పత్తి పోటెత్తె..


ఖమ్మం వ్యవసాయం : ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో ఏర్పాటు చేసిన కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) కేంద్రానికి మంగళవారం పత్తి భారీగా అమ్మకానికి వచ్చింది. సుమారు 45 వేల పత్తి బస్తాలు విక్రయానికి వచ్చాయి. గత గురువారం సీసీఐ కేంద్రంలో పత్తి కొనుగోలు చేశారు. ఆ రోజు కూడా సుమారు 30 వేల బస్తాలు అమ్మకానికి వచ్చాయి.



ఒక్క రోజులో పత్తి కొనుగోళ్లు పూర్తిగాక పోవడంతో శుక్రవారం కూడా కొనుగోళ్లు చేశారు. శనివారం అమావాస కావడం, మార్కెట్‌కు సెలవు దినం కావడంతో ఆ రోజు కాంటాలు తదితర పనులు పూర్తికాలేదు. దీంతో గురువారం సీసీఐ కేంద్రానికి వచ్చిన సరుకు కాంటాలు తదితర పనులు సోమవారానికి పూర్తయ్యాయి. దీంతో నాలుగు రోజుల పాటు సీసీఐ కేంద్రంలో కొత్తగా  సరుకు కొనుగోళ్లు జరప లేదు. దీంతో మంగళవారం సీసీఐ కేంద్రానికి పత్తి పోటెత్తింది.



 తప్పని కొనుగోలు కష్టాలు

 మంగళవారం కూడా గురువారం నాటి పరిస్థితులే పునరావృతమయ్యాయి. ఖమ్మం సీసీఐ కేంద్రంలో పత్తి కొనుగోళ్లకు  ఒక్క బయ్యరును మాత్రమే ఏర్పాటు చేశారు. దీంతో ఆ ఒక్క బయ్యరు సీసీఐ కేంద్రానికి అమ్మకానికి వచ్చిన 45 వేల బస్తాలను ఒక్క రోజులో కొనుగోలు చేయటం సాధ్యం కావడం లేదు. అంతేకాకుండా ఇదే బయ్యరుకు కొత్తగూడెం, చండ్రుగొండ సీసీఐ కేంద్రాలలో పత్తి కొనుగోళ్ల పనిని కూడా అప్పగించారు.



ఒక్క బయ్యరుకు మూడు కేంద్రాల్లో పత్తి కొనుగోళ్ల పని అప్పగించడంతో సరుకు కొనుగోళ్లలో తీవ్ర జాప్యం జరుగుతోంది. సీసీఐ కేంద్రానికి పత్తి అమ్మకానికి తెచ్చిన రైతులు రోజుల తరబడి పడిగాపులు కాయాల్సి వస్తోంది. సరుకు  కొనుగోలుకు రెండు నుంచి మూడు రోజులు పడుతుండగా  సరుకు కాంటాలకు మరో రెండు రోజులు పడుతుంది. మొత్తంగా రైతులు సీసీఐ కేంద్రానికి పత్తి అమ్మకానికి తీసుకొస్తే వారం రోజులు ఆ కేంద్రం చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఇక అమ్మిన సరుకు చెక్కులు 20 రోజులకైనా రావటం లేదు. వాటి కోసం కూడా రైతులు మార్కెట్ కార్యాలయం చుట్టూ తిరగాల్సి వస్తోంది.



సీసీఐ కేంద్రంలో పత్తి అమ్మకానికి రైతులు తీవ్ర అవస్థలు పడక తప్పటం లేదు. మంగళవారం అమ్మకానికి తెచ్చిన సరుకులో అదే రోజు కేవలం 15 వేల బస్తాలను మాత్రమే కొనుగోలు చేశారు. మరో 25 వేల బస్తాలను బుధవారం కొనుగోలు చేస్తారని అధికారులు చెబుతున్నారు. ఒక్క రోజులో 25 వేల బస్తాలు కొనుగోలు చేసే పరిస్థితులు కనిపిండచం లేదు. బుధవారం ఖమ్మం సీసీఐ కేంద్రంలో పత్తి కొనుగోళ్లు జరపడం లేదని కొత్తగా రైతులు సీసీఐ కేంద్రానికి సరుకు అమ్మకానికి తీసుకురావొద్దని మార్కెట్ అధికారులు ప్రకటించారు.  



మళ్లీ ఎప్పుడు కొనుగోలు చేస్తారనేది ప్రశ్నార్థంకంగానే ఉంది. సీసీఐ కొనుగోళ్లు సజావుగా లేకపోవడం, డబ్బు సకాలంలో చేతికి అందకపోవడంతో  విసుగు చెందుతున్న రైతులు ప్రైవేటు వ్యాపారులు, దళారులను ఆశ్రయిస్తున్నారు. సీసీఐ ఇబ్బందులను భరించలేక రైతులు  తక్కువ ధరకు ప్రైవేటు వ్యాపారులకు సరుకును అమ్ముకుంటున్నారు. సీసీఐకి విక్రయించడంకంటే ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకోవడమే మేలని రైతులు భావిస్తున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top