్లను స్టవ్‌ నుంచి వేరు చేసి బయటకు తెచ్చి ప్రమాద స్థాయిని తగ్గించారు. స్థానికులు ఆమెను అభినందనలతో ముంచెత్తారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top