భారీగా నిధులు


 సాక్షి, రంగారెడ్డి జిల్లా: గ్రామీణ మార్గాలకు గ్రహణం వీడింది. కంకర తేలి.. గతుకులతో అధ్వానంగా తయారైన బీటీ రోడ్లకు మహర్దశ పట్టనుంది. మారుమూల పల్లెలను కలుపుతూ సాగే పంచాయతీరాజ్ దారులకు మరమ్మతులు చేసేందుకు రూ.220.39 కోట్లు విడుదల చేసింది. ఈ నిధుల తో జిల్లాలోని 1302.95 కిలోమీటర్ల మేర నిర్మించనున్నారు.



కొన్ని సంవత్సరాలుగా నిధుల్లేమితో పంచాయతీరాజ్ రోడ్లను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈ క్రమంలోనే ఆర్‌అండ్‌బీ పరిధిలోకి వీటిని బదలాయించడం ద్వారా ఈ మార్గాలకు మోక్షం కలుగుతుందనే వ్యక్తమైంది. అందుకనుగుణంగా జిల్లాలోని పలు పీఆర్ రోడ్లు ఆర్‌అండ్‌బీకి బదిలీ చేశారు. అయితే, ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి మరణానంతరం వీటిని పట్టించుకునే నాథుడు కరువయ్యారు. మరోవైపు ప్రకృతి విపత్తులు కూడా రహదారులను ధ్వంసం చేశాయి. ఈ నేపథ్యంలో గ్రామీణ రహదారులు దారణంగా దెబ్బతిన్నాయి.

ద్విచక్రవాహనాలు కూడా  రాకపోకలు సాగించలేని విధంగా తయారయ్యాయి.



ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న కేసీఆర్ సర్కారు.. పంచాయతీరాజ్ రోడ్లకు పెద్దపీట వేసింది. జిల్లాలోని 9 నియోజకవర్గాల పరిధిలోని 540 తారు రోడ్లను రీ కార్పెట్/రిపేర్లు చేసేందుకు నిధులు మంజూరు చేసింది. తారు రోడ్లను పునర్‌నిర్మించడానికి 207.95 కోట్లు, కల్వర్టులు/వంతెనలకు మరమ్మతులు చేపట్టేందుకు వీలుగా రూ.12.44 కోట్లు కేటాయించింది.



 ఈ మేరకు పంచాయతీరాజ్‌శాఖ ముఖ్య కార్యదర్శి రేమాండ్ పీటర్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. నిధుల వరదతో గ్రామీణ రోడ్లు సొబగులు అద్దుకోనున్నాయి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top