రబీ సాగుకు సెలవు

రబీ సాగుకు సెలవు - Sakshi


♦ తొమ్మిది జిల్లాల్లో సాగు 52 శాతం మాత్రమే

♦ రబీ సాగు లక్ష్యం 12,53,291 హెక్టార్లు

♦ ఇప్పటికి సాగయ్యింది 6,47,727 హెక్టార్లే

♦ ఎండిపోయిన ప్రధాన సాగునీటి ప్రాజెక్టులు

 

 సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ఆరుగాలం శ్రమించే అన్నదాతలు రబీ సాగుకు దూరమయ్యారు. ఖరీఫ్‌లో దెబ్బతిన్న పంటలు, కరువు కోరల్లో చిక్కుకున్న రైతులు కాడిని దింపేసి, మేడిని వదిలేసి సాగుకు సెలవన్నారు. రబీ సాగు లక్ష్యం రాష్ట్రంలో 12,53,291 హెక్టార్లుగా వ్యవసాయ శాఖ అంచనా వేయగా, 6,47,727 హెక్టార్లలోనే సాగు చేశారు. శ్రీరాంసాగర్, నిజాంసాగర్, సింగూరు తదితర సాగునీటి ప్రాజెక్టులు ఎండిపోయాయి. భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటాయి. ఖరీఫ్‌లో ప్రతికూల పరిస్థితుల మధ్య నష్టాల ఊబిలో చిక్కుకుని కోలుకోలేని విధంగా నష్టపోయిన రైతన్నను ఆదుకునేందుకు ప్రభుత్వం భరోసా ఇవ్వట్లేదు. రూ.792 కోట్ల పరిహారం ప్రకటించినా అది రైతుల దరికి చేరలేదు. విపరీతంగా పెరిగిన పెట్టుబడులు.. ఖరీఫ్ ఆశలపై నీళ్లుజల్లిన వాతావరణం.. గణనీయంగా పడిపోయిన దిగుబడి.. మొక్కుబడిగా గిట్టుబాటు ధర... వెరసి పంట విరామమే మేలంటున్నారు రబీ రైతులు.



 బయటపడని రైతాంగం

 రబీ సీజన్ మరికొద్ది రోజుల్లో ముగియనుండగా ఇప్పటికే సాధారణ విస్తీర్ణంలో వ్యవసాయ పనులు ఊపందుకోవాల్సి ఉంది. అయితే ఖరీఫ్‌లో ప్రతికూల వాతావరణం, కరెంట్ కోతల కారణంగా ఇప్పటికీ 52 శాతం దాటలేదు. నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్లగొండ, మహబూబ్‌నగర్, మెదక్,  రంగారెడ్డి జిల్లాల్లో 12,53,291 హెక్టార్లలో రబీ సాగవవుతుందన్న వ్యవసాయశాఖ అంచనా తలకిందులైంది. అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లాలో 90 శాతం సాగు కాగా, అత్యల్పంగా మెదక్ జిల్లాలో 44 శాతంగా ఉంది. ప్రాజెక్టులన్నీ డెడ్‌స్టోరేజీకి చేరగా, అడుగంటిన భూగర్భజలాలతో రైతులు భగీరథ ప్రయత్నం చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. తెలంగాణ జిల్లాలకు వరప్రదాయినిలా ఉన్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో గతేడాది ఇదే సమయంలో 16.49 టీఎంసీల నీరు ఉంటే, ఇప్పుడు 5.99 టీఎంసీలకు పడిపోయింది. నిజాంసాగర్‌లో 1.54 టీఎంసీలుంటే ప్రస్తుతం 0.06 టీఎంసీలు అంటే పూర్తిగా అడుగంటిపోయింది. కరీంనగర్ జిల్లా ఎల్‌ఎండీలో గతేడాది 8.02 టీఎంసీలు ఉంటే, ఇప్పుడు 3.19 టీఎంసీలు ఉంది. మెదక్ జిల్లా సింగూరు ప్రాజెక్టులో 9.12 టీఎంసీలు ఉండాల్సిన నీరు 0.74 టీఎంసీలకు పడిపోయింది.



 గణనీయంగా తగ్గిన వరిసాగు

 ఈ రబీలో 6,44,806 హెక్టార్లలో వరి సాగు చేస్తారని వ్యవసాయశాఖ ముందస్తు కార్యాచరణ ప్రణాళికలో పేర్కొంది. అత్యధికంగా కరీంనగర్ జిల్లాలో 1,59,681 హెక్టార్లు, నల్లగొండలో 1,49,864 హెక్టార్లు, ఆ తర్వాత నిజామాబాద్ 88,931 హెక్టార్లని అంచనా వేశారు. అయితే మొత్తంగా 2,00,298 హెక్టార్లలో వరిసాగు చేశారు. కేవలం 31 శాతం మాత్రమే వరిసాగైనట్లు వ్యవసాయ శాఖ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో పేర్కొంది. పంటను కాపాడుకునేందుకు రైతులకు రాత్రి కరెంటే దిక్కవుతోంది. కాగా, ఇప్పటికే బియ్యం ధరలు చుక్కలు తాకుతుండగా.. గణనీయంగా తగ్గిన వరిసాగుతో బియ్యం ధరలు మరింత ఎగబాకనున్నాయి.

 

 ఫలితం దక్కేనా?

 ఈ రైతు పేరు నారాయణ. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలోని లంగ్డాపూర్ గ్రామం. నాలుగు కరెంట్ బోరు బావులున్నాయని 12 ఎకరాలు కౌలుకు తీసుకున్నాడు. ఇందులో రెండు బోర్లల్లో నీళ్లు రావట్లేదు. మరో రెండు బోర్లలో అడుగంటాయి. ఆరు ఎకరాల్లో పొద్దుతిరుగుడు వేశాడు. నీళ్లు సరిపోవని మరో ఆరు ఎకరాలను పడావుగా ఉంచాడు. ఇప్పటి వరకు రూ. 3 లక్షలు ఖర్చు పెట్టాడు. అయితే రాత్రి వేళ కరెంట్ సరఫరా చేస్తుండటంతో రాత్రి పూట పొలం దగ్గరే ఉండాల్సి వస్తోంది. పంటలు చేతికొచ్చి కష్టాలు తీరుతాయనే ఆశతో కష్టపడినా ఫలితం దక్కే పరిస్థితులు కనిపించట్లేదని వాపోతున్నాడు.

 

 రాత్రి కరెంటుతో పరేషాన్

 మూడు షిఫ్టుల్లో కరెంటు ఇస్తున్నరు. ఒక షిఫ్టులో అర్ధరాత్రి కరెంటు అస్తున్నది. రాత్రి పూట కరెంటు అచ్చినపుడు పొలం కాడికి పోకుంటే మోటరు నడుస్తదో, నడువదో తెలువదు. వేసిన పంటకు నీళ్లు పారిచ్చేతందుకు నానా ఇబ్బంది పడాల్సి అస్తున్నది. ఎండలు ఎక్కువైపోయి నీళ్లు ఆగుతలేవు. అందుకే కరెంటు ఎప్పుడు అచ్చినా పొలం దగ్గరకు పోవలసి వస్తున్నది..

 -నేతుల మల్లేశం, రైతు, దోమకొండ, నిజామాబాద్ జిల్లా

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top