అద్దె వసూలుకు వెనుకంజ

అద్దె వసూలుకు వెనుకంజ - Sakshi


మున్సిపల్ దుకాణాల కిరాయి వసూలులో సిబ్బంది మొద్దునిద్ర

 ఆరు సంవత్సరాల బకాయిలు రూ.30 లక్షలు..




వికారాబాద్: మున్సిపల్ ఆదాయం పెంచుకొనే మార్గం సులువుగా ఉన్నా.. ఇటు మున్సిపల్ యంత్రాంగం, అటు పాలకపక్షం మొగ్గుచూపకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. పట్టణంలో మున్సిపల్‌కు సంబంధించి 110 దుకాణాలున్నాయి. ఇందులో కూరగాయాల మార్కెట్‌లో 44 వరకు ఉండగా.. మిగతా దుకాణాలు డీసీఎంఎస్ ఎదురుగా బస్టాండ్ రోడ్డులో ఉన్నాయి. అంతేకాకుండా రామయ్యగూడ సమీపంలోని అంబేడ్కర్‌కాలనీలో 12 దుకాణాలు ఉన్నాయి. మున్సిపల్ సిబ్బంది వీటి అద్దెలను క్రమం తప్పకుండా వసూలు చేయడంలో ఎందుకు వెనకంజ వేస్తున్నారో..? అంతుచిక్కడం లేదు. అంబేద్కర్‌కాలనీలోని మున్సిపల్ ఇళ్లకు 20 సంవత్సరాలుగా అద్దెలు వసూలు చేయడం లేదంటే యంత్రాంగం ఎంత మొద్దునిద్రలో ఉందో ఇట్టే అర్థమవుతుంది.



1992, 1998లో మున్సిపల్‌కు సంబంధించిన ఇళ్లను, దుకాణాల సముదాయాలను అప్పటి పాలకవర్గం నిర్మింపజేసింది. అప్పటినుంచి ఇప్పటివరకు అద్దెలు పెరగనే లేదు. కొన్ని చోట్ల అసలు అడ్వా న్స్ డబ్బులు తీసుకోలేదు. అద్దెకిచ్చిన దుకాణాల నెల కిరాయిలు రూ.వెయ్యి నుంచి రూ.2600 వందల వరకు ఉన్నాయి. ఇందులో కొన్నింటికి మాత్రమే రూ.10 వేల అడ్వాన్స్ తీసుకున్నారు. ఇదిలా ఉండగా దాదాపు 20 సంవత్సరాలకుపైగా అద్దెలు పెరగలేకపోవడానికి కారణాలు తెలియడం లేదు. ప్రతీ మూడు సంవత్సరాలకోసారి అద్దెను పెంచడానికి నిబంధనలు ఉన్నప్పటికీ అమలుకు నోచుకోవడం లేదు. ఆరు సంవత్సరాలుగా పూర్తిస్థాయిలో అద్దెలు నుంచి వసూలు చేయలేదంటే కిందిస్థాయి సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారా..? లేక ఉన్నతస్థాయి అధికారులు మామూళ్లకు కక్కుర్తిపడి అద్దెలు వసూలు చేయడం లేదా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.



బకాయిపడ్డ యజమానులకు నోటీసులు ఇచ్చి అద్దె వసూలు చేస్తే సుమారు రూ.40 లక్షల ఆదాయం వచ్చే అవకాశం ఉందని.. అసలు విషయం బయటకు వస్తుందని మున్సిపల్ అధికారులే పేర్కొనగడం గమనార్హం. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అప్పట్లో ఎస్సీ క్యాటగిరీకి చెందిన కొందరికి మున్సిపల్ దుకాణాలను కేటాయించినట్లు తెలిసింది. కానీ ఆ దుకాణాల్లో ఎస్సీలు నడపడం లేదని తెలుస్తోంది. ఇప్పటికైనా మున్సిపల్ యంత్రాంగం, పాలకపక్షం అన్ని దుకాణాలకు మరోసారి బహిరంగ వేలం నిర్వహించి అద్దెలు నిర్ణయించాలని వ్యాపారులు కోరుతున్నారు

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top