సభా పర్వానికి తెర

సభా పర్వానికి తెర

  • సభను నిరవధికంగా వాయిదా వేసిన స్పీకర్

  • 7వ తేదీ నుంచి పద్నాలుగు రోజుల పాటు సమావేశాలు

  • సెల్ఫ్‌గోల్‌తో సభ బయటే ఉండిపోయిన టీడీపీ

  • సమన్వయలోపంతో ప్రధాన ప్రతిపక్షం అభాసుపాలు

  • నోరు జారి.. విచారం వెలిబుచ్చిన ఇద్దరు మంత్రులు

  • సాక్షి, హైదరాబాద్: అధికార, విపక్షాల వాడివేడి చర్చలు, వివాదాలు, సస్పెన్షన్లు, క్షమాపణల మధ్య రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు గురువారం ముగిశాయి. ఈ నెల 7వ తేదీ మొదలైన సమావేశాలను.. గురువారం ద్రవ్య వినిమయ బిల్లుకు సభ ఆమోదం తెలిపాక నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ మధుసూదనాచారి ప్రకటించారు. ఈ సమావేశాల్లో అధికార టీఆర్‌ఎస్‌ను దీటుగా ఎదుర్కోవడంలో, వివిధ అంశాల్లో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడంలో విపక్షాలు చాలా వరకు విఫలమయ్యాయి.



    ఈ సమావేశాల్లో దాదాపుగా అధికార పక్షమే పైచేయి సాధించింది. విపక్ష తెలుగుదేశం పార్టీకి సభలో సాంకేతికంగా పదిహేను మంది సభ్యులున్నా... చివరకు వారెవరూ లేకుండానే ఈ సెషన్ ముగిసింది. సమావేశాల తొలిరోజున ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించిన సమయంలో వివాదం, విపక్ష కాంగ్రెస్, టీడీపీ సభ్యులు గవర్నర్ ప్రసంగ ప్రతులను చించి ఆయన పైకే వెదజల్లడంతో ప్రారంభమైన గందరగోళం... చివరకు జాతీ య గీతాలాపన వరకూ కొనసాగింది. అయితే గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం తెలిపే రోజున ఆయా సభ్యులతో క్షమాపణ చెప్పించడంతో... తర్వాత పన్నెండు రోజుల పాటు సమావేశాలు సజావుగా కొనసాగాయి.

     

    టీడీపీ సెల్ఫ్‌గోల్



    గవర్నర్ ప్రసంగం రోజున నానా హడావుడి చేసిన టీడీపీ... చివరకు అన్ని పక్షాలు కోరినా సభకు క్షమాపణ చెప్పలేదు. పైగా మంత్రివర్గంలో ఎస్సీ, ఎస్టీ, మహిళలకు చోటు లేదంటూ తమకు సంబంధం లేని అంశాన్ని నెత్తికెత్తుకుని అభాసుపాలైంది. ఈ సమయంలో పదే పదే పోడియం వద్దకు దూసుకువచ్చి సభలో ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టించింది. ఆ పార్టీ ఫ్లోర్‌లీడ ర్ ఎర్రబెల్లి దయాకర్‌రావుకు స్పీకర్ మాట్లాడే అవకాశమిచ్చినా.. సద్వినియోగం చేసుకోలేదు. దీంతో ఆగ్రహించిన అధికార పక్షం ఆ సమయంలో సభలో లేని ఆర్.కృష్ణయ్య మినహా మిగతా 11 మంది సభ్యులను బడ్జెట్ సెషన్ మొత్తం సస్పెండ్ చేసింది. ఆ తర్వాత కనీసం ఒక్క రోజన్నా చర్చలో పాల్గొనే అవకాశం కోసం టీడీపీ సభ్యులు చేయని ప్రయత్నం లేదు. సస్పెన్షన్ ఎత్తివేయాలంటూ విపక్ష నేతలను, గవర్నర్‌ను, చివరకు రాష్ట్రపతిని కూడా కలిశారు. స్పీకర్ చాంబర్‌లోనూ ధర్నాకు దిగారు. కానీ టీడీపీ ఎన్ని పిల్లిమొగ్గలు వేసినా... సస్పెన్షన్ ఎత్తివేయలేదు.

     

    కాంగ్రెస్‌లో కొరవడిన సమన్వయం



    ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌లో ఆ పార్టీ నేత జానారెడ్డి, సభ్యుల మధ్య సమన్వయం కొరవడింది. జాతీయ గీతాన్ని అవమానపరిచారన్న కారణంతో ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌తో క్షమాపణ చెప్పించడానికి సీఎల్పీ నేత జానారెడ్డి కష్టపడాల్సి వచ్చింది. అన్నిపక్షాల నేతలు ఆ ఘటన వీడియోలను చూసి ఎవరెవరు క్షమాపణ చెప్పాలో తేల్చారు. కానీ సంపత్ క్షమాపణకు ససేమిరా అన్న రీతిలో వ్యవహరించడంతో జానారెడ్డి ఇరకాటంలో పడ్డారు. తర్వాత జరిగిన డి.కె.అరుణ వివాదం విషయంలోనూ ఆమె క్షమాపణ చెప్పలేదు. ఎస్సీ, ఎస్టీ  ఉపప్రణాళికపై చర్చలో సీఎల్పీ నేతగా జానారెడ్డి తమ నిరసన తెలిపాక కూడా ఆ పార్టీ ఎమ్మెల్యే భట్టి విక్రమార్క మాట్లాడానికి ప్రయత్నించారు. దీంతో సీఎల్పీ నేత మాటలను సభ్యులు లెక్క చేయడం లేదన్న అభిప్రాయం వచ్చింది.

     

    నోరుజారిన మంత్రులు



    ఇక సభలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మంత్రులు.. రెండు పర్యాయాలు సభలో క్షమాపణ చెప్పినంత పనిచేశారు. పేరుకు వారు విచారం వ్యక్తం చేస్తున్నట్లు చెప్పినా... అది పాలకపక్షం వెనకడుగనే అభిప్రాయం వ్యక్తమైంది. తొలుత కాంగ్రెస్ ఎమ్మెల్యే డీ.కె.అరుణ, మంత్రి కేటీఆర్ మధ్య జరిగింది. ఈ విషయంలో ఇద్దరూ తమ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించి, విచారం వ్యక్తం చేశారు. ఇక మంత్రి జగదీశ్‌రెడ్డి కాంగ్రెస్ సీనియర్ సభ్యుడు చిన్నారెడ్డిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై పెద్ద దుమారమే లేచింది. చివరకు జగదీశ్‌రెడ్డితో పాటు స్వయంగా ముఖ్యమంత్రి   సభలో విచారం వ్యక్తం చేయాల్సి వచ్చింది. కాంగ్రెస్, బీజేపీలు రెండు సందర్భాల్లో వాకౌట్ చేశాయి. అయితే అన్ని పక్షాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని ఏకాభిప్రాయం తో సభను నడపడంపై ఈసారి పాలకపక్షం బాగానే శ్రద్ధ తీసుకున్నట్లు కనిపించింది.



    కమిటీలకు చైర్మన్లు..



    ప్రజాపద్దుల కమిటీ, ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ, అంచనాల కమిటీలకు చైర్మన్లు, సభ్యు ల పేర్లను స్పీకర్ మధుసూదనాచారి సమావేశాల చివరిరోజైన గురువారం సభలో ప్రకటించారు. పీఏసీ చైర్మన్‌గా కాంగ్రెస్ ఎమ్మెల్యే పటోళ్ల కిష్టారెడ్డి, అంచనాల కమిటీ చైర్మన్‌గా టీఆర్‌ఎస్ సభ్యుడు సోలిపేట రామలింగారెడ్డి, ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ చైర్మన్‌గా టీఆర్‌ఎస్ సభ్యుడు ఎన్.దివాకర్‌రావు పేర్లను ప్రకటించారు. ఒక్కో కమిటీకి అసెంబ్లీ నుంచి 9 మంది సభ్యుల చొప్పున ఎన్నికయ్యారంటూ.. వారి పేర్లను సభలో చదివి వినిపించారు.

     

    పట్టువిడుపులు లేకుండా నడిపాం



    ‘‘బడ్జెట్ సమావేశాలను ప్రభుత్వం భేషజాలకు పోకుండా, ఎలాంటి పట్టువిడుపులు లేకుండా నిర్వహించింది. సమావేశాలను పొడిగించాలని ఒక్క విపక్షం కూడా కోరలేదు. సభలో అర్థవంతమైన చర్చలు జరిగాయి. సభ సజావుగా సాగడానికి విపక్షాలు సహకరించాయి. వారికి కృతజ్ఞతలు చెబుతున్నాం. తెలంగాణ అసెంబ్లీ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలవాలన్న సీఎం కేసీఆర్ సూచన  మేరకు ముందుకు వెళ్లాం. కేరళలో, పొరుగునే ఉన్న ఏపీఅసెంబ్లీలో ఏం జరిగిందో అంతా గమనించారు. అలాంటి పరిస్థితికి భిన్నంగా గొప్పగా మన బడ్జెట్ సమావేశాలను నిర్వహించాం.  మహారాష్ట్రలో గవర్నర్‌ను అవమానించినందుకు ఎంఎన్‌ఎస్‌కు చెందిన ఎమ్మెల్యేలను రెండేళ్లు సస్పెండ్ చేశారు. కానీ ఇక్కడ మేం టీడీపీ సభ్యులను ఈ సెషన్‌కు మాత్రమే సస్పెండ్ చేశాం.     -మంత్రి హరీశ్‌రావు

     

    సంతృప్తికరం



    ‘‘అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సం తృప్తి కలిగించా యి. అర్థవంతమైన చర్చలతో, ఫలవంతమైన నిర్ణయాలు తీసుకున్నాం. సభలో జరిగిన నిర్ణయాలు ప్రజలకు ఉపయోగ పడతాయని, వారికి మేలు జరుగుతుందని భావిస్తున్నాం. సభలో ఎలాంటి ఉద్రిక్తతకు తావులేకుండా, రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సభ జరిగిందన్న సంతృప్తి మిగిలింది.’’    - స్పీకర్ మధుసూదనాచారి

     

    సభా సమయం



    14 రోజుల్లో 78.54 గంటల పాటు సమావేశాలు జరిగాయి



    36.05 గంటల సమయాన్ని వినియోగించుకున్న అధికార టీఆర్‌ఎస్

     

    18.34 గంటల సమయం తీసుకున్న విపక్ష కాంగ్రెస్

     

    బీజేపీ 9 గంటలు, ఎంఐఎం 7.17, సీపీఐ 3.27, సీపీఎం 2.53, వైఎస్సార్‌సీపీ 1.27 గంటల సమయాన్ని వినియోగించుకున్నాయి.

     

    ఇక అతి తక్కువగా టీడీపీ 10 నిమిషాలు, నామినేటెడ్ సభ్యుడు 5 నిమిషాలు

     తీసుకున్నారు.

     

    సభానేత అయిన సీఎం 3.50 గంటలు, ప్రధాన ప్రతిపక్ష నేత 3.21 గంటలు, ఎంఐఎం ఫ్లోర్ లీడర్ 5.19, బీజేపీ ఫ్లోర్ లీడర్ 3.59, వైఎస్సార్‌సీపీ ఫ్లోర్ లీడర్ 1.22 గంటల పాటు చర్చల్లో పాల్గొన్నారు.

     

    సమయం వృథా మొత్తంగా చూసినప్పుడు కొంత తగ్గింది. ఈ సమావేశాల్లో కాంగ్రెస్ 55 నిమిషాలు, టీడీపీ 10 నిమిషాలు, ఎంఐఎం ఒక నిమిషం, బీజేపీ ఏడు నిమిషాల సభా సమయాన్ని వృథా చేశాయి.

     

    ఏడు బిల్లులు పాస్..



    ఈ సమావే శాల్లో ప్రభుత్వం 99 ప్రశ్నలకు మౌఖికంగా సమాధానం ఇవ్వగా... మరో 30 ప్రశ్నలకు లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చింది. 147 అనుబంధ ప్రశ్నలకు జవాబిచ్చింది. 81 సభ్యుల ప్రసంగాలు, ఇద్దరు మంత్రుల ప్రకటనలు, మూడు తీర్మానాలు (రిజల్యూషన్స్ అడాప్టెడ్) చేశారు. ఏడు బిల్లులకు ఆమోదం లభించింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top