‘కార్బైడ్’ నిరోధానికి చర్యలేంటి?

‘కార్బైడ్’ నిరోధానికి చర్యలేంటి? - Sakshi


రెండు ప్రభుత్వాలకు హైకోర్టు ప్రశ్న

 

 సాక్షి, హైదరాబాద్ : మామిడి, అరటి, సపోటా, బొప్పాయి, దానిమ్మ, పుచ్చకాయలు, బత్తాయిలను పక్వానికి తీసుకొచ్చేందుకు కాల్షియం కార్బైడ్‌ను వాడుతుండటం వల్ల కలిగే దుష్పరిణామాలను తెలుసుకున్న హైకోర్టు విస్తుపోయింది. వ్యాపారులు కార్బైడ్‌ను విచ్చలవిడిగా ఉపయోగిస్తున్నట్లు స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ నివేదికల్లో తేలడంతో ధర్మాసనం విస్మయం వ్యక్తం చేసింది. కార్బైడ్ నిషేధానికి ఎలాంటి కార్యాచరణ రూపొందిస్తున్నారు? పండ్ల వ్యాపారులు కార్బైడ్ వాడకుండా నిరోధించేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో వివరించాలని ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలను ఆదేశించింది.



ఈ వ్యాజ్యంలో రెండు రాష్ట్రాల ఆహార భద్రత కమిషనర్లను, భారత ఆహార భద్రత, ప్రమాణాల సంస్థలను కూడా ప్రతివాదులుగా చేరుస్తూ ఈ మొత్తం వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన హైకోర్టు ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.  



 కంటి చూపు కోల్పోతారు: నిరంజన్‌రెడ్డి

 ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల ప్రత్యేక న్యాయవాదులు సంజీవ్‌కుమార్, రమేష్ హైకోర్టులో వాదనలు విని పించారు. ధర్మాసనం గతంలో ఇచ్చిన ఆదేశాల మేరకు ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, పండ్ల శాంపిళ్లను ల్యాబ్‌కు పంపామని, నివేదికలు వచ్చాయని తెలిపారు. అన్ని పండ్లలోనూ కార్బైడ్ అవశేషాలు ఉన్నట్లు నివేదికల ద్వారా వెల్లడైందన్నారు. ఈ సమయంలో హోల్‌సేల్ పండ్ల వ్యాపారుల తరఫు సీనియర్ న్యాయవాది పి.గంగయ్యనాయుడు వాదనలు వినిపించారు. హోల్‌సేల్ వ్యాపారులు పచ్చి కాయలనే విక్రయిస్తారని, వాటిని కొనుగోలు చేసే రిటైల్ వ్యాపారులే కార్బైడ్ వాడుతుంటారని తెలిపారు.



స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ ఇచ్చిన నివేదికలను ఇరు రాష్ట్రాల ప్రభుత్వాల ప్రత్యేక న్యాయవాదులు ధర్మాసనం ముందుంచారు. వాటిని పరిశీలించిన ధర్మాసనం, కార్బైడ్ వాడకం వల్ల కలిగే దుష్పరిణామాలను వివరించాలని కోర్టు సహాయకారి(అమికస్ క్యూరీ)గా వ్యవహరిస్తున్న న్యాయవాది ఎస్.నిరంజన్‌రెడ్డిని కోరింది. కార్బైడ్ వాడిన పండ్లను తింటే వాంతులు, రక్త విరోచనాలు, కడుపులో మంట, నీరసం, కంటిచూపు కోల్పోవడం, ఊపిరితిత్తుల్లో నీరు చేరడం తదితర దుష్పరిణామాలు కలుగుతాయని ఆయన వివరించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top