చివరికి అనాథను చేశారు!

చివరికి అనాథను చేశారు! - Sakshi


అభం శుభం తెలియని ఆ పాపను విధి వంచించింది. చిన్న వయసులోనే తనను కన్న తల్లిదండ్రులు కన్నుమూశారు. అల్లారు ముద్దుగా పెంచేవారు దూరమయ్యారనే బాధతో ఉన్న ఆ బాలికను నేనున్నానంటూ చిన్నాన్నా చేరదీశాడు. 12ఏళ్ల వరకు పెంచి పోషించారు. చదివించారు కూడా. కానీ  నా అన్నవారు, చేరదీసిన వారు ప్రస్తుతం తమకు ఆర్థిక స్థోమత లేదని, పెంచి పోషించలేమంటూ దూరం చేసి చివరకు బాలికను అనాథను చేశారు. సోమవారం ఆ బాలికను వెంట తీసుకువచ్చి ఐసీడీఎస్ అధికారులకు అప్పగించి వెల్లిపోయారు. తల్లి దండ్రులు లేని సమయంలో ఆదుకున్న వారు కూడా తనను ఇలా దూరం చేశారని పుట్టెడు దు:ఖంతో బాల సదనంలో చేరింది. ఇది చూసిన అధికారులు ఇంతటి కష్టం ఇంకెవ్వరికి ఇవ్వకు దేవుడా అంటూ వేడుకున్నారు.

 

* 12 ఏళ్ల బాలిక ఐసీడీఎస్ అధికారులకు అప్పగింత

* తల్లి దండ్రులు చనిపోవడంతో చిన్నాన్న వద్దే ఉండిపోయిన బాలిక

* ప్రస్తుతం పెంచి పోషించే స్థోమత లేదని దూరం చేసుకున్న కుటుంబసభ్యులు


ఇందూరు: ఆ బాలిక పేరు శ్రుతి. వర్ని మండల కేంద్రం వడ్డెపల్లికి చెందిన  తన తల్లిదండ్రులు తన చిన్న తనంలోనే ప్రమాదవశాత్తు మరణించారు. ఒంటరిగా ఉన్న బాలికను తన చిన్నాన్నా చేరదీసి పెంచి పోషించాడు.  తన సొంత కూతురు మాదిరిగా చూసుకున్నాడు. ఊళ్లోనే ప్రభుత్వ పాఠశాలలో ఐదవ తరగతి వరకు చదివించాడు. కానీ చిన్నాన్నా కుటుంబానికి రానురాను ఆర్థిక ఇబ్బందులు మొదలయ్యాయి. దీంతో తన కుటుంబాన్నే నడిపించడం  కష్టంగా మారింది. ఏం చేయాలో తెలియని పరిస్థితిలో చేరదీసిన బాలికను దూరం చేసుకోలేక తప్పలేదు.



తెలిసిన వారికి దత్తతన్వికుండా ఐసీడీఎస్ అధికారులకు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాడు. అధికారులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి వెల్లిన అధికారులు బాలికకు, చిన్నాన్నాకు కౌన్సెలింగ్ నిర్వహించారు. గ్రామ పెద్దలతో,సర్పంచుతో మాట్లాడారు. బాలికను అప్పగిస్తున్నామని అంగీకారం తెలుపుతూ బాండ్ పేపర్‌పై చిన్నాన్నా, వారి కుటుంబ సభ్యుల, గ్రామ పెద్దల సంతకాలు తీసుకున్నారు. అయితే బాలికను తీసుకుని సోమవారం రోజు ఐసీడీఎస్ కార్యాలయాని రావాలని సూచించారు. బాలికతో వచ్చిన చిన్నాన్నా ఐసీడీఎస్ అధికారులకు బాలికను అప్పగించి వెళ్లాడు.



స్వాధీనం చేసుకున్న అధికారులు సీడబ్ల్యూసీ కమిటీ ముందు బాలికను హాజరు పరిచి వసతికల్పన కోసం బాల సదనంకు తరలించారు. బాలికకు ఉచిత వసతితో పాటు విద్యను అందించనున్నట్లు అధికారులు తెలిపారు. అయితే తల్లి దండ్రులు చనిపోయారనే ఒక బాధ, ఆర్థిక స్థోమత లేక చిన్నాన్నా వాళ్లు కూడా చివరకు అనాథను చేశారనే మరో బాధతో సదరు బాలిక పట్టరాని దు:ఖంతో ఏడ్చింది. పాపం ఇన్ని రోజులు అందరితో కలిసిమెలిసి ఉండి నేడు అనాథలుండే భవనంలో ఒకరిగా చేరింది. ఊహ తెలిసిసోచ్చిన వయసులో బాలికకు నా అన్న వారు కూడా లేరంటే పాపం ఎంతగా బాధపడిందో చెప్పనక్కర్లేదు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top