‘చెమట సుక్క’ సిన్నబోయింది!


- ప్లీనరీలో నల్లపూసైన హరీశ్‌రావు

- వేదిక పై రెండో వరుస చివరలో కూర్చున్న మంత్రి

- ‘వైఫై మాయ’ అంటున్న మెతుకుసీమ కార్యకర్తలు

సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి:
‘సెంటు వాసన’ పరిమళంతో చెమట చుక్క చిన్నబోయింది. ఒక్కో కార్యకర్తను పోగేసి, గుంపు కట్టిన యువ‘జన నాయకుడు’ తెలంగాణ పార్టీ తొలి ప్లీనరీలో వెనుక బెంచీకే పరిమితం కావడం మెతుకు సీమలో రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. అంతా తానై పార్టీ ప్లీనరీని నడిపించాల్సిన నీటిపారుదలశాఖ మంత్రి టి.హరీశ్‌రావు అంటీముట్టనట్టు ఉండటం పై పార్టీ కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు.



అధికార టీఆర్‌ఎస్ పార్టీ ప్లీనరీ కావడంతో ఎలక్ట్రానిక్ మీడియా పూర్తిస్థాయి ప్రసారాలు చేసింది. ఎక్కడ కూడా హరీశ్‌రావు హల్‌చల్ లేకపోవడం పై పార్టీ నేతలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ప్లీనరీ సజావుగా సాగటం కోసం టీఆర్‌ఎస్ పార్టీ ఏడు కమిటీలు వేసింది. ఏ ఒక్క కమిటీలోనూ హరీశ్‌రావుకు స్థానం కల్పించలేదు. అప్పటినుంచే పార్టీ కేడర్‌లో గుసగుసలు మొదలయ్యాయి. కేసీఆర్ పార్టీ అధ్యక్షునిగా ఏక గ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించగానే రాష్ట్ర మంత్రులు, ఇతర ముఖ్య నాయకులు కేసీఆర్‌కు అభినందనలు చెప్పడానికి ఎగబడ్డారు. కొందరు నేతలు కరచాలనం చేయగా... ఇంకొందరు నేతలు పుష్పగుచ్ఛాలు ఇచ్చి అభినందించారు. కానీ హరీశ్‌రావు మాత్రం ముబావంగా ఉండిపోయారు.   ప్లీనరీ సమయంలో వీఐపీ గ్యాలరీలో కొద్దిసేపు కూర్చున్న తరువాత వేదిక మీదకు వెళ్లారు.



అక్కడ ముందు వరుసలో కాకుండా రెండో వరుస చివరన కూర్చున్నారు. ‘హరీశ్‌రావు ఏడి..?, ఎక్కడ ఉన్నడు?’ అని అన్ని గ్యాలరీల్లోని పార్టీ కార్యకర్తలు ఆయన్ను వెతకడం కనిపించినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఉదయం సెషన్‌లో హరీశ్‌రావు పెద్దగా కనిపించకపోవడం గమనార్హం.. ‘ఇందంతా వైఫై... హైఫై మాయాసార్.. సెంటు రుద్దుకొని స్టార్ హోటళ్లలో మీటింగులు పెట్టుకునేటోళ్లకు, జనం మధ్య నిలబడిన నేత  ‘చెమట వాసన’ ఎట్టా గిట్టుంది సార్’ అంటూ పలువురు టీఆర్‌ఎస్ కార్యకర్తలు తమ ఆక్రోశాన్ని వెల్లగక్కారు. పార్టీలో అందరికీ ప్రాముఖ్యత కల్పించాలనే ఆలోచనతోనే హరీశ్‌రావు కొద్దిగా వెనక్కి తగ్గారని, ఇందులో పెద్దగా ఆలోచించాల్సింది లేదని హరీష్‌రావు సన్నిహితులు చెబుతున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top