జోరుగా వానలు

జోరుగా వానలు

  • పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు.. పొంగుతున్న వాగులు, వంకలు

  • ఏటూరు నాగారంలో అత్యధికంగా 9 సెం.మీ.

  • రానున్న 4 రోజులూ వర్షాలు: వాతావరణ శాఖ

  • సాక్షి, హైదరాబాద్‌/నెట్‌వర్క్‌:

    రాష్ట్రంలో అనేక చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. శనివారం పలు జిల్లాలు తడిసిముద్దయ్యాయి. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని ఏటూరు నాగారంలో అత్యధికంగా 9 సెం.మీ. వర్షం కురిసింది.


    ఖమ్మం, నిజామాబాద్, వరంగల్‌ రూరల్, భద్రాద్రి కొత్తగూడెం, కామారెడ్డి జిల్లాల్లో విస్తారంగా వానలు కురిశాయి. పలుచోట్ల వాగులు, వంకలు పొంగుతున్నాయి. పంట పొలాలు నీట మునిగాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రానున్న నాలుగు రోజులపాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదివారం అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని, ఆ తర్వాత మూడ్రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.



    నిండుకుండలా తాలిపేరు..

    భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మూడ్రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు చేరుతోంది. చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 74 మీటర్లు కాగా శనివారం నాటికి 71.70 మీటర్లకు చేరుకుంది. అధికారులు 11 గేట్లను (12 అడుగుల మేర) ఎత్తి 42,150 క్యూసెక్కుల చొప్పున వరద నీటిని దిగువకు వదులుతున్నారు. కిన్నెరసాని ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 407 అడుగులు కాగా శనివారం నాటికి 406.20 అడుగులకు చేరింది. చర్ల, అశ్వారావుపేట, పాల్వంచ తదితర మండలాల్లో వాగులు పొంగిపొర్లాయి. 30 గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. దుమ్ముగూడెం మండలం పర్ణశాలలో సీతమ్మవారి విగ్రహం నీట మునిగింది. ఖమ్మంతోపాటు సత్తుపల్లి, పాలేరు, మధిర నియోజకవర్గాల్లో జోరువాన కురిసింది.



    సత్తుపల్లి నియోజకవర్గంలోని బేతుపల్లి పెద్ద చెరువు అలుగు పారుతోంది. తామరచెరువు నిండి గాడిదలవాగు వద్ద వరద రోడ్డుపై ప్రవహించడంతో సత్తుపల్లి–కాకర్లపల్లి వైపు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి జిల్లాల్లోనూ మోస్తరు వర్షం కురిసింది. కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలోని దుర్గం గ్రామ పంచాయతీ పరిధిలో లొంకతండాకు చెందిన తేజావత్‌ దేవిసింగ్‌(35) వాగులో గల్లంతయ్యాడు. గాలింపు చర్యలు చేపట్టినా ఆచూకీ లభించలేదు. నిజామాబాద్‌ జిల్లాలో జిల్లా వ్యాప్తంగా సుమారు 7 నుంచి 8 సెం.మీ. వర్షపాతం నమోదైంది. జిల్లా కేంద్రంలో భారీ వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలు మునిగాయి. రోడ్లు, రైల్వే స్టేషన్‌లో మోకాలెత్తు నీళ్లు నిలిచాయి. మంచిర్యాల జిల్లాలో పలు గనుల్లో ఉత్పత్తి నిలిచిపోయింది. ఓసీపీలో చేరిన వర్షపు నీటిని ఎప్పటికప్పుడు తోడేస్తున్నారు.



    ఎక్కడెంత వర్షపాతం?

    గత 24 గంటల్లో కోయిడాలో 8 సెం.మీ., వెంకటాపురం, ముల్కలపల్లిలలో 6 సెంటీమీటర్లు, సత్తుపల్లి, గోవిందరావుపేట, వెంకటాపూర్, మణుగూరు, నల్లబెల్లిలలో 5 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది. అశ్వారావుపేట, బోనకల్, పినపాక, బూర్గుంపాడు, ములుగు, భూపాలపల్లి, భద్రాచలం, దుమ్ముగూడెం, కొణిజర్ల, ఖానాపూర్, తల్లాడల్లో 4 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. అశ్వాపురం, జూలూరుపాడు, మధిర, గుండాల, చంద్రుగొండ, బయ్యారం, కూసుమంచి తదితర ప్రాంతాల్లో 3 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది.



    అయినా 15 శాతం లోటు

    రాష్ట్రంలో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదవుతున్నా అనేక ప్రాంతాల్లో లోటు వర్షపాతమే నమోదవుతోంది. జూన్‌ ఒకటో తేదీ నుంచి శనివారం వరకు రాష్ట్రంలో 513.9 మిల్లీమీటర్ల (ఎంఎం) వర్షం కురవాల్సి ఉండగా.. 434.8 ఎంఎంలే నమోదైంది. మొత్తంగా 15 శాతం లోటు వర్షపాతం రికార్డు అయింది. పాత జిల్లాల ప్రకారం చూస్తే ఆదిలాబాద్‌ జిల్లాలో 32, నిజామాబాద్‌లో 31, కరీంనగర్‌లో 22, మహబూబ్‌నగర్, మెదక్‌ల్లో 21, రంగారెడ్డిలో 18 శాతం చొప్పున లోటు వర్షపాతం నమోదైంది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో మెట్ట పంటలు మాత్రమే గట్టెక్కుతా యని అధికారులు చెబుతున్నారు.



    హైదరాబాద్‌లో మోస్తరుగా..

    హైదరాబాద్‌లో శని వారం పలుచోట్ల మోస్తరు వర్షం పడింది. పలుచోట్ల ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తాయి. ఉప్పల్, ఎల్బీనగర్, దిల్‌సుఖ్‌నగర్, కోఠి, నాంపల్లి, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, ఖైరతాబాద్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, సికింద్రాబాద్‌ తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. శనివారం రాత్రి  వరకు పటాన్‌చెరు, బీహెచ్‌ఈఎల్‌ తదితర ప్రాంతాల్లో 1.68 సెం.మీ. వర్షపాతం నమోదైంది.



    వరంగల్, భూపాలపల్లిలో జోరుగా వర్షాలు

    వరంగల్‌ రూరల్‌ జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. చెరువులు, కుంటలు పొంగి పొర్లుతున్నాయి. పలు ప్రాంతాల్లోని గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పంటపొలాలు నీట మునిగాయి. దుగ్గొండి మండలంలో ఏడు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పరకాలలోని చలివాగు మత్తడి పోస్తోంది. నల్లబెల్లి మండలం కొండాపురంలో 15 ఇళ్లు కూలిపోయాయి. జయశంకర్‌ భూపా లపల్లి జిల్లా వెంకటాపురం మండలంలోని రామప్ప దేవాలయం ప్రహరీ గోడ శని వారం కూలిపోయింది. మంగపేట మండ లంలోని మల్లూరు వాగు ప్రాజెక్టు ఎడమ కాల్వకు గండి పడింది.



    గోవిందరావు పేట–పస్రా మధ్య ఒర్రె ఉధృతంగా ప్రవ హించడంతో నాలుగు గంటలపాటు రాకపోకలు నిలిచాయి. ములుగు మండలం పంచొత్కులపల్లి– రాయిని గూడెం మధ్య బీటీరోడ్డు కొట్టుకు పోయింది. దీంతో 11 గ్రామాలకు రాక పోకలు స్తంభించాయి. మహబూబాబాద్‌ జిల్లాలో బయ్యారం, గార్ల చెరువులు అలుగుపోస్తున్నాయి. పాకాల కాల్వ ఉధృతంగా ప్రవíహిస్తోంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top