దొంగ జపం చేయడంలో కొంగను మించిన బాబు


  • అధికారంలో ఉన్నప్పుడు ఎన్టీఆర్‌కు భారతరత్న అడగలేదేం?    

  •  చంద్రబాబుపై నిప్పులు చెరిగిన హరీశ్

  • సిద్దిపేట: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో సహా ఆ పార్టీ నేతలు హైదరాబాద్‌లో ఎన్టీఆర్ ఘాట్‌వద్ద చేసిన ధర్నాను భారీ నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు ఖండించారు. టీడీపీ నేతలు దొంగ జపం చేయడంలో కొంగలను మించి పోయారని నిప్పులు చెరిగారు. గుడ్డి కొంగ చెరువు ఒడ్డున దొంగ జపం చేసినట్లు చంద్రబాబు.. హుస్సేన్‌సాగర్ ఒడ్డున ఎన్టీఆర్‌పై ఎంతో ప్రేమ ఒలుకబోస్తు దొంగజపం చేశారని మండిపడ్డారు.



    శనివారం రాత్రి మెదక్ జిల్లా సిద్దిపేటలో మంత్రి విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఎన్టీఆర్ బతికున్నప్పుడు ఆయనపై చెప్పులు వేయించి ఆత్మను క్షోభపెట్టిన బాబు సహా టీడీపీ నేతలకు ధర్నా చేసే నైతిక హక్కు లేదన్నారు. తొమ్మిదేళ్లు అధికారంలో ఉన్న చంద్రబాబు.. ఎన్టీఆర్‌కు భారతరత్న బిరుదు కోసం ఎందుకు సిఫారసు చేయలేదని ప్రశ్నించారు.



    పార్లమెంటులో కనీసం ఎన్టీఆర్ ఫొటోను పెట్టడాన్ని వ్యతిరేకించిన ఆయన ఏపీలో వాగ్దానాలను నెరవేర్చకుండా ప్రజాగ్రహానికి గురై ప్రజల దృష్టిని మరల్చేందుకే శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు ఎన్టీఆర్ పేరుతో నాటకం ఆడుతున్నారని దుయ్యబట్టారు. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న బాబు మరో రాష్ట్ర శాసన సభలో తీర్మానించిన అంశాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన చేసి తెలంగాణ ప్రజల మనసులను గాయపర్చారని చెప్పారు.



    వెన్నుపోట్లకు, అవకాశవాద రాజకీయాలకు చంద్రబాబు కేరాఫ్ అడ్రస్‌గా మారారని ఎద్దేవాచేశారు. ఎన్టీఆర్ సంక్షేమ పథకాలను తుంగలో తొక్కిన బాబుకు ఆ పథకాల అమలుపై ప్రశ్నించే హక్కు ఎక్కడిదని ప్రశ్నించారు.  ప్రజల దృష్టిని మరల్చేందుకు ఊసరవెల్లి రాజకీయాలు చేస్తున్నారని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు.

     

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top