ఎన్నాళ్లీ ఇన్‌చార్జిల పాలన..!


 చేవెళ్ల: పాఠశాలల పనితీరును పర్యవేక్షిస్తూ విద్యాభివృద్ధికి కృషి చేయాల్సిన మండల విద్యాధికారుల పోస్టులు జిల్లాలో అధికశాతం ఖాళీలుగా ఉన్నా భర్తీ చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం విహస్తోంది. దీంతో ఉన్నత పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తున్న సీనియర్లను ఇన్‌చార్జిలుగా నియమిస్తుండడంతో ఇప్పటికే టీచర్ల కొరతతో సతమతమవుతున్న తరుణంలో ఉన్నవారికి అదనపు భారం పడుతోంది. పూర్తిస్థాయి మండల విద్యాధికారులను నియమించాలని గతంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అమలుకు నోచుకోకపోవడంతో ఇన్‌చార్జీల పాలనే కొనసాగుతున్నది.



ఇటీవలి కాలంలో ఎంఈఓలకు పనిభారం పెరగడం, ఇన్‌చార్జీలుగా ఉన్నవారు తాము పనిచేస్తున్న పాఠశాలలకు అప్పుడప్పుడైనా వెళ్లాలని నిబంధనలు ఉండడంతో వారు ఇబ్బందులకు గురవుతున్నారు. ఎంఈఓలు పాఠశాలల పనితీరును పర్యవేక్షించడం, మధ్యాహ్న భోజన పథకం బిల్లులను పంపించడం, పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీచేయడం, విద్యాశాఖనుంచి వచ్చిన నివేదికలను పంపించడం, టీచర్లకు శిక్షణా తరగతులు నిర్వహించడం, వాటిని పర్యవేక్షించడం తదితర బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంది.



 ప్రధానోపాధ్యాయులపై భారం

 జిల్లాలోని 37 మండలాలలకుగాను కేవలం నాలుగు మండలాలలో మాత్రమే రెగ్యులర్ మండల విద్యాధికారులు విధులు నిర్వర్తిస్తున్నారు.  హయత్‌నగర్, గండేడు, దోమ, బాల్‌నగర్ మండలాలలో మాత్రమే రెగ్యులర్ ఎంఈఓలుండగా మిగతా మండలాలలో ఇన్‌చార్జులు విధులు నిర్వర్తిస్తున్నారు. ఏ మండలంలో రెగ్యులర్ ఎంఈఓ పోస్టు ఖాళీగా ఉంటే ఆ మండలంలోని ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడ్ని ఇన్‌చార్జిగా నియమిస్తున్నారు. దీంతో ఆ పాఠశాలలో ఒక పోస్టు ఖాళీ అవడం, ఆ స్థానంలో ఎవరినీ నియమించకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.



 ఉదాహరణకు చేవెళ్ల ఎంఈఓగా  మల్కాపూర్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎస్‌కే శ్రీశైలం ఇన్‌చార్జి ఎంఈఓగా గత మూడు సంవత్సరాలుగా విధులు నిర్వర్తించారు. ఆయన జూన్ 30వేతదీన పదవీవిరమణ చేయడంతో చేవెళ్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు నాగరాణికి ఇన్‌చార్జి ఎంఈఓగా నియమిస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేయడంతో ఆమె  పదవీబాధ్యతలు స్వీకరించారు. దీంతో ఆమె బోధించే సబ్జెక్టుకు టీచరు లేకపోవడంతో విద్యార్థులకు అవస్థలు తప్పడంలేదు.



 తనిఖీలు లేవు.. పర్యవేక్షణ లేదు..

 ఆయా మండలాలలోని ఉన్నత పాఠశాల సీనియర్ ప్రధానోపాధ్యాయులనే ఇన్‌చార్జి ఎంఈఓలుగా ప్రభుత్వం నియమిస్తుండడంతో పాఠశాలల తనిఖీలు గాని, ఉపాధ్యాయుల మీద పర్యవేక్షణ గాని చేయడంలేదనే ఆరోపణలున్నాయి. తరచుగా ఎంఈఓలు పాఠశాలల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలన్న ఉన్నతాధికారుల ఆదేశాలు ఎక్కడా అమలు కావడంలేదు. ఎంఈఓలు ఆఫీసులలో కూర్చుని పేపరు వర్కుకే పరిమితమయ్యారనే విమర్శలు ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల పనితీరు సరిగ్గా లేనందువల్లనే తల్లిదండ్రులు తమ పిల్లలను పంపడంలేదనే విమర్శలు సైతం వినిపిస్తున్నాయి.  భారమైనాసరే కూలీ చేసుకునే వారు సైతం తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలలకు పంపుతున్నారు.



 ప్రైవేటు స్కూళ్లపై చర్యలేవీ...

 ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అధికఫీజులు దండుకుంటున్న ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలున్నా ఎంఈఓలు ఆ స్కూళ్లను కనీసం తనిఖీచేసిన పాపాన పోవడంలేదు. విద్యార్థి సంఘాలు పలుమార్లు అధికారులను కలిసి విన్నవించినా ప్రయోజనం లేకుండా పోయింది. ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలకు ఎంఈఓలు తొత్తులుగా వ్యవహారిస్తున్నారని, అందువల్లనే కనీసం తనిఖీలు కూడా నిర్వహించడంలేదని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇన్‌చార్జి ఎంఈఓలు ఉన్నందువల్లనే ఈ దుస్థితి ఉన్నదని, వీరి స్థానంలో వెంటనే టీపీపీఎస్సీ ద్వారా పూర్తిస్థాయి ఎంఈఓలను నియమించాలని కోరుతున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top