ఎవరు హెచ్చరించినా..డోన్ట్‌కేర్


 ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యం అందుతుందని, ప్రజలు స్వేచ్చగావచ్చి చికిత్స పొందవచ్చని ప్రభుత్వ అధికారులు, మంత్రులు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తుంటే...భద్రాచలం మన్యం ప్రజలు మాత్రం.. ‘వామ్మో.. ఏరియా ఆస్పత్రిలో వైద్యమా..’ అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఈ ఆస్పత్రిలో సేవలు మెరుగ్గానే ఉన్నప్పటికీ ఇటీవల మాత్రం సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా సరైన వైద్య సేవలు అందడం లేదని రోగులు ఆరోపిస్తున్నారు.



ముఖ్యంగా గర్భిణులు, నవజాత శిశులకు అందే సేవలు విఫలమై మరణాలు సంభవించడం కొంత ఆందోళనకు గురి చేస్తోంది. ఈ మూడు నెలల కాలంలో ఇటువంటి సంఘటనలు అనేకం జరిగాయి. ఆక్సిజన్ అందక పసికందు మృతి చెందడం, ప్రసవం సమయంలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా గర్భిణి మృతి చెందడం, ప్రసవం జరిగిన తర్వాత బాలింతకు వేసిన కుట్లు విడిపోయి తీవ్ర రక్త స్రావం కావడం, శనివారం వైద్యులు, స్టాప్ నర్సులు నిర్లక్ష్యంగా ప్రసవం చేయటంతో పురిటిలోనే పసికందు మృతి చెందడం వంటి అనేక సంఘటనలు చోటు చేసుకున్నాయి.



 ఇలా వరుస మరణాలతో ఏరియా ఆస్పత్రి తరచూ వార్తల్లోకెక్కి వివాదాల్లో నిలుస్తోంది. వైద్యుల నిర్లక్ష్యంతో పాటు డాక్టర్లు, వసతుల లేమి, డయాగ్నస్టిక్ సెంటర్, స్కానింగ్ సెంటర్ లేకపోవడం..ఇలా అన్ని సమస్యలే. వాటిని  పరిష్కరించడంలో స్థానిక వైద్యాధికారులతో పాటు ఉన్నతాధికారులు విఫలం అవుతున్నారనే విమర్శలు ఉన్నాయి.



 వైద్య సేవలపై ఎమ్మెల్యే అసంతృప్తి...

 ఏజెన్నీ ప్రజలతో పాటు చుట్టు పక్కల రాష్ట్రాల వారికి సైతం భద్రాచలం ఏరియా ఆస్పత్రి పెద్ద దిక్కుగా ఉంది. కానీ ఈ ఆస్పత్రిలో వైద్యసేవలపై స్థానిక ఎమ్మెల్యే సున్నం రాజయ్య తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇటీవల ఏరియా ఆస్పత్రి తనిఖీకి వచ్చిన రాష్ట్ర వైద్యశాఖ మంత్రి, డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య, పీఓ దివ్యలకు ఆయన ఫిర్యాదు చేశారు.



 సేవలు అందించడంలో వైద్యుల నిర్లక్ష్యాన్ని ఆయన బాహాటంగానే వివరించారు. దీనికి తోడు ఆస్పత్రిలో చోటుచేసుకున్న మరణాలపై సూపరింటెండెంట్ వ్యవహరిస్తున్న తీరుపై ఎమ్మెల్యే మరింత ఆగ్రహంగా ఉన్నారు. శనివారం జరిగిన పసికందు మృతి సంఘటనలో బంధువులు సూపరింటెండెంట్‌ను నిలదీయగా ‘బిడ్డ ఆయుష్షు అంత వరకే ఉంది, అందుకే చనిపోయాడు’ అంటూ అవహేళనగా మాట్లాడడంతో వారు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో బాధితులు ఈ విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు.



 గతంలో సైతం సారపాక గ్రామం గాంధీనగర్ కాలనీకి చెందిన ఓ గర్భిణి ప్రసవ సమయంలో మృతి చెందడంతో బంధువులు నిలదీయగా సూపరింటెండెంట్ ఇటువంటి వ్యాఖ్యలే చేయడంతో ఆమె బంధువులు, మహిళలు దాడి చేశారు. ఇలా వరుస సంఘటనలు జరుగుతున్నా ఆస్పత్రి నిర్వహణలోనూ, వైద్యాధికారులు అందించే సేవల్లోనూ మార్పు రాకపోవడంతో జిల్లా కలెక్టర్, రాష్ట్ర వైద్యశాఖ మంత్రిలతో పాటు, ముఖ్యమంత్రికి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసేందుకు ఎమ్మెల్యే సిద్ధమైనట్లు సమాచారం.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top