విపక్షాలను ఎలా ఎదుర్కొందాం?


‘అసెంబ్లీ’ వ్యూహంపై నేడు

సీఎం అధ్యక్షతన టీఆర్‌ఎస్‌ఎల్పీ భేటీ




హైదరాబాద్‌: ప్రతిపక్షాల విమర్శలను సమర్థంగా తిప్పికొట్టేందుకు అధికార పార్టీ సన్నద్ధమవుతోంది. శుక్ర వారం నుంచి అసెంబ్లీ బడ్జెట్‌ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో గురువారం టీఆర్‌ఎస్‌ శాసనసభా పక్షం భేటీ కానుంది. సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన తెలంగాణ భవన్‌లో మధ్యాహ్నం 3 గంటలకు ఈ సమావేశం జరగనుంది. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సి వ్యూహంపై ఇం దులో చర్చించనున్నారు. ఇటీవల ప్రతిపక్షం కాంగ్రెస్‌తో పాటు టీడీపీ, బీజేపీ సైతం ప్రభుత్వ విధానాలపై ఒంటి కాలిపై లేస్తున్నాయి. నియోజకవర్గాల వారీగా కాంగ్రెస్‌ జనావేదన పేరున సదస్సులు నిర్వహిస్తోంది. మరోవైపు టీడీపీ సైతం పాదయాత్రలతో జనంలోకి వెళ్లింది. బీజేపీ ప్రభుత్వంపై విరుచుకుపడుతోంది. అసెంబ్లీ వేదికగా కూడా విపక్షాలు విమర్శలకు దిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే తమ సభ్యులు ఎలా వ్యవహరించాలనే దానిపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేసీఆర్‌ సూచనలు చేస్తారని చెబుతున్నారు.



నామినేటెడ్, సంస్థాగత అంశాలపైనా..

నామినేటెడ్‌ పదవులు, పార్టీ సంస్థాగత అంశాలపైనా భేటీలో చర్చించే అవకాశం ఉందంటున్నారు. అసెంబ్లీ సమావేశాలు ముగియగానే.. ఏప్రిల్‌లో జరగాల్సిన పార్టీ 16వ ప్లీనరీపై సీఎం దృష్టి పెడతారని సమాచారం. అలాగే ఏడుగురు ఎమ్మెల్యేలకు మొదట పార్లమెంటరీ కార్యదర్శులుగా అవకాశం ఇచ్చినా.. కోర్టు తీర్పుతో వారు మాజీలయ్యారు. ఇలాంటి వారినీ, పదవులపై ఆశలు పెట్టుకున్న వారందరినీ పరిగణలోకి తీసుకుని ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top