'సెక్షన్-8 అమలు' పిల్‌ను కొట్టేసిన హైకోర్టు

'సెక్షన్-8 అమలు' పిల్‌ను కొట్టేసిన హైకోర్టు - Sakshi


 సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో గవర్నర్‌కు శాంతిభద్రతలు, అంతర్గత భద్రత, ముఖ్య సంస్థల పర్యవేక్షణ బాధ్యతలను కట్టబెడుతున్న ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని సెక్షన్-8ని అమలు చేసేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని హైకోర్టు తోసిపుచ్చింది. ఈ వ్యాజ్యానికి విచారణార్హత లేదని తేల్చి చెప్పింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌తో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. సెక్షన్-8ని అమలు చేసేలా కేంద్ర హోం శాఖను ఆదేశించాలంటూ ఆంధ్రా అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ అధ్యక్షుడు వీరరాఘవరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. మొదట ఈ వ్యాజ్యాన్ని విచారించిన సింగిల్ జడ్జి, ఇందులో విస్తృత ప్రజా ప్రయోజనాలు ముడిపడి ఉన్నందున దీన్ని ధర్మాసనానికి బదలాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఈ వ్యాజ్యాన్ని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం విచారించింది. ఏపీ పునర్విభజన చట్టం ప్రకా రం సెక్షన్-8 అమలు బాధ్యత గవర్నర్‌దని, కేంద్రానికి ఎటువంటి సంబంధం లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ విషయంలో గవర్నర్‌కు ఆదేశాలు జారీ చేయలేమని తేల్చి చెబుతూ, వ్యాజ్యాన్ని కొట్టేస్త్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top