జిల్లాలో టీడీపీ దుకాణం బంద్

జిల్లాలో టీడీపీ దుకాణం బంద్ - Sakshi


* భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు

* టీఆర్‌ఎస్‌లో చేరిన ఖేడ్ సర్పంచ్ అప్పారావు షెట్కార్


నారాయణఖేడ్: జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఖాళీ కావడం ఖాయమని భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు పేర్కొన్నారు. బుధవారం నారాయణఖేడ్‌లో స్థానిక సర్పంచ్ అప్పారావు షెట్కార్ ఆయన అనుచరులు మంత్రి హరీష్‌రావు సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగసభలో హరీష్‌రావు మాట్లాడుతూ తెలంగాణలో విద్యుత్ కష్టాలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబే కారణమన్నారు.   రాష్ట్ర విభజన అనంతరం  54 శాతం విద్యుత్తును కేటాయించాలని కేంద్రప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసినా చంద్రబాబు అడ్డుకుంటున్నారన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత కూడా ఆంధ్ర నేతల పెత్తనం ఎందుకని ఆయన ప్రశ్నించారు.



తెలంగాణ ఉద్యమం ఖేడ్ మండలంలోని పలుగుతండాలో ప్రారంభమై ఢిల్లీ వరకు పాకిందన్నారు. ఖేడ్ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్సీ రాములు నాయక్  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు తెస్తారన్నారు. ఖేడ్‌లో టీఆర్‌ఎస్ అభ్యర్థి  ఎమ్మెల్యేగా లేకున్నా అభివృద్ధి పనులు చేపడతామన్నారు. కమలాపూర్ చెరువు అభివృద్ధికి రూ. కోటి నిధులు మంజూరు చేస్తామన్నారు. తండాలను గ్రామపంచాయతీలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఎస్టీ, మైనార్టీ యువతుల పెళ్లిళ్లకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ద్వారా రూ.51వేలను అందిస్తామన్నారు.



ఖేడ్ నియోజకవర్గంలో జరిగిన అవినీతిని త్వరలో బయట పెడ్తామన్నారు. ఖేడ్ సర్పంచ్ అప్పారావు షెట్కార్, ఆయన అనుచరులకు మంత్రి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో ఎంపీ బీబీ పాటిల్,  ఎమ్మెల్సీ రాములు నాయక్, టీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి భూపాల్‌రెడ్డి, జిల్లా నాయకులు మురళీ యాదవ్, బిడెకన్నె హన్మంతు, మోయిద్‌ఖాన్, అశోక్ షెట్కార్, విజయ్‌కుమార్ షెట్కార్, రవీందర్‌నాయక్, పాల్గొన్నారు.

గొంగడితో సన్మానం: మంత్రి హరీష్‌రావును టీఆర్‌ఎస్ నాయకులు మల్‌శెట్టియాదవ్, గోవింద్‌యాదవ్, మారుతీయాదవ్, పండరియాదవ్ తదితరులు గొంగడితో సన్మానం చేశారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top