ఆందోళనకర స్థాయిలో హృద్రోగులు


సాక్షి, సిటీబ్యూరో: ‘దేశంలో హృద్రోగ బాధితుల సంఖ్య రోజురోజకూ పెరుగుతోంది. వీరిలో నూటికి యాభై శాతం మంది హార్ట్ ఫెయిల్యూర్ బాధితులే. గుండె పని తీరు పూర్తిగా దెబ్బతిన్న తర్వాత గానీ వైద్యులను ఆశ్రయించడం లేదు. ఫలితంగా అనేకమంది మృత్యువాత పడుతున్నారు. వచ్చే ఐదేళ్లల్లో ఈ బాధితుల సంఖ్య రెట్టింపు అయ్యే అవకాశం లేక పోలేదు’ అని హార్ట్ ఫెయిల్యూర్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆందోళన వ్యక్తం చేసింది.



హోటల్ మానస సరోవర్‌లో శనివారం నిర్వహించిన హార్ట్‌ఫెయిల్యూర్ సొసైటీ సదస్సుకు దేశవిదేశాలకు చెందిన సుమారు 400 మంది వైద్యులు హాజరయ్యారు. ప్రస్తుతం గుండె, ఊపిరి తిత్తులు, కిడ్నీ, కాలేయ సంబంధిత చికిత్సలు ఖరీ దుగా మారాయని, ఈ ఖర్చులు భరించే స్థోమత లేక చాలామంది చనిపోతున్నారని ప్రముఖ గుండె మార్పిడి వైద్యుడు ఏజీకే గోఖలే అన్నారు. అమెరికాలో 80 శాతం మందికి ఆరోగ్య బీమా ఉందని, భారత్‌లో మాత్రం 20 శాతం మందికి కూడా ఈ సౌకర్యం లేదన్నారు.



హృద్రోగ చికిత్సల్లో అనేక అధునాతన వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయని, వీటిపై వైద్యులు అవగాహన పెంచుకోవాలన్నారు. సీనియర్ కార్డియాలజిస్ట్ శశికాంత్ మాట్లాడుతూ హార్ట్ ఫెయిల్యూర్ బాధితుల్లో 60-70 శాతం మంది మృత్యువాత పడుతున్నారన్నారు. 35 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ ఏడాదికి కనీసం ఒకసారైనా వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. జీవన శైలిని మార్చుకోవడంతో పాటు మితాహారం, ప్రతి రోజూ కనీసం 40 నిమిషాల పాటు వ్యాయామం చేయడం ద్వారా జబ్బుల బారి నుంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top